బీజేపీ vs ఇండియా: ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్

5 Sep, 2023 08:13 IST|Sakshi

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు నేడు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. దేశంలో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇండియా కూటమికి, అధికార బీజేపీకి మధ్య మొదటి పోటీగా ఈ పోలింగ్‌ను రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. 

జార్ఖండ్‌లోని డుమ్రి, త్రిపురలోని బోక్సానగర్, మధన్‌పూర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 8న కౌంటింగ్ నిర్వహించనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణాల కారణంగా ధూప్‌గురి, పుతుపల్లి, బాగేశ్వర్, డుమ్రీ, బోక్సానగర్‌లలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఘోసి, ధన్‌పూర్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. 

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) ఎమ్మెల్యే పదవికి దారా సింగ్ చౌహాన్ రాజీనామా చేయడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఘోసిలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆయన రాజీనామా తర్వాత బీజేపీలో చేరారు. ఉపఎన్నికలకు ఎస్పీ సుధాకర్ సింగ్‌పై బీజేపీ దారా సింగ్ చౌహాన్‌ను రంగంలోకి దింపింది.దారా సింగ్ చౌహాన్ ఘోసీ నుంచి 2012 నుంచి 2017 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆ తర్వాత వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తన మిత్రపక్షమైన ఎస్పీకి మద్దతునిస్తోంది.

త్రిపురలోని ధన్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ప్రతిమా భూమిక్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయడంతో సీటు ఖాలీ అయింది. ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఐ-ఎం) అభ్యర్థి కౌశిక్ చందాపై ప్రతిమా భూమిక్‌ సోదరుడు బిందు దేబ్‌నాథ్‌ను భాజపా బరిలోకి దింపుతోంది. అటు.. ఉమెన్ చాందీ మరణంతో పుతుపల్లి సీటు ఖాళీ కావడంతో ఈరోజు పోలింగ్ జరుగుతోంది. సీపీఎం అభ్యర్థి జైక్‌ సీ థామస్‌పై కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఫ్రంట్‌ సీనియర్‌ నేత తనయుడు చాందీ ఉమెన్‌ను బరిలోకి దింపింది.

ఇదీ చదవండి: కుల విభేదాల్ని మాత్రమే ఖండించా.. ఉదయ్‌నిధి స్టాలిన్‌ తాజా ప్రకటన

మరిన్ని వార్తలు