పదేళ్లు ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క

19 Dec, 2023 02:02 IST|Sakshi

అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లాను సుభిక్షంగా మారుస్తాం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘గత పదేళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం..’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంత్రి అయ్యాక మొదటి సారి ఆయన సోమవారం నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు.

అంతకుముందు ఆయన ఆంథోల్‌ మైసమ్మగుడి వద్ద, నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. మూడేళ్లలోనే ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి చేస్తామని, ఆరు నెలల్లో బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నా రు. నల్లగొండ జిల్లాను సుభిక్షంగా మారుస్తామని పేర్కొన్నారు. అక్రమ ఇసుక దందా, బెల్టు షాపుల ఆట కట్టిస్తామన్నారు.

గత పాలకుల్లాగా అధికారు లను తాము ఇబ్బంది పెట్టబోమని, అంతా కలిసి పనిచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కర్ణన్‌ అధ్యక్షతన మిషన్‌ భగీరథ, నీటిపారుదల, రోడ్డు భవనాలు, ఇతర శాఖల ఈఎన్‌సీలతో సమీక్షించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్‌ భగీరథ చేపట్టినా ఇంకా చాలా గ్రామాలకు నీరందడం లేదని, సంబంధిత ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రైతులకు విద్యుత్‌ సర ఫరాలో అంతరాయం లేకుండా అవసరమైన సబ్‌ స్టేషన్లు, ఇతర విస్తరణ పనులు చేయించాలని, దీనిపై నివేదికలు ఇస్తే ప్రభుత్వంతో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో విద్యు త్‌ ప్రమాదాల్లో 32 మంది చనిపోయినా వారికి గత ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోవడం బాధాకర మని చెప్పారు. వెంటనే వారికి న్యాయం చేయాల న్నారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు అనిల్‌రెడ్డి, బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, జైవీర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు