పళణి కోటలోకి శశికళ! 

7 Sep, 2022 06:55 IST|Sakshi

సాక్షి, చెన్నై : మాజీ సీఎం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళని స్వామి సొంత జిల్లాలో పర్యటించేందుకు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ సిద్ధమయ్యారు. చెన్నై నుంచి బుధవారం ఆమె తంజావూరు మీదుగా పర్యటనకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకున్నారు. అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలను చిన్నమ్మ శశికళ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తన మద్దతుదారులను ఏకం చేస్తూ పర్యటనలపై దృష్టి పెట్టారు. ఈసారి ఆమె అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి జిల్లాను టార్గెట్‌ చేశారు.

అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం, పళణి స్వామి మధ్య వివాదం సాగుతోన్న నేపథ్యంలో చిన్నమ్మ శశికళ సేలం, నామక్కల్‌ జిల్లాలపై దృష్టి పెట్టడం రాజకీయంగా ప్రాధాన్యతకు దారి తీసింది. పళణి స్వామి ఆయన సన్నిహితుడు, మాజీ మంత్రి తంగమణి మద్దతుదారుల్ని తన వైపునకు తిప్పుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటనలో చిన్నమ్మ వ్యూహరచన చేసినట్లు సమాచారం. అక్రమాస్తుల కేసులో తాను జైలుకు వెళ్తూ పళణి స్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆమెను పళణి స్వామి సాగనంపి ఆ పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో పళణి సొంతజిల్లాలో పర్యటించే చిన్నమ్మ శశికళ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే విషయం ఆసక్తి కలిగిస్తోంది. 

రెండు రోజుల పర్యటన ఖరారు 
సేలం, నామక్కల్‌లో చిన్నమ్మ శశికళ పర్యటన రెండు రోజులు సాగనుంది. ఇందుకు తగ్గ రూట్‌ మ్యాప్‌ను మంగళవారం విడుదల చేశారు. బుధవారం ఉదయం టీ నగర్‌ నివాసం నుంచి తంజావూరు వైపుగా శశికళ పర్యటన ప్రారంభమవుతుంది. గురువారం తిరుత్తొరై పూండిలో కొత్తగా నిర్మించిన షిరిడీ సాయిబాబా ఆలయ కుంభాభిషేకం వేడుకల్లో ఆమె పాల్గొంటారు. తంజావూరు, తిరువారూర్, సేలం, నామక్కల్, పుదుకోట్టై, ఈరోడ్‌ జిల్లాల నేతలతో 9.10 తేదీల్లో సమావేశాలు నిర్వహిస్తారు. 11వ తేదీ ఉదయం తంజావూరు నుంచి  తిరువయ్యారు. తిరుమానూరు, కీల పలలూరు, అరియలూరు, పెరంబలూరు జిల్లాల వైపుగా ఆమె పర్యటన ఉంటుంది. 

అదే రోజు మధ్యాహ్నం సేలంలో పలు ప్రాంతాల్లో శశికళ పర్యటించనున్నారు. పార్టీ కేడర్, నాయకులతో వివిధ అంశాలపై చర్చిస్తారు. ఆ రాత్రి సేలంలో బస చేసి 12వ తేదీ నామక్కల్‌ జిల్లాలో, అరియలూరు కొన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నారు. శశికళ పర్యటన నేపథ్యంలో తన మద్దతు దారులు, సర్వ సభ్య సభ్యులు, ముఖ్యులు చేజారకుండా పళణిస్వామి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది.    

మరిన్ని వార్తలు