పశ్చిమ బెంగాల్‌లో ముందస్తు!

10 Jan, 2021 10:01 IST|Sakshi

షెడ్యూల్‌ కంటే ముందే ఎన్నికలు

సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయంగా ఎంతో రసవత్తరంగా మారిన పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తును దాదాపు పూర్తిచేసింది. ఈ ఏడాది మే 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సీబీఎస్‌ఈ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈసారి పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలను అనుకున్న సమయాని కంటే ముందే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేగాక బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలు, కరోనా మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికలు 8 దశల్లో జరిగే అవకాశాలున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం మే 30 తేదీతో ముగియనుంది.

2018లో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినప్పటికీ హింస అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, ప్రత్యర్థులపై రాళ్లు విసరడం వంటివి తరుచూ జరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ) మద్దతుదారులు రాళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు కూడా ఈసారి ఎన్నికల్లో భారీ హింస జరుగుతుందని అంచనా వేస్తున్నాయి. హింసకు తోడు, ఈసారి కరోనా మహమ్మారి ప్రభావం వల్ల కోవిడ్‌–19 ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికలను ఎనిమిది దశల్లో నిర్వహించే అవకాశం ఉంది.
 
అదనపు పోలింగ్‌ బూత్‌లు
బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం సుమారు 28 వేల పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాల్లోని పరిస్థితులపై ఎన్నికల సంఘం స్థానిక అధికారుల నుంచి నివేదిక తీసుకోనుంది. గతేడాది జరిగిన బిహార్‌ శాసనసభ ఎన్నికల సందర్భంగా కోవిడ్‌–19 ప్రోటోకాల్స్‌ అమలు చేశారు. ఓటర్ల మధ్య భౌతిక దూరం కొనసాగించడానికి పశ్చిమ బెంగాల్‌లోనూ అదనపు పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో హింసను కట్టడి చేసేందుకు కేంద్ర పోలీసు బలగాలను వెంటనే మోహరించాలని, వీలైనంత త్వరగా ఎన్నికల కోడ్‌ను అమల్లోకి తేవాలని గత డిసెంబర్‌లో బీజేపీ ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాను కోరిన విషయం తెలిసిందే.

ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్‌!
అంతకుముందు పశ్చిమ బెంగాల్‌లో 2016 అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 4న ప్రారంభమయ్యాయి. అప్పుడు మే 19 తేదీ వరకు ఏడు దశల్లో ఓటింగ్‌ ప్రక్రియ జరిగింది. ఓటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి లెక్కింపు వరకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి 45 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టింది. ఈసారి సీబీఎస్‌ఈ పరీక్షలు మే 4 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ మార్చి నెల రెండో వారం నుంచి ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఫిబ్రవరిలోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ సైతం ప్రకటించవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరి 15న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోనుందని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు