మరో ఎమ్మెల్యే జంప్‌: ఉప ఎన్నికల వేళ బెంగాల్‌లో బీజేపీకి షాక్‌

4 Sep, 2021 16:37 IST|Sakshi
ఎమ్మెల్యే సౌమెన్‌ రాయ్‌ను స్వాగతిస్తున్న ముకుల్‌ రాయ్‌

బీజేపీ నుంచి చేజారిన నలుగురు ఎమ్మెల్యేలు

మరికొందరు చేరే అవకాశం

కాషాయ పార్టీకి ఊహించని షాక్‌లు

కలకత్తా: తాజాగా పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో బెంగాల్‌ రాజకీయం మళ్లీ హాట్‌హాట్‌గా మారింది. ప్రకటన అలా వెలువడిందో లేదో ఇలా బీజేపీ ఊహించని షాక్‌ తగిలింది. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీకి బై బై చెప్పేస్తున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కాషాయ పార్టీని వదిలేసి అధికార పార్టీ బాట పట్టారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే సౌమోన్‌ రాయ్‌ శనివారం చేరారు. 
చదవండి: ఆస్పత్రి బాత్రూమ్‌లో ప్రసవించిన అత్యాచార బాధితురాలు

ఇప్పటికే ముకుల్‌ రాయ్‌, తన్మయ్‌ ఘోష్‌, విశ్వజిత్‌ దాస్‌లు బీజేపీని వీడి టీఎంసీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కలియగంజ్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సౌమెన్‌ రాయ్‌ అధికార పార్టీ కండువా మార్చుకున్నారు. ‘రాష్ట్ర అభివృద్ధితో పాటు, ఉత్తర బెంగాల్‌ అభివృద్ధి కోసం పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నా’ అని సౌమెన్‌ రాయ్‌ తెలిపారు. అయితే ఈయనతో కలిపి టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం నాలుగుకు చేరింది. అయితే వీరంతా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన వారే. బీజేపీ అధికారంలోకి వస్తుందనే హైప్‌ రావడంతో వారంతా మమతాను వదిలేసి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ తిరిగి సొంతగూటికి చేరుతున్నారు. వీరిని చూసి మరికొందరు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీలోకి చేరే అవకాశం ఉంది. ఒకప్పుడు తృణమూల్‌లో ఉన్నవారంతా ఇప్పుడు మళ్లీ వచ్చేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఉప ఎన్నికల వేళ ఈ పరిణామం బీజేపీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

చదవండి: సీక్రెట్‌ యాప్‌తో భార్య ఫోన్‌ ట్యాపింగ్‌.. ఆమెపై నీడలా భర్త

మరిన్ని వార్తలు