Karnataka: సీఎం ఎదుటే స్టేజిపై కొట్టుకున్నంత పనిచేసిన డిప్యుటీ సీఎం, ఎంపీ.. వైరల్‌ వీడియో

3 Jan, 2022 20:43 IST|Sakshi

సాక్షి, బెంగుళూరు: కర్ణాటకలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వేదికపైనే వాగ్వాదానికి దిగారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమక్షంలోనే కొట్టుకున్నంత పనిచేశారు. రామనగరలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, బెంగుళూరు నగర నిర్మాత నడప్రభ కెంపెగౌడ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరింది. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్‌ మాట్లాడుతుండగా.. జనంలో నుంచి కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుతగిలారు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అశ్వత్‌ నారాయణ్‌.. డీకే సురేష్‌పైనా, కాంగ్రెస్‌ పార్టీపైనా విమర్శలు చేశారు. సురేష్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం రాజుకుంది. ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య మాటామాట పెరిగింది. ఇరు వర్గాలవారు కూడా వారికి తోడవడంతో గందరగోళం నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు సర్దిచెప్పాలని ప్రయత్నించగా.. స్టేజ్‌పైనే ఎంపీ డీకే సురేష్‌ ధర్నాకు దిగారు. ఇక కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ రవి మరో అడుగు ముందుకేసి అశ్వత్ నారాయణ్‌ మైక్‌ లాక్కునే ప్రయత్నం చేశారు.
(చదవండి: గూగుల్‌ సెర్చ్‌లో ట్రెండ్‌ కరోనాదే.. టాప్‌ 10 జాబితా ఇదే!)

చివరకు పోలీసులు, సెక్కురిటీ సిబ్బంది గుమిగూడిన ఇరు వర్గాలవారిని వారి వారి స్థానాల్లోకి పంపించివేయడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం సీఎం బొమ్మై ప్రసంగిస్తూ అంబేడ్కర్‌, కెంపెగౌడ గౌరవార్థం చేపట్టిన కార్యక్రమంలో రాజకీయ గందరగోళం నెలకొనడం దురదృష్టకరమన్నారు. అందరం కలిసికట్టుగా అభివృద్ధి సాధిద్దామని పిలుపునిచ్చారు. కాగా, నేతల ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(చదవండి: Viral: ఈ ఫోటోలో చిరుత దాగి ఉందా.. గుర్తు పట్టడం చాలా కష్టమండోయ్‌..)

మరిన్ని వార్తలు