అమరావతి రైతులది రాజకీయ యాత్ర

1 Nov, 2021 03:47 IST|Sakshi

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి

తాడికొండ: అమరావతి రైతులు చేపట్టింది మహా పాదయాత్ర కాదని, అది రాజకీయ యాత్ర అని తాడికొండ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి చెప్పారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు అమరావతి రైతుల పేరుతో తన హయాంలో జరిగిన అవినీతిని కాపాడుకోవాలని, చతికిలపడిన టీడీపీని బతికించుకోవాలని కొత్త ఎత్తుగడ వేశాడన్నారు. ఈ పాదయాత్రలో పాల్గొంటుంది తెలుగుదేశం పార్టీ నాయకులైతే వారిని నడిపిస్తుంది చంద్రబాబేనని చెప్పారు.

29 గ్రామాల్లో కొనసాగుతున్న అమరావతి ఉద్యమానికి ఓ సామాజికవర్గం మినహా ఇతర కులాల్లో ఆదరణ కొరవడటంతో ప్రజలను రెచ్చగొట్టి లబ్ధిపొందేందుకు చంద్రబాబు పాదయాత్ర పెట్టించి పెయిడ్‌ ఉద్యమాన్ని ఎల్లో మీడియాలో ఊదరగొట్టించడం సిగ్గుచేటని విమర్శించారు. అమరావతి రైతులు యాత్ర చేయాల్సింది తుళ్ళూరు నుంచి తిరుపతికి కాదన్నారు. మూడు పంటలు పండే భూమిని తీసుకుని ఈ ప్రాంత రైతులను నిలువునా ముంచి ఉండవల్లిలో ఉంటున్న చంద్రబాబు నివాసానికి వెళ్లి తాత్కాలికం పేరిట ఎందుకు దోపిడీ చేశాడో నిలదీయాలని సూచించారు.

నీరుగారిన అమరావతి ఉద్యమాన్ని జాకీలు పెట్టి లేపేందుకు ఎల్లో మీడియా, చంద్రబాబు వేస్తున్న ఎత్తులను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ని కుస్తీపట్లు పట్టినా జనం చంద్రబాబును నమ్మేస్థితిలో లేరన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందడుగు వేసి మూడు రాజధానులకు శ్రీకారం చుడితే చంద్రబాబు కోర్టుల్లో తప్పుడు కేసులు వేయించి స్టేలు తీసుకొచ్చాడని చెప్పారు.

అమరావతి రైతులతో చర్చించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా రాజధాని ముఖద్వార రహదారి నిర్మాణానికి రూ.120 కోట్లతో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారని గుర్తుచేశారు. రాజధాని రైతులు చంద్రబాబు మాటలువిని మోసపోకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలు విన్నవిస్తే తప్పక మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు