సభ్యుల తీరుపై వెంకయ్య కంటతడి

12 Aug, 2021 05:12 IST|Sakshi
రాజ్యసభలో మాట్లాడుతున్న వెంకయ్య

సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు సభలో భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. సభలో సభ్యులు వ్యవహరించిన తీరుతో తాను నిద్రలేని రాత్రి గడిపినట్టు పేర్కొన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ముందురోజు మంగళవారం సభలో విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ ప్రకటన చేశారు. పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా, సభలో సెక్రటరీ జనరల్, ఇతర అధికారులు కూర్చునే టేబుల్‌ ఉండే చోటును గర్భగుడిగా అభివర్ణిస్తూ, అలాంటి ప్రదేశం పవిత్రతను నాశనం చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ‘నిన్న ఈ పవిత్రతను నాశనం చేశారు.

కొంతమంది సభ్యులు టేబుల్‌ మీద కూర్చున్నారు. మరికొందరు టేబుల్‌ పైకి ఎక్కారు. నా ఆవేదనను తెలియజేయడానికి, ఈ చర్యను ఖండించడానికి నాకు మాటలు లేవు..’ అని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన సంఘటన వల్ల తాను నిద్ర లేని రాత్రి గడిపానని చెబుతూ చైర్మన్‌ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ‘వ్యవసాయ సమస్యలు, పరిష్కారాలు’ అంశం చర్చ జరుగుతున్నప్పుడు సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి, ప్రత్యేకించి గత సంవత్సరం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్న వారికి సువర్ణావకాశం లభించిందని, కానీ చర్చ జరపకుండా సభ్యులు అంతరాయం సృష్టించారని ఆవేదన వ్యక్తంచేశారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు