West Bengal Bypoll: మమతా వర్సెస్‌ ప్రియాంక, రసవత్తర పోరు

10 Sep, 2021 13:02 IST|Sakshi

మ‌మ‌తా బెన‌ర్జీపై పోటీకి అభ్యర్థిని ఖరారు చేసిన బీజేపీ

భవానీపూర్‌ ఉపఎన్నిక  బరిలో ప్రియాంకా టిబ్రేవాల్‌ 

ఈ రోజు నామినేషన్‌ వేయనున్న మమతా బెనర్జీ

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల్లో రసవత్తర పోరుకు తెరలేచింది. బెంగాల్‌ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై  పోటీకి బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భవానీపూర్‌ ఉపఎన్నిక పోరులో న్యాయవాది ప్రియాంకా టిబ్రేవాల్‌ను బరిలోకి దింపింది. మరోవైపు ఈ రోజు  (సెప్టెంబర్ 10 శుక్రవారం ) మమత తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. 

ఈ నెల 30వ తేదీన జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లో  సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ  భ‌వానిపుర్ నుంచి పోటీ చేయనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ ఘన విజయం సాధించి బీజేపీకి భారీ షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నందీగ్రామ్‌ అసెంబ్లీ స్థానానికిగాను  దీదీ, బీజేపీ సువేందు అధికారి మధ్య హోరా హోరీగా సాగిన పోరులో చివరికి మమత ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న మమతా బెనర్జీ ఆ ప‌ద‌విలో కొన‌సాగాలంటే, నిర్దేశిత గడువులోగా అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో  సెప్టెంబ‌ర్ 30న ఎన్నిక జరగనుంది. అక్టోబ‌ర్ 3న కౌంటింగ్ జరగనుంది.

చదవండి : Ganesh Chaturthi 2021-Mangli Songs: ‘లంబోదరా’ మంగ్లీ మరో అద్భుత గీతం

ఎవరీ ప్రియాంక టిబ్రేవాల్‌
1980, జూలై 7న కోల్‌క‌తాలో జన్మించిన ప్రియాంకా న్యాయ ప‌ట్టాను పొందారు. థాయిలాండ్ వ‌ర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. బాబుల్ సుప్రియోకు లీగ‌ల్ అడ్వైజ‌ర్‌గా ప‌నిచేశారామె. గత ఆరేళ్ల కాలంలో బీజేపీలో కీల‌క హోదాల్లో పనిచేస్తూ ప్రస్తుతం బెంగాల్ బీజేవైఎం ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.  

2014లో కాషాయ కండువా కప్పుకున్న ఆమె 2015లో కోల్‌క‌తా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో రంగ ప్రవేశం చేశారు. అయితే  తృణ‌మూల్ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. అలాగే 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా ఎదురుదెబ్బ తప్పలేదు. 2011 నుండి రెండుసార్లు భవానీపూర్ సీటును గెలుచుకున్న మమతపై రెండుసార్లు టీఎంసీ చేతిలో ఓటమి పాలైన ప్రియాంక తాజాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించు కోనున్నారు.  మరోవైపు 2021 అసెంబ్లీ ఎన్నికల తరువాత చోటు చేసుకున్న హింసపై  కోల్‌కతా హైకోర్టులో  పిటీషన్‌ దాఖలు చేసిన వారిలో ప్రియాంకా ఒకరు.   దీనిపై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.

హింసాత్మక రాజకీయాలకు ముగింపు పలకాలని, అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగిస్తామంటూ ఇప్పటికే టీఎంసీపై యుద్ధం మొదలుపెట్టిన  ప్రియాంక ఈ కీలక పోరులో మమతకు ధీటుగా ప్రియాంక నిలబడగలరా? కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై విరుచుకు పడే మమతకు సరిజోడిగా నిలవగలరా? సుదీర్ఘ అనుభవానికి తోడు, ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించే దీదీని నిలువరించడం ప్రియాంకకు సాధ్యమేనా?  భవానీపూర్ ప్రజలు ఎవరికి పట్టం కడతారు?  ఈ ప్రశ్నలన్నింటికీ మరికొన్ని రోజుల్లోనే సమాధానం దొరకనుంది.

మరిన్ని వార్తలు