గవర్నర్‌ అధికారాల కోతలో దీదీ సక్సెస్‌.. బీజేపీ వ్యతిరేకత ఉన్నా 40 ఓట్లేనా?

13 Jun, 2022 19:05 IST|Sakshi

పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్‌ అధికారాలకు మరింత కోత పెట్టింది అక్కడి ప్రభుత్వం. తాజాగా ఆసక్తిరేపిన ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది బెంగాల్‌ అసెంబ్లీ. బీజేపీ వ్యతిరేకత కూడా ఇక్కడ పని చేయకపోవడం గమనార్హం. యూనివర్సిటీలకు ఛాన్స్‌లర్‌గా వ్యవహరించాల్సిన గవర్నర్‌ ప్లేస్‌లో.. ఇకపై సీఎం వ్యవహరించాలన్నది ఆ బిల్లు ఉద్దేశం.

కోల్‌కతా: యూనివర్సిటీలకు ఛాన్స్‌లర్‌గా గవర్నర్‌ బదులు.. సీఎం వీసీగా వ్యవహరించే బిల్లుకు West Bengal University Laws (Amendment) Bill, 2022 సోమవారం ఆమోదం తెలిపింది పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ.  డెబ్భై మందికిపైగా బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నా.. బిల్లు పట్ల నిరసనలు వ్యక్తం చేసినా..  294 మంది సభ్యులున్న అసెంబ్లీలో కేవలం 40 ఓట్లు మాత్రమే బిల్లు వ్యతిరేకంగా రావడం గమనార్హం.

మొత్తం ఓట్లలో 183 బిల్లుకు అనుకూలంగా వచ్చాయి. యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తే.. రాజకీయ జోక్యం నేరుగా, అదీ ఎక్కువగా ఉంటుందని, విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోతుందని బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ అసెంబ్లీ.. ఈ బిల్లును మెజార్టీతో ఆమోదించింది. తర్వాతి దశలో ఈ బిల్లు.. గవర్నర్‌ ఆమోదం పొందాల్సి ఉంది. కేబినెట్ సలహా మేరకు ఆయన రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

అయితే, ప్రతిపక్షాలు పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు చాలా కాలం పాటు బిల్లులను తమ వద్దే ఉంచుకుని.. రాష్ట్రపతికి పంపిన సందర్భాలు ఉన్నాయి. యూనివర్సిటీలకు ఛాన్స్‌లర్‌ల నియామకంలో బెంగాల్‌ గవర్నర్‌ జగ్దీప్‌ ధన్కర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. తన అనుమతి లేకుండానే.. 25 యూనివర్సిటీలకు వైస్‌ ఛాన్స్‌లర్‌ను నియమించారంటూ ఈ జనవరిలో ఆయన బెంగాల్‌ సర్కార్‌పై ఆరోపణలు గుప్పించారు. 

అయితే శాంతినికేతన్‌లోని విశ్వభారతి సెంట్రల్‌ యూనివర్సిటీకి ప్రధాని వైస్‌ ఛాన్స్‌లర్‌గా ఉన్నప్పుడు.. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు చాన్స్‌లర్‌గా ఎందుకు వ్యవహరించరాదు అంటూ ప్రశ్నిస్తున్నారు బెంగాల్‌ విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు. 

ఇదిలా ఉంటే.. యూనివర్శిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించే గవర్నర్ అధికారాన్ని.. రాష్ట్ర ప్రభుత్వానికి స్వాధీనం చేసుకునే అధికారాన్ని కల్పిస్తూ తమిళనాడు స్టాలిన్‌ ప్రభుత్వం గత నెలలో ఓ బిల్లును ఆమోదించింది.

మరిన్ని వార్తలు