బీజేపీ ప్రత్యామ్నాయ శక్తికి.. కేసీఆర్‌ నాయకత్వం

14 Jun, 2022 01:03 IST|Sakshi

ఆయనకు ఆ సత్తా ఉంది: ఉండవల్లి 

బీజేపీకి చెక్‌ పెట్టే అజెండాతో సిద్ధమయ్యారు  

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: బీజేపీ ప్రత్యామ్నాయ శక్తికి నాయకత్వం వహించే సత్తా తెలంగాణా సీఎం కేసీఆర్‌కు ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. తాజాగా కేసీఆర్‌ను హైదరాబాద్‌లో కలసిన ఉండవల్లి సోమవారం రాత్రి రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. తాను మొదటి నుంచి బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పలు విషయాలపై చర్చించేందుకు కేసీఆర్‌ ఆహ్వానించారని తెలిపారు. బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తి ఏర్పాటు కావాలని కేసీఆర్‌ చాలా పట్టుదలతో ఉన్నారని, ఇందుకోసం ఆయన చాలా అంశాలపై లోతైన అధ్యయనం చేశారని ఉండవల్లి చెప్పారు. తమ మధ్య జాతీయ పార్టీ గురించి ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.  

బీజేపీ పరిస్థితిపై టీమ్‌ వర్క్‌  
కేసీఆర్‌ వద్ద బీజేపీకి చెక్‌ పెట్టే అజెండా ఉందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా గళం వినిపించగలుగుతారని, ఆయనకు ఆ సామర్థ్యం ఉందన్నారు. ఒక జాతీయ పార్టీని బీజేపీకి వ్యతిరేకంగా తయారు చేయాలనే ఆలోచతో కేసీఆర్‌ ఉన్నారన్నారు. బీజేపీ పరిస్థితిపై ఒక టీమ్‌ వర్క్‌ చేస్తున్నారని చెప్పారు. మమతా బెనర్జీ కంటే కేసీఆర్‌ హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ బీజేపీ వ్యతిరేక భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోగలరనే నమ్మకం తనకుందన్నారు.

బీజేపీని వ్యతిరేకించే వారంతా కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలన్నారు. ఈ దిశగా మమతాబెనర్జీ, స్టాలిన్, క్రేజీవాల్, అఖిలేష్‌యాదవ్‌ లాంటి వారు సిద్ధంగా ఉన్నారన్నారు. తాను రాజకీయాల నుంచి రిటైరయ్యారని, కొనసాగే ఉద్దేశం తనకు లేదని చెప్పానన్నారు. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్నారు. 

ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు 
బీజేపీ ప్రభావం మరింత పెరిగితే దేశానికి నష్టం జరుగుతుందని ఉండవల్లి పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడిందని, పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ప్రధాన మోదీ దేశంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేస్తున్నారని విమర్శించారు. సోనియా, రాహుల్‌గాంధీ.. ప్రతి ఒక్కరినీ కేసులతో ప్రశ్నించకుండా చేస్తున్నారని ఆక్షేపించారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో నాలుగైదు దేశాలు మన రాయబారులను పిలిచి నిరసన తెలియచేశాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు.   

మరిన్ని వార్తలు