Vundavalli Aruna Kumar: చంద్రబాబు, పవన్‌ కలిసే ఎన్నికలకు వెళ్లే అవకాశం

25 May, 2022 05:36 IST|Sakshi
మాట్లాడుతున్న ఉండవల్లి

మతోన్మాద శక్తుల వల్ల దేశానికి ప్రమాదం

రాష్ట్రంలో ద్విముఖ పోటీనే ఉండబోతోంది

సీఎం జగన్‌పై ఉన్న కేసుల్లో జరిమానాలే తప్ప శిక్షలు పడే అవకాశం లేదు

‘మీట్‌ ది ప్రెస్‌’లో మాజీ ఎంపీ ఉండవల్లి

అజిత్‌సింగ్‌ నగర్‌ (విజయవాడ సెంట్రల్‌): దేశంలో మతపరమైన రాజకీయాలు పెరుగుతున్నాయని, మతోన్మాద శక్తుల వల్ల దేశ మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. విజయవాడ గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. దేశంలో మత రాజకీయాలు పెరుగుతున్నాయని, దీనివల్ల కలిగే ప్రమాదాలను గుర్తించి సామ్యవాదులు, లౌకికవాదులు బయటకు వచ్చి తమ గళాన్ని వినిపించాలని కోరారు. కాంగ్రెస్‌లో కీలక పదవులు అనుభవించిన కొందరు బీజేపీ అధికారంలో ఉందనో, ఏదో పదవి వస్తుందనే ఆశతో ఆ పార్టీలో చేరుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.  

రాష్ట్రంలోనూ కుల రాజకీయాలు
రాష్ట్రంలో కూడా కుల రాజకీయాలు పెరుగుతున్నాయని ఉండవల్లి అన్నారు. 2014 నుంచి కమ్మ, రెడ్లు, కాపులంటూ ముసుగు తీసేసి మరీ రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

బాబు, పవన్‌ కలిసే పోటీ
రానున్న ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. బీజేపీ నిర్ణయం కోసం పవన్‌ ఎదురు చూస్తున్నట్టు ఉందన్నారు. టీడీపీతో కలిసేందుకు బీజేపీ కాదంటే పవన్‌ బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఈసారి త్రిముఖ పోటీ కన్నా ద్విముఖ పోటీనే ఉంటుందని వివరించారు. ఈడీ కేసులలో పెద్దగా శిక్షలు పడే అవకాశం లేదని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేసుల్లో కూడా జరిమానాలే తప్ప శిక్షలు ఉండకపోవచ్చని అన్నారు. 

మరిన్ని వార్తలు