అవన్ని ఫేక్‌ సర్వేలు: ఐ పాక్‌

31 Mar, 2021 20:11 IST|Sakshi

సర్వేల వెనక బీజేపీ ఉంది

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు మొదటి దశ పూర్తైన సంగతి తెలిసిందే. రెండో దశ ఎన్నికలు ఏప్రిల్‌ 1న జరగనున్నాయి. ఈ ఎన్నిక పట్ల బెంగాల్‌ వాసులతో పాటు దేశప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రెండో దశ పోలింగ్‌లో మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో కూడా ఓటింగ్‌ జరగనుంది. పార్టీ నుంచి బయటకు వెళ్లి బీజేపీలో చేరిన సువేందు అధికారి నందిగ్రామ్‌లో మమతతో తలపడనున్నారు. దాంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆ సంగతి పక్కకు పెడితే గత రెండు మూడు రోజులుగా నందిగ్రామ్‌ ఫలితాలకు సంబంధించి రెండు, మూడు సర్వేలు బెంగాల్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. 

వీటి సారాంశం ఏంటంటే మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఘోర పరాజయం చవి చూడబోతున్నారు. సువేందు దీదీని దారుణంగా ఓడించబోతున్నాడని సర్వేలు తెలిపాయి. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సర్వేలన్నింటిని పోల్‌ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిశోర్‌ సంస్థ ఐ పాక్‌ నిర్వహించిందనే వార్తలు జనాలను మరింత ఆశ్చర్యచకితులను చేశాయి. ఈ క్రమంలో ఐ పాక్‌ సంచలన ప్రకటన చేసింది. తమ సంస్థ నిర్వహించినట్లు చెప్పుకుంటున్న సదరు సర్వే ఫేక్‌ అని స్పష్టం చేసింది. 

ఈ క్రమంలో ఐపాక్‌ ‘‘గత కొద్ది రోజులుగా నందిగ్రామ్‌ ఓటింగ్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న సర్వే ఫేక్‌. బీజేపీ నాయకులు, వారి హామీల్లానే ఈ సర్వే కూడా అవాస్తవం. ఇలాంటి ఫేక్‌ రిపోర్ట్స్‌ను ప్రచారం చేసి జనాలను ప్రభావితం చేయాలని భావిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించవు. అసలు ఐ పాక్‌ డెస్క్‌ టాప్‌లను వినియోగించదు.. మరింత స్మార్ట్‌గా ఆలోచించండి’’ అంటూ ట్వీట్‌ చేసింది. 

చదవండి: నేను పులి: ‘నందిగ్రామ్‌’లో మమతా బెనర్జీ గర్జన

మరిన్ని వార్తలు