West Bengal Election Result 2021: దీదీ హ్యాట్రిక్‌!

3 May, 2021 03:02 IST|Sakshi

292 అసెంబ్లీ స్థానాల్లో 213 సీట్లు కైవసం చేసుకున్న టీఎంసీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ శాసన సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. 292 నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వహించగా.. ఏకంగా 213 సీట్లను కైవసం చేసుకుంది. 77 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ హోరాహోరీగా ఉంటుందని భావించినా.. ఫలితాలు ఏకపక్షంగానే వెలువడ్డాయి. వామపక్ష కూటమి, కాంగ్రెస్‌ అయితే అత్యంత దారుణంగా ఒక్క సీటూ సాధించలేకపోయాయి. రాష్ట్రీయ సెక్యులర్‌ మజ్లిస్‌ పార్టీ ఒక సీటు గెలుచుకోగా.. ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. మొత్తంగా 294 నియోజకవర్గాలు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో 292 సీట్లకు ఎన్నికలు జరిగాయి. మిగతా రెండు చోట్ల పోటీలో ఉన్న అభ్యర్థులు కరోనాతో మరణించడంతో ఎన్నికలు నిర్వహించలేదు. ఈ లెక్కన మెజారిటీ కోసం 147 సీట్లు అవసరం కాగా.. తృణమూల్‌ 213 సీట్లను గెలుచుకుంది. ‘ఈ విజయం బెంగాలీ ప్రజల కోసం.. ఇది బెంగాలీల విజయం’ అని మమతా బెనర్జీ ప్రకటించారు. టీఎంసీ ఘన విజయం సాధించినా.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవాలు నిర్వహించొద్దని పార్టీ శ్రేణులను ఆదేశించారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా..
2019 సాధారణ ఎలక్షన్లలో బీజేపీ గెలుచుకున్న 18 ఎంపీ సీట్ల పరిధిలో 120 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈసారి అంతకు మించిన ఫలితం సాధించాలని, బెంగాల్‌లో అధికారం దక్కించుకోవాలని బీజేపీ భావించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం చేశారు. 200 సీట్లు సాధించి తీరుతామన్నారు. కానీ బీజేపీ 77 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది.  చదవండి: (తొలి నుంచీ దూకుడే.. వెనకడుగు తెలియని బెబ్బులి మమత)

ఏది లాభం.. దేనితో నష్టం?
బెంగాల్‌ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా కొనసాగింది. బీజేపీ మోడీ, అమిత్‌షా సహా చాలా మంది కేంద్ర మంత్రులు, పెద్ద సంఖ్యలో సీనియర్‌ నేతలను రంగంలోకి దింపింది. తృణమూల్‌ సర్కారు అవినీతిని గట్టిగా జనంలోకి తీసుకెళ్లారు. మరోవైపు తృణమూల్‌ నుంచి కీలక నేతలు వెళ్లిపోవడంతో మమతా బెనర్జీ అంతా తానై ప్రచారం నిర్వహించారు. బెంగాలీల సంస్కృతి, సెంటిమెంట్‌పై ప్రధానంగా ఆధారపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటికి తెస్తానని హామీ ఇచ్చారు.
బయటివారు బెంగాలీలపై ఆధిపత్యం చెలాయించడానికి వస్తున్నారని, అది సాగనివ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది ఓటర్లపై బాగా ప్రభావం చూపించింది. బీజేపీ తరఫున ప్రచారం చేసినవారిలో చాలా వరకు హిందీ రాష్ట్రాల వారే ఉండటం, హిందీలో ప్రసంగించడంతో వారంతా బయటి వారన్న మమత నినాదం జనంలోకి వెళ్లింది.
బెంగాల్‌ సంస్కృతిలో మహిళలకు సామాజిక పరంగా, ఆర్థిక పరంగా ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రసంగాల్లో వ్యంగ్యంగా మమతా బెనర్జీని ఉద్దేశించి ‘దీదీ.. ఓ.. దీదీ’ అంటూ మాట్లాడటం వ్యతిరేక ప్రభావం చూపిందని విశ్లేషకులు అంటున్నారు.
ఎన్నికల చివరి మూడు దశల సమయంలో దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతూ వచ్చాయి. ఇదంతా ప్రధాని మోదీ వైఫల్యమేనంటూ మమత విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో కరోనా కేసులు పెరగడానికి బీజేపీ బయటి రాష్ట్రాల నుంచి తరలించినవారే కారణమని ఆరోపించారు. దీంతో బీజేపీ శ్రేణులన్నీ ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడిపోయాయి. అది తృణమూల్‌కు కలిసి వచ్చింది.  చదవండి: (గెలవలేదుకానీ.. గణనీయంగా పుంజుకున్న బీజేపీ)

బాబుల్‌ సుప్రియో, లాకెట్‌ చటర్జీ ఓటమి 
కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో(50) పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో లోటీగంజ్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. తృణమూల్‌ అభ్యర్థి అరూప్‌ బిశ్వాస్‌ చేతిలో ఓడిపోయారు. అలాగే బెంగాలీ సినీ నటి, బీజేపీ ఎంపీ లాకెట్‌ చటర్జీ(46) అసెంబ్లీ ఎన్నికల్లో చిన్‌సురా స్థానం నుంచి పోటీ చేసి, ఓటమి చవిచూశారు. ఇక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అసిత్‌ మజుందార్‌ (తపన్‌) విజయం సాధించారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు