బెంగాల్‌: సింగూరులో దీదీ వర్సెస్‌ భట్టాచార్య..

8 Apr, 2021 11:47 IST|Sakshi

నాలుగో దశలో హాట్‌ టాపిక్‌గా మారిన సింగూర్‌ నియోజకవర్గం

వయసురీత్యా సిట్టింగ్‌ ఎమ్మెల్యే భట్టాచార్యను పక్కనపెట్టిన దీదీ

పంతం నెగ్గించుకొనేందుకు బీజేపీ అభ్యర్థిగా బరిలో భట్టాచార్య 

సింగూరులో ‘కమలం’ వికసించేనా?

సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో నాలుగో దశ ఎన్నిక ప్రచారం జోరందుకుంది. 10వ తేదీన పోలింగ్‌ జరుగనున్న 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా అందరి దృష్టి హాట్‌ సీట్‌ అయిన సింగూర్‌పై ఉంది. తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీకి అధికారాన్ని కట్టబెట్టడంలో నందిగ్రామ్‌తో పాటు సింగూర్‌ ఉద్యమం కీలకపాత్ర పోషించింది. దీంతో ఇప్పుడు సింగూర్‌లోనూ దీదీ తప్పనిసరిగా గెలవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. మమతా బెనర్జీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆమెకు తలనొప్పిగా మారాయి. ఒకవైపు నందిగ్రామ్‌లో సువేంధు అధికారి కమలదళంలో చేరి బరిలో నిలబడటంతో దీదీకి కష్టాలు పెరిగాయి. మరోవైపు సింగూర్‌లో నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన టీఎంసీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ భట్టాచార్య ఇప్పుడు మమతా బెనర్జీకి సవాలుగా మారారు.  

పంతం నెగ్గడమే ముఖ్యం 
భట్టాచార్య వయసురీత్యా ఈసారి అతనికి టికెట్‌ ఇచ్చేందుకు టీఎంసీ నిరాకరించింది. దీంతో 88 ఏళ్ల రవీంద్రనాథ్‌ కాషాయ కండువా కప్పుకొని సింగూరు బరిలో దీదీకి సవాలు విసిరారు. సింగూర్‌ ఉద్యమ సమయంలో మమతకు అండగా నిలబడ్డారు. దీదీకి అనుకూలంగా రైతులు మొగ్గు చూపేలా చేయడంలో రవీంద్రనాథ్‌ కీలక పాత్ర పోషించారు. సింగూరు ప్రాంతంలో అతనికి ఉన్న ఇమేజ్‌ కారణంగా నాలుగుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సింగూర్‌ నుంచి బేచారాం మన్నాను బరిలో నిలబెట్టింది.

చదవండి: మేమొస్తే బెంగాల్‌లో పారిశ్రామికీకరణ

బేచారాం ప్రస్తుతం సింగూర్‌ దగ్గర్లోని హరిపాల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయనకు, రవీంద్రనాథ్‌కు మధ్య మొదటి నుంచి ఉన్న విబేధాల కారణంగా ఈసారి హరిపాల్‌ సీటు నుంచి బేచారాం భార్యను అభ్యర్థిగా దీదీ నిలబెట్టింది. హరిపాల్‌ సీటుకి పోలింగ్‌ ప్రక్రియ మూడోదశలో నేడు జరుగనుంది. అయితే ఒకే కుటుంబంలో భార్యభర్తలకు రెండు సీట్లు కేటాయించడంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఇటీవల సింగూర్‌లో జరిగిన ప్రచార సభలో ప్రసంగించిన మమతాబెనర్జీ, సింగూర్‌ అభ్యర్థిగా రవీంద్రనాథ్‌ కాకపోతే, నందిగ్రామ్‌కు బదులుగా సింగూర్‌ నుంచి తాను పోటీ చేసేవారని అన్నారు.  

భట్టాచార్య రూపంలో బీజేపీకి అవకాశం 
సింగూర్‌లో 2.30 లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో 12% మంది మైనారిటీ వర్గాలకు చెందినవారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం వామపక్ష– కాంగ్రెస్‌ కూటమి కారణంగా మైనారిటీ ఓట్లు చీలతాయి. అదే సమయంలో ప్రధానంగా ఉన్న హిందూ ఓటు టీఎంసీ, బీజేపీల మధ్య విభజించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పరిశ్రమను స్థాపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీపీఎం ప్రకటించింది. సింగూరు ఉద్యమం కారణంగా ప్రజలకు లబ్ధి జరుగకపోగా, టీఎంసీలోని అగ్రశ్రేణి నాయకులు కోటీశ్వరులయ్యారని వామపక్షాలు వాదిస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఈసారి తమకు మద్దతు ఇస్తారని పార్టీ చెబుతోంది. సింగూర్‌ అసెంబ్లీ సీటు హుగ్లీ జిల్లా పరిధిలోకి వస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో çహుగ్లీ లోక్‌సభ సీటు నుంచి 70 వేలకు పైగా ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి లాకెట్‌ ఛటర్జీ గెలుపొందారు. దీంతో ఇప్పుడు రవీంద్రనాథ్‌ భట్టాచార్య టీఎంసీని వదిలి బీజేపీలో చేరడంతో తప్పకుండా సింగూరులో కమలం వికసిస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. 

ఇప్పటికీ ఖాళీగా టాటా ప్లాంట్‌ను తొలగించిన స్థలం 
సీపీఎం ప్రభుత్వ హయాంలో టాటా గ్రూప్‌ సింగూర్‌లో నానో కార్‌ ప్లాంట్‌ను ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా అప్పట్లో మమత రైతుల సహకారంతో ఒక పెద్ద ఉద్యమాన్ని చేశారు. ఫలితంగా టాటా గ్రూప్‌ సింగూర్‌ను విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా ప్రభుత్వం ప్లాంట్‌కు ఇచ్చిన ప్రాంతాన్ని మైదానంగా మార్చింది. ఇప్పటికీ అక్కడ భూమి ఖాళీగానే ఉన్నప్పటికీ, కొన్నిచోట్ల సాగు చేస్తున్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు