బెంగాల్‌, తమిళనాడు కీలక ప్రకటన

26 Feb, 2021 18:54 IST|Sakshi

కోల్‌కతా/చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగే సమయానికి కొన్ని గంటల ముందు పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ప్రభుత్వాలు కీలక ప్రకటన చేశాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయడానికి ముందే ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో సంక్షేమ పథకాలు ప్రకటించాయి. రోజూవారీ కూలీల వేతనాన్ని పెంచుతామని బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ శుభవార్త వినిపించగా, బంగారంపై తీసుకున్న రుణాల మాఫీ పథకాన్ని తమిళనాడు సీఎం పళనిసామి హామీ ఇచ్చారు. ఆ వివరాలు...

వారికి రోజూ రూ. 404
పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం రోజూ వారీ వేతన కూలీలను మూడు కేటగిరీలుగా విభజించింది. నైపుణ్యాల ఆధారంగా వారి వేతన పెంపును ఖరారు చేసింది. కాగా రాష్ట్రంలో మొత్తం 56,500 మంది కార్మికులు(అన్‌స్కిల్డ్‌ లేబర్‌- 40,500, సెమి స్కిల్డ్‌ లేబర్‌- 8000, స్కిల్డ్‌ లేబర్‌- 8000) ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. 

వేతన పెంపు ఇలా:
అన్‌స్కిల్డ్‌ లేబర్‌: రూ. 144 నుంచి రూ. 202కు
సెమి స్కిల్డ్‌ లేబర్‌: రూ. 172- రూ. 303
స్కిల్డ్‌ లేబర్‌: రూ. 404

వారికి రుణ మాఫీ
ఇక పేద కుటుంబాలు, మహిళలను రుణ విముక్తులను చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం బంగారంపై రుణమాఫీ పథకాన్ని ప్రకటించింది. సహాయక బృందాల్లోని మహిళలకు ఈ పథకం ఎంతో మేలు చేకూరుస్తుందని పేర్కొంది. ‘‘కో- ఆపరేటివ్‌ బ్యాంకులు, కో- ఆపరేటివ్‌ సొసైటీల్లో బంగారం తనఖా పెట్టిన వారికి రుణం మాఫీ చేస్తాం’’ అని ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతంలో పుదుచ్చేరిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కీలక ప్రకటన చేశారు. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ 2 శాతం మేర తగ్గించున్నట్లు పేర్కొన్నారు. కాగా పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. బెంగాల్‌ మినహా మిగతా అన్నిచోట్ల ఒకే విడతో పోలింగ్‌ నిర్వహించనున్నారు.

చదవండిఅందుకే బెంగాల్‌లో 8 విడతల్లో ఎన్నికలు: సీఈసీ

మరిన్ని వార్తలు