బెంగాల్‌లో శాంతి భద్రతల పరిస్థితి... తీవ్ర ఆందోళనకరం

7 Jun, 2021 04:27 IST|Sakshi

రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధిస్తున్నారు

గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ మండిపాటు 

7న స్వయంగా హాజరై, వివరణ ఇవ్వాలని చీఫ్‌ సెక్రటరీకి ఆదేశం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడి మరింతగా రాజుకుంది. గవర్నర్‌ నేరుగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల అనంతరం శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని, పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిపోయిందని గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్‌ చేశారు. ఎన్నో హత్యలు, అత్యాచారాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఎన్నికల తర్వాత ప్రతీకారంలో భాగంగా కొనసాగుతున్న హింసను అరికట్టేందుకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని, ఈ నెల 7న (సోమవారం) తన ఎదుట స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని బెంగాల్‌ చీఫ్‌ సెక్రటరీ హెచ్‌కే ద్వివేదీని గవర్నర్‌ ఆదేశించారు.

బెంగాల్‌లో రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు పోలీసు యంత్రాంగాన్ని సైతం వాడుకుంటున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో హింసాకాండ వల్ల లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినవారు బాధితులుగా మారుతున్నారని అన్నారు.  అరాచక శక్తులు అమాయక ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తృ బెంగాల్‌లో ప్రజాస్వామ్య విలువలను పట్టపగలే కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులకు ఊడిగం చేస్తున్నారని
విమర్శించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు