West Bengal Assembly Election 2021: ముగిసిన పశ్చిమబెంగాల్ 5వ విడత పోలింగ్

17 Apr, 2021 20:31 IST|Sakshi

లైవ్‌ అప్‌డేట్స్‌ : 
పశ్చిమబెంగాల్ 5వ విడత పోలింగ్ 78.36 శాతం
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఐదో విడత పోలింగ్ ముగిసింది. చెదురు మదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నా ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. 78.36 శాతం పోలింగ్ నమోదైంది. జల్‌పాయ్‌గురి, కలింపాంగ్, డార్జిలింగ్, నడియాలో ఒక సెగ్మెంట్, నార్త్ 24 పరగణాలు, పూర్బ బర్దమాన్ జిల్లాల్లోని 45 నియోజక వర్గాల్లో శనివారం పోలింగ్ జరిగింది. 319 మందికి పైగా అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఐదో విడతలో పోలింగ్ జరిగిన 45 నియోజకవర్గాల్లో మయినాగురిలో అత్యధికంగా 85.65 శాతం పోలింగ్ నమోదైంది. మటిగర-నక్సల్బరి నియోజకవర్గంలో 81.65 శాతం, బరసత్‌లో 77.71 శాంత, బిధాన్‌ నగర్‌లో 61.10 శాతం, సిలిగురిలో 74.83 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఆరో విడత పోలింగ్ 43 నియోజకవర్గాల్లో ఈ నెల 22న జరుగనుంది.

కేంద్ర దళాలు కాల్పులు
పశ్చిమ బెంగాల్‌లోని దేగానా అసెంబ్లీలోని కురుల్‌గచా ప్రాంతంలోని స్థానిక ప్రజలు కేంద్ర బలగాలు వైమానిక కాల్పులు జరిపారని ఆరోపించారు. వార్తా సంస్థ ఏఎన్ఐ ప్రకారం, స్థానిక వ్యక్తి మాట్లాడుతూ ” అక్కడ ఓటింగ్ యథావిధిగా జరుగుతోంది” అప్పుడే కేంద్ర దళానికి చెందిన 8-9 మంది సైనికులు వచ్చి కాల్పులు జరిపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

సాయంత్రం 5:45 వరకు 78.36 శాతం పోలింగ్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5:45 వరకు 78.36 శాతం నమోదైంది. బెంగాల్‌లో ఐదవ దశ ఎన్నికలకు సంబందించి 45 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది, బరిలో 319 మంది అభ్యర్థులు ఉన్నారు. 

మధ్యాహ్నం 3.30 గంటల వరకు 69.40 శాతం ఓటింగ్ 
ఐదవ దశ పోలింగ్‌ సందర్భంగా పశ్చిబెంగాల్‌లోని ఆరు జిల్లాల్లోని 45 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు 69.40 శాతం ఓటింగ్ నమోదైంది. జల్పాయిగురి జిల్లాలోని రాజ్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో మధ్యాహ్నం 3.30 గంటల వరకు 80.32 శాతం అత్యధిక ఓటింగ్ నమోదైంది. కుర్సోంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 53.24 శాతంతో అతి తక్కువ ఓటింగ్ జరిగింది.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం తగిన ఏర్పాట్లు చేసింది. ఎన్నికల సందర్బంగా 853 కంపెనీలకు చెందిన కేంద్ర దళాలను మోహరించింది.

అధికారిక లెక్క ప్రకారం  5వ పోలింగ్‌లో మధ్యాహ్నం 1:34 వరకు 54.67శాతం ఓటింగ్‌ నమోదైంది.

తాజా సమాచారం ప్రకారం ఉదయం 11 గంటల వరకు 21.26శాతంగా ఉన్న ఓటింగ్‌ శాతం బ  ఉదయం 11:37కు  36.02 శాతంగా ఉంది.

5వ, అతిపెద్ద  దశ పోలింగ్‌ సందర్భంగా పశ్చిబెంగాల్‌లోని బిధాన్‌నగర్‌లో ఉద్రిక్తతచోటు చేసుకుంది.  టీఎం‌సీ- బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఇరువర్గాల కార్యకర్తలు రాళ్లు రువ్వుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. బిధానగర్ శాంతినగర్ వద్ద చోటు చేసుకున్న ఘర్షణలో పలువురు మహిళలు గాయపడ్డారు. బీజేపీ అభ్యర్థి సబ్యసాచి దత్తా సంఘటన స్థలానికి చేరుకున్నారు. బీజేపీ దాడిలో  తమ కార్యకర్తలు ఇద్దరు గాయపడ్డారని దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని టీఎంసీ  అభ్యర్థి సుజిత్ బోస్ తెలిపారు. మరోవైపు ఉత్తర 24 పరగణాల్లోని కమర్హతి అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ పోలింగ్ బూత్‌లను  కమిషనర్‌ అజోయ్ నందా సందర్శించారు. పోలింగ్‌ శాంతియుతంగా జరుగుతోందని  తెలిపారు.  

 5వ దశ పోలింగ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలందరూ తమ ఓటు  హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ముఖ్యంగా మొదటిసారి ఓటర్లు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు.  

కమర్హతిలోని  పోలింగ్ బూత్‌లో టీఎంసీ నాయకుడు మదన్ మిత్రా ఓటు వేశారు.

కోల్‌కతా:  పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల 5వ దశ పోలింగ్‌ శనివారం ప్రారంభమైంది. కోల్‌కతాలోని దక్షిణేశ్వర్‌లో  హిరాలాల్ మజుందర్ మెమోరియల్ కాలేజ్ ఫర్ ఉమెన్  పోలింగ్ బూత్‌ ఇద్ద ఇప్పటికే ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు.  4వ దశ  పోలింగ్‌ ఘర్షణల నేపథ్యంలో పోలింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు.

పశ్చిమబెంగాల్‌లో నేడు ఐదో దశ పోలింగ్‌లో భాగంగా రాష్ట్రంలోని 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సుమారు కోటి మంది ఓటర్లు  342 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నెల 22, 26, 29వ తేదీల్లో బెంగాల్‌లో జరగాల్సిన పోలింగ్‌కు ప్రచార సమయాన్ని రాత్రి 10 గంటలకు బదులుగా 7 గంటలకు ఈసీ కుదించింది. రాజకీయ పార్టీలు సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్యలో సభలు, సమావేశాలు ర్యాలీల వంటి ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టరాదని తెలిపింది. ఏప్రిల్‌ 16వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. అదేవిధంగా ఈ మూడు దశలకుగాను ప్రచారానికి, పోలింగ్‌కు మధ్య విరామ సమయాన్ని 48 గంటల నుంచి 72 గంటలకు పెంచుతున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు