ఆపరేషన్‌ బెంగాల్‌.. అంత ఈజీ కాదు!

22 Jan, 2021 08:10 IST|Sakshi

సవాళ్లను అధిగమించడంపై కాషాయదళం దృష్టి

కొనసాగుతున్న మమతా బెనర్జీ దిద్దుబాటు చర్యలు

మమతా వైపే మొగ్గుచూపుతున్న సర్వేలు

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో విలక్షణమైన పోటీకి సంబంధించిన ప్రచార దృశ్యాలు బయటికొస్తూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ కేవలం సన్నాహకాలు మాత్రమే. ఎందుకంటే ఇప్పటివరకు రోడ్‌ షోలు, ర్యాలీలు, గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇంట్లో భోజనం చేయడం వంటి ఎన్నికల స్టంట్స్‌ చేసినప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార టీఎంసీని గద్దె దింపాలని ఉవ్విళూరుతున్న కమలదళం ఆశలు అనుకున్నంత సులువుగా సాధ్యమయ్యే పరిస్థితులు బెంగాల్‌ రాజకీయాల్లో కనిపించట్లేదు. ప్రస్తుతం జరుగుతున్న మాటల యుద్ధం, పోటాపోటీ దాడులు చూస్తుంటే బెంగాల్‌ బరిలో నిజమైన రాజకీయ యుద్ధం ప్రారంభం అయినట్లుగా అనిపించట్లేదు.

సాక్షి, కోల్‌కతా: టీఎంసీని దెబ్బతీసేందుకు తూర్పు మిడ్నాపూర్‌ భూమిపుత్రుడైన సువేందు అధికారిని తమ జట్టులో చేర్చుకున్న కమలదళం, తమ బలాన్ని మరింత పెంచుకొనేందుకు పెద్ద సంఖ్యలో నాయకులను, కార్యకర్తలను తమవైపు తిప్పుకున్నప్పుడే సాధ్యమౌతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రజల నమ్మకాన్ని బీజేపీ ఏమేరకు పొందగలుగుతుందన్న దానిపై ఇప్పుడు జరుగబోయే ఎన్నికలు పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ఇన్నేళ్ళుగా నామమాత్రంగా ఉనికిని చాటుకున్న బీజేపీ, అక్కడ ఉన్న సాంస్కృతిక వైరుధ్యాన్ని తట్టుకొని 2019 సార్వత్రిక ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు బీజేపీ స్థానిక పరిస్థితులను ఎంతవరకు తట్టుకొని ఓటర్లను తమవైపు తిప్పుకోగలదనే అంశంపై చర్చ జరుగుతోంది. 

మరోవైపు సంస్థాగతపరంగా బీజేపీలో ఉన్న ఖాళీలను ఇప్పుడు టీఎంసీ సహా ఇతర పార్టీల నుంచి తరలివస్తున్న నాయకులతో భర్తీ చేయడం కాస్త ఊరట కలిగించే అంశంగా జాతీయస్థాయి నాయకత్వానికి కనిపిస్తున్నప్పటికీ, బీజేపీ వర్క్‌ కల్చర్‌కు ఇంత తక్కువ సమయంలో ఆ నాయకులు ఏ విధంగా సర్దుకొని ముందుకు వెళ్ళగలుగుతారనే దానిపై ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఎందుకంటే టీఎంసీ వంటి పార్టీలో క్రమశిక్షణ అనేది ఏరకంగా ఉంటుందనేది జగమెరిగిన విషయం. అంతేగాక ఎప్పటినుంచో పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న నాయకులకు, ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వస్తున్న నాయకులకు మధ్య ఉండే అంతరాలను ఏమేరకు సర్దుబాటు చేయగలుగుతారనే అంశంపై అందరి దృష్టి నెలకొంది.

అయితే టీఎంసీ నుంచి వస్తున్న నాయకుల కారణంగా పార్టీకి రాబోయే ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ 200కు పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న కమలదళానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా గెలుస్తారనే 294 మంది అభ్యర్థులు కూడా లేరనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇలాంటి సమయంలో గెలుపు గుర్రాలపై ఆశలతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఫిరాయింపుదారులకు పెద్దపీట వేస్తున్నప్పటికీ, రాబోయే రోజుల్లో బీజేపీ టీఎంసీ బీ టీంగా మారే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

గెలుపు సులువేం కాదు
బెంగాల్‌లో గెలవాలని తొందరపడుతున్న బీజేపీ, ఎన్నికల సమయంలో ఒక్కటొక్కటిగా సవాళ్ళను ఏరకంగా ఎదుర్కుంటుందనేది ఒక సమస్యగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 40.3 శాతం ఓట్లతో 18 లోక్‌సభ స్థానాలు గెలిచిన బీజేపీ ఢిల్లీలోని కేంద్ర నాయకత్వానికి, బెంగాల్‌లో గెలుపు అనేది సునాయాసంగా కనిపిస్తుండవచ్చు కానీ, అది అంత సులువు కాదనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో ఎంతో కీలకమైన సీఎఎ, ఎన్‌ఆర్‌సీ అమలు అంశాలను గతేడాది డిసెంబర్‌ 20న, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఒక ప్రెస్‌ మీట్‌లో కేంద్ర హోంమంత్రి కోల్డ్‌ స్టోరేజ్‌లోకి పంపారు. దీని ప్రభావం ఏమేరకు బీజేపీపై ఉంటుందనే అంశంపై చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. 

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మమతా బెనర్జీకి ఎంత కీలకమో, బీజేపీకి కూడా అంతే కీలకం. ఒకవేళ బెంగాల్‌లో బీజేపీ కాషాయ జెండా ఎగురవేస్తే దేశవ్యాప్తంగా తమ ఇమేజ్‌ను పునరుద్ధరించుకొనేందుకు, తమ సత్తా ఏంటో చూపించుకొనేందుకు ఇదొక మంచి అవకాశంగా కమలదళం భావిస్తోంది. అయితే గత కొన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాక్‌ ఇచ్చాయి. ఇటీవల జరిగిన బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చివరి వరకు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేన బీజేపీని వద్దనుకొని ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హర్యానాలో మెజారిటీ సాధించకపోవడంతో, ఇతర పార్టీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించాల్సి వచ్చింది. రాజస్తాన్‌లో అశోక్‌ గహ్లోత్‌ను గద్దె దింపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నం కాస్తా ఫెయిల్‌ అయింది. కమలదళం ప్లాన్స్‌ సక్సెస్‌ కాలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సమస్య, ఆర్థిక ఒడిదుడుకులు, ప్రగతి మందగించడం, సుమారు రెండు నెలలుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం వంటి అనేక అంశాలు బీజేపీకి రాజకీయ సవాళ్లుగా మారాయి. 

ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో బెంగాల్‌ వంటి రాష్ట్రంలో 294 సీట్లలో 200 సీట్లు గెలుచుకోవాలనే బీజేపీ లక్ష్యం కాస్త కఠినమైనదే. ఇటీవల విడుదలైన ఏబీపీ సీ ఓటర్‌ ఒపీనియన్‌ పోల్‌ సైతం మమతాబెనర్జీ కాషాయదళానికి కషాయం తాగించడం ఖాయమనే ప్రకటించింది. అయితే మమతా బెనర్జీని గద్దెదింపే లక్ష్యంతో శాయశక్తులు ఒడ్డి పనిచేస్తున్న కమలదళం, అన్ని అడ్డంకులను తట్టుకొని ఏమేరకు విజయం సాధిస్తుందనేది వారి రాజకీయ ఎత్తుగడలే నిర్ణయిస్తాయి.  

మమతా బెనర్జీ దిద్దుబాటు చర్యలు
కీలక నాయకులు పార్టీని వదిలి వెళుతున్న సమయంలో కార్యకర్తల్లో ఎలాంటి నిత్సేజం రాకుండా ఉండేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ దిద్దుబాటు చర్యలు వేగవంతం చేశారు. తూర్పు మిడ్నాపూర్‌ నుంచి సువేంధు అధికారి బీజేపీలో చేరిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను కాపాడుకొనేందుకు అతని ప్రత్యర్థి అఖిల్‌ గిరిని తెరపైకి తేవడమేకాకుండా, అతనికి జిల్లా బాధ్యతలను అప్పగించి తమ దగ్గర ప్రత్యామ్నాయ నాయకుల కొరత ఏమాత్రంలేదని మమతా బెనర్జీ బీజేపీకి సవాలు విసురుతున్నారు. అంతేగాక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగ్రామ్‌ నుంచి బరిలో దిగేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సిద్ధపడ్డారు. బీజేపీని ధీటుగా ఎదుర్కోవాలంటే నందిగ్రామ్‌తోనే సాధ్యమని దీదీ అర్థం చేసుకున్నారు.

మరోవైపు కొందరు టీఎంసీ నాయకులు తమకు అనుకూలంగా పార్టీ కార్యక్రమాలను మార్చుకోవడంతో పార్టీ నాయకత్వం అభాసుపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ రాష్ట్రంలో ఇంకా పూర్తిస్థాయిగా బలపడలేదనే విషయానికి ఇలాంటి ఘటనలు బలం చేకూరుస్తున్నాయి. అయితే పార్టీలోకి వచ్చే ప్రతీ నాయకుడికి పనిచేసేందుకు తగినంత అవకాశమిస్తామని, బీజేపీ కోసం పనిచేసేందుకు వచ్చే నాయకులు ఒక నిర్ణయం తీసుకొని పని ప్రారంభించాలని రాష్ట్ర పార్టీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ ఇటీవల చేసిన ప్రకటన పార్టీ తాజా పరిస్థితికి అద్దంపడుతోంది. ఒకవేళ ఇలాంటి క్రమశిక్షణ రాహిత్య చర్యలు పునరావృతం అయితే కొత్తగా చేరిన వారిని సైతం తొలగించే ప్రక్రియ జరుగుతుందని పార్టీ నాయకులు తెలిపారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీకి ఇలాంటి క్రమశిక్షణ లోపించిన చర్యలను భరించాల్సిన గత్యంతరం తప్ప వేరే అవకాశం ఏదీ లేదనేది స్పష్టమౌతోంది. అలాంటి నాయకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం మాత్రం అసాధ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిణామాలు ఇతర రాజకీయపార్టీల్లో అసంతృప్త నాయకులకు బీజేపీలో చేరడం అనేది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు