‘బీజేపీ జీరో కావాలన్నదే నా కోరిక’

25 Apr, 2023 06:29 IST|Sakshi
కోల్‌కతాలో భేటీ సందర్భంగా మమత, నితీశ్‌. తేజస్వీ యాదవ్‌

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

బిహార్‌ సీఎం నితీశ్, డిప్యూటీ తేజస్విలతో భేటీ

విపక్ష కూటమి ఏర్పాటుపై చర్చలు

కోల్‌కతా: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ‘జీరో’గా మారిపోవాలని తాను కోరుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. కేవలం మీడియా మద్దతు, అబద్ధాలతోనే బీజేపీ ‘పెద్ద హీరో’గా మారిందని ఎద్దేవా చేశారు. బీజేపీని కనుమరుగు చేయడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు.

మమతా బెనర్జీ, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ సోమవారం బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో సమావేశమయ్యారు. ఈ భేటీలో బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ కూడా పాల్గొన్నారు. 2024 జరిగే లోక్‌సభలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతపై వారు చర్చించారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలను కలుపుకొని బలమైనా కూటమిని ఎలా నిర్మించాలన్న దానిపై వారు చర్చించుకున్నట్లు తెలిసింది.  

విపక్ష కూటమిలో కాంగ్రెస్‌ కూడా..  
విపక్షాలు కలిసి కూర్చొని చర్చించుకోవాలని, ఎన్నికల వ్యూహాలు రూపొందించుకోవాలని నితీశ్‌ కుమార్‌ సూచించారు. మమతా బెనర్జీతో తమ సమావేశం సానుకూలంగా జరిగిందని అన్నారు. భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ అభివృద్ధి కోసం బీజేపీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. సొంత ప్రచారం కోసమే అధికార పక్షం పాకులాడుతోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఉన్నాయనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ పోరాటం బిహార్‌ నుంచే మొదలైందని, బిహార్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, తదుపరి కార్యాచరణపై చర్చిస్తే బాగుంటుందని నితీశ్‌కుమార్‌తో చెప్పానని వివరించారు. విపక్ష కూటమిలో కాంగ్రెస్‌ కూడా భాగస్వామిగా చేరుతుందా? అని ప్రశ్నించగా.. అన్ని పార్టీలూ భాగస్వామిగా ఉంటాయని మమత బదులిచ్చారు.  వచ్చే ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడమే లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యత కోసం మమతా బెనర్జీ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెలలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో సమావేశమయ్యారు. నితీశ్‌ కుమార్‌ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ నేత రాçహుల్‌ గాంధీని కలిసి, కూటమి ఏర్పాటుపై చర్చించారు.  

వృథా ప్రయాస: బీజేపీ  
మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌ భేటీతో ఒరిగేదేమీ ఉండదని, అదొక వృథా ప్రయాస అని పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధికార ప్రతినిధి సమిక్‌ భట్టాచార్య తేల్చిచెప్పారు. 2014చ 2019లో కూడా విపక్షాల ఐక్యత పేరిట ప్రయత్నాలు జరిగాయని, చివరకు ఏం జరిగిందో మనకు తెలిసిందేనని పేర్కొన్నారు. దేశ ప్రజలు బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని తెలిపారు. అస్థిరమైన, అవకాశవాద కూటమికి ప్రజలు ఓటు వేయబోరని స్పష్టంచేశారు.

ప్రాంతీయ పార్టీలు సొంత రాష్ట్రాల్లో మనుగడను కాపాడుకొనేందుకు ఒక్కతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు సుకాంతా మజుందార్‌ వెల్లడించారు. బీజేపీ విమర్శలను తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ శాంతను సేన్‌ తిప్పికొట్టారు. 2024లో మళ్లీ అధికారం చేపట్టాలన్న బీజేపీ కలలు నెరవేరే ప్రసక్తే లేదన్నారు. ప్రతిపక్షాలు ఒక్కటవుతుండడంతో బీజేపీలో వణుకు మొదలైందన్నారు.

అఖిలేశ్‌తో నితీశ్‌ భేటీ
లక్నో:  బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌ కుమార్‌ సోమవారం లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి కూలదోయడానికి సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. దేశంలో ప్రజలు సమస్యల్లో కూరుకుపోయారని అఖిలేశ్‌యాదవ్‌ అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు.   

కర్ణాటక ఎన్నికల అనంతరం విపక్షాల కీలక భేటీ!
న్యూఢిల్లీ: బీజేపీ వ్యతిరేక కూటమిపై కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం స్పష్టత రానుంది. ఆ ఎన్నికల తర్వాత 19 విపక్ష పార్టీల అగ్రనేతలు సమావేశం కానున్నారని, కూటమి ఏర్పాటుపై చర్చిస్తారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ భేటీకి ఆతిథ్యం ఇస్తున్నట్లు తెలిపాయి. కూటమి విషయంలో ఆయన ఇప్పటికే వివిధ పార్టీల నేతలతో మాట్లాడారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఖర్గే అతి త్వరలో భేటీ కానున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు