బెంగాల్‌ దంగల్:‌ కీలకంగా సింగూర్‌–హుగ్లీ

1 Mar, 2021 08:25 IST|Sakshi

2019 తర్వాత స్థానిక రాజకీయాల్లో మార్పులు

హుగ్లీపై తృణమూల్‌ ప్రత్యేక దృష్టి

టీఎంసీ కంచుకోటలో పాగాకు కమలదళం యత్నం

హుగ్లీ జిల్లాలో రెండు విడతల్లో పోలింగ్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఎవరికి వారు తమ విజయావకాశాలపై గంపెడాశలు పెట్టుకొని వ్యూహరచనలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారపీఠాన్ని వదులుకొనేందుకు ఇష్టపడని తృణమూల్‌ కాంగ్రెస్‌ కమలదళాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వామపక్షాలను పక్కకునెట్టి తృణమూల్‌ కాంగ్రెస్‌ను అధికార పీఠంపై కూర్చోపెట్టడంలో నందిగ్రామ్‌ ఉద్యమంతో పాటు హుగ్లీ ప్రాంతం కీలక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

హుగ్లీ జిల్లాలో ఉన్న సింగూర్‌లో బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేసిన ఆందోళన, రాష్ట్రంలో అధికార మార్పుకు కారణమైంది. సింగూర్‌ నుంచి టాటా మోటార్స్‌ ఫ్యాక్టరీ వైదొలగడంతో మమతా బెనర్జీ గద్దెనెక్కారు. దీంతో బెంగాల్‌ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారిన సింగూరుపై పట్టు నిలుపుకొనేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇప్పుడు మరోసారి ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించింది. కేవలం టీఎంసీ మాత్రమే కాకుండా మిగతా రాజకీయ పార్టీలు సింగూరు కేంద్రంగా హుగ్లీ జిల్లాలో ఎన్నికలపై వ్యూహ రచనలు సిద్ధం చేసుకున్నాయి.  

సింగూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచిన పార్టీనే హుగ్లీ జిల్లా వ్యాప్తంగా ప్రజలు గెలిపించుకుంటారనేది విశ్లేషకుల అభిప్రాయం. బెంగాల్‌ రాజకీయాల్లో 2011లోనే కీలక పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, 2001లోనే సింగూర్‌లో దీనికి బీజం పడింది. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన రవీంద్రనాథ్‌ భట్టాచార్య 20 ఏళ్లుగా సింగూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కంటే ముందు వామపక్షాలు, కాంగ్రెస్‌ పారీ్టలు ఈ స్థానంలో గెలిచాయి. అయితే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సింగూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గంపై కాషాయ జెండాను ఎగురవేసిన కమలదళం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 18 స్థానాల్లో తమ సత్తా చాటేందుకు వ్యూహరచన చేస్తోంది.  

2011లో టీఎంసీ జయకేతనం 
2011లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌ హుగ్లీ జిల్లాలోని 18 సీట్లలో 16 స్థానాల్లో ఘన విజయం సాధించింది. అనంతరం 2016 లోనూ తమ హవాను కొనసాగించడంలో మమతా బెనర్జీ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అదే సమయంలో 2011 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు హుగ్లీ జిల్లాలో కేవలం రెండు సీట్లు గెలుచుకోగా, 2016లో ఒకే స్థానానికి పరిమితం కావాల్సి వచి్చంది. 2011లో ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్‌ పార్టీ, 2016లో మాత్రం ఒక స్థానాన్ని దక్కించుకోగలిగింది.  

2019లో బీజేపీ బోణీ 
2016 ఎన్నికల్లో హుగ్లీ జిల్లాలో ఖాతా తెరవలేకపోయిన బీజేపీ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో హుగ్లీ లోక్‌సభ సీటును గెలుచుకుంది. దీంతో హుగ్లీ జిల్లాలో కాషాయ ధ్వజాన్ని రెపరెపలాడించేందుకు తమకు అవకాశం లభించిందని కమలదళం ఆశపడుతోంది. కేవలం హుగ్లీనే కాక అరాంబాగ్‌ లోక్‌సభ స్థానాన్ని కేవలం 1,142 ఓట్ల తేడాతో బీజేపీ కోల్పోయింది. హూగ్లీ జిల్లాలోని మూడవ లోక్‌సభ స్థానమైన శ్రీరాంపూర్‌ నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన కళ్యాణ్‌ బెనర్జీ గెలిచి మూడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే హుగ్లీ జిల్లాలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోని రెండింటిలో తమ ప్రభావాన్ని పెంచుకున్న బీజేపీ నాయకులు, మిగతా ప్రాంతాలపై దృష్టిపెట్టారు.   

రెండు దశల్లో పోలింగ్‌ 
హుగ్లీ జిల్లాలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్‌ 6వ తేదీన జంగీపాడ, హరిపాల్, ధానియాఖాలి, తారకేశ్వర్, పుర్సురా, అరాంబాగ్, గోఘాట్, ఖానకుల్‌ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 10న హుగ్లీలోని ఉత్తర్‌పాడా, శ్రీరాంపూర్, చాంప్‌దానీ, సింగూర్, చందన్‌నగర్, చుంచుడా, బాలాగఢ్, పాండువా, సప్తగ్రామ్, చండితల్లా అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ ప్రక్రియ జరగనుంది.

అప్పటి హవా కొనసాగేనా? 
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 18 అసెంబ్లీ స్థానాల్లో నాలుగైదు సీట్లు మినహా మిగిలిన సీట్లు కాషాయం కైవసమయ్యాయి. ఆరాంబాగ్, హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గాల్లో రెండు, మూడు అసెంబ్లీ స్థానాలను మినహాయించి, గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. హుగ్లీ లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమలదళాన్ని ప్రజలు ఆదరించారు. దీంతో బీజేపి అభ్యర్థి లాకెట్‌ ఛటర్జీ హుగ్లీ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోగా, ఆరాంబాగ్‌ లోక్‌సభ స్థానంలో గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి కేవలం ఒకటిన్నర వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో హుగ్లీ జిల్లాలో బోణీ కొట్టలేకపోయినప్పటికీ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చూపిన ఆదరణకు తోడు ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ తమకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని కమలదళం భావిస్తోంది.

చదవండిబీజేపీ, టీఎంసీలను ఓడించాలి

బెంగాల్‌ ఎన్నికలు: పీకే ఆసక్తికర ట్వీట్

మరిన్ని వార్తలు