66 ఏళ్ల ఆంటీ.. నోరు అదుపులో పెట్టుకో!

1 Apr, 2021 13:13 IST|Sakshi

66 ఏళ్ల ఆంటీ  అంటూ దీదీపై సువేందు అనుచిత వ్యాఖ్యలు 

పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ పోలింగ్‌

నందీగ్రామ్‌లో పోటీపడుతున్న మమతా, సువేందు

సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై , బీజేపీ నేత నందీగ్రామ్‌లో ఆమె ప్రత్యర్థి సువేందు అధికారి నోరు పారేసుకున్నారు. మాజీ టీఎంసీ నేత అయిన సువేందు సీఎం మ‌మ‌తా  66 ఏళ్ల ఆంటీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ఇటీవల మమతా విమర్శల నేపథ్యంలో సువేందు కౌంటర్‌ ఎటాక్‌ చేశారు.  దీదీ ఈ వయస్సులో నోటిని అదుపులో పెట్టుకోవాలని, భాషను మార్చుకోవాలంటూ హితవు పలికారు.  ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు ఓటమి  తప్పదని హెచ్చరించారు. 

అలాగే మే 2వ తేదీన బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువడుతాయ‌ని, ఆ త‌ర్వాత కూడా కేంద్ర బ‌ల‌గాలు రాష్ట్రంలోనే ఉండాల‌ని సువేందు వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రిగా ఆమె త‌న నోటిని అదుపులో పెట్టుకోవాల‌ని, ప్రధాని మోదీపై ఆమె అభ్యంత‌ర‌క‌ర రీతిలో భాష‌ను వాడుతున్నార‌ని ఆరోపించారు.ఈ సందర‍్బంగా  బెంగాల్ సీఎంను ఆంటీ అంటూ ఆయన సంబోధించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మ‌మ‌తా మీడియాతో మాట్లాడారని మండిపడ్డారు. కాగా రెండో ద‌శ ఎన్నిక‌ల్లో భాగంగా నందిగ్రామ్ నియోజ‌క‌వ‌ర్గంలో పోలింగ్ కొన‌సాగుతోంది. ఈ సందర్బంగా తన ఓటుహక్కును వినియోగించుకున్న సువేందు అధికారి, ప్రశాంతంగా ఓటింగ్‌ కొనసాగుతోందని, రీపోలింగ్‌ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని తెలిపారు. బెంగాల్ ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. పెద్ద ఎత్తున ఓట‌ర్లు త‌ర‌లివ‌చ్చి ఓటు వేయాల‌ని  ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు