Mamata Banerjee: బీజేపీ భారీ గెలుపు.. మమతా సంచలన ఆరోపణలు

11 Mar, 2022 18:25 IST|Sakshi

లక్నో: గురువారం వెల్లడైన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ మేరకు ఆమె నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై సంచలన ఆరోపణలు చేశారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చిన గెలుపు ప్రజా తీర్పు కాదని, ఈవీఎం మిషన్ల తీర్పని వ్యాఖ్యానించారు. కేంద్ర బలగాలు,ఏజెన్సీల సహాయంతో సాధించిన విజయమని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారని ఆరోపించారు. 

కలిసి పోరాడాలి
2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలని మమతా పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అందరం కలిసి బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ కోరుకుంటే, ఇప్పుడు తీవ్రంగా స్పందించడం మానుకోవాలని సూచించారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని తెలిపారు. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు భవిష్యత్తులో ఆ పార్టీకి నష్టదాయకమే అన్న మమతా... ఈ అయిదు రాష్ట్రాల ఫలితాలు 2024 ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయన్న వాదనలు చెల్లవు అని తెలిపారు. బీజేపీ పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు.
చదవండి: Tamil Nadu: పార్టీ బలోపేతానికి కమల్‌ హాసన్‌ కీలక నిర్ణయం

మరోవైపు కాంగ్రెస్‌ విశ్వసనీయత కోల్పోతుందని, కాంగ్రెస్‌పై ఆధారపడే పరిస్థితులు లేవన్నారు. చాలా ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఉన్నాయని, అందరూ కలిసి పనిచేయాలని కోరారు. దీనిపై ఖచ్చితంగా ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. 

అఖిలేష్ యాదవ్‌ నిరుత్సాహపడొద్దు
ఎన్నికల్లో అక్రమాలు జరగడం వల్లే సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఓడిపోయారని మమతా అన్నారు. అయితే యూపీ ఫలితాలతో అఖిలేశ్ యాదవ్ మనోస్థైర్యం కోల్పోరాదని అన్నారు. అఖిలేశ్ యాదవ్ కు ఈసారి ఓటింగ్ పెరిగిందని, 27 శాతం నుంచి 37 శాతానికి పెరిగిందని వివరించారు. ప్రజల వద్దకు వెళ్లి బీజేపీని సవాల్ చేయాలని ఆమె సూచించారు. ఈవీఎం యంత్రాలకు ఫోరెన్సిక్ పరీక్షలు జరిపేలా అఖిలేశ్ ఎన్నికల సంఘాన్ని కోరాలని సూచించారు.
చదవండి: కశ్మీర్‌ సరిహద్దుల్లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌

మరిన్ని వార్తలు