రాష్ట్రపతి ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రిని పదవి నుంచి తప్పించాలని బీజేపీ డిమాండ్‌

13 Nov, 2022 21:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతిపై అభ్యంతరకర వ్యాఖ్యల వివాదంపై పశ్చిమబెంగాల్‌ బీజేపీ నిరసనలు ఉధృతం చేసింది. ప్రెసిడెంట్‌ ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అఖిల్‌ గిరిని పదవి నుంచి తప్పించాలని కాషాయ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ అంశానికి సంబంధించి క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ డిమాండ్‌ చేశారు.

బహిరంగ సభల్లో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసమని భారీ స్పీచ్‌లు దంచికొట్టే తృణమూల్‌ నేతల అసలు స్వరూపం బయటపడిందని ఆమె ధ్వజమెత్తారు. అఖిల్‌ గిరిపై ఢిల్లీలోని నార్త్‌ అవెన్యూ పోలిస్‌ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్‌ కూడా జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అఖిల్‌ గిరిని తక్షణమే అరెస్టు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎమ్మెల్యేగా కూడా ఆయనను డిస్మిస్‌ చేయాలని అన్నారు. 
(చదవండి: Prashant Kishor: ఎన్నికల్లో పోటీపై ప్రశాంత్‌ కిషోర్‌ క్లారిటీ.. ఏమన్నారంటే?)

వివాదమేంటి?
సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో క్లిప్‌ ప్రకారం.. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సువేంధు అధికారిపై విమర్శలు చేసే క్రమంలో బెంగాల్‌ మంత్రి అఖిల్‌ గిరి.. దేశ రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘సువేంధు అధికారి నా రూపం గురించి వ్యాఖ్యానిస్తారు. నేను చూడ్డానికి బాగుండనట. నువ్వెంత అందంగా ఉన్నావ్‌. మనిషి రూపాన్ని బట్టి అంచనా వేయకూడదు. ఎవరెలా ఉన్నా వారికిచ్చే గౌరవ మర్యాదలు వారికివ్వాలి. మన రాష్ట్రపతి చూడ్డానికి ఎలా ఉంటారు.. అయినా ఆమెను గౌరవిస్తున్నాం కదా’ అని వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది.

అయితే, తన తప్పును తెలుసుకున్న మంత్రి అఖిల్‌ గిరి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. కానీ, బీజేపీ నాయకులు మాత్రం తగ్గడం లేదు. మంత్రిని పదవి నుంచి తప్పించాల్సిందేనని పట్టుబడుతున్నారు.  ఇక వివాదం ముదరడంతో గిరి వివరణ ఇచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని, రాష్ట్రపతిని గౌరవిస్తానని ఆయన అన్నారు. రాజ్యాంగానికి లోబడి పనిచేస్తానని చెప్పారు. కొన్ని రోజుల క్రితం సువేంధు అధికారి తనను ఉద్దేశించి కొన్ని బాధాకరమైన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.

తన రూపు గురించి మాట్లాడి దారుణంగా అవమానించారని, వయసులో పెద్దవాడిననే కనీస గౌరవం లేకుండా బాధపెట్టారని గిరి చెప్పుకొచ్చారు. ‘బాధ, కోపం వల్లే సువేంధు అధికారిని విమర్శించాలని అనుకున్నా.. ఆ క్రమంలోనే పొరపాటుగా రాష్ట్రపతికి ఇబ్బంది కలిగేవిధంగా మాట్లాడా’ అని పేర్కొన్నారు. ఇక బీజేపీ నాయకుల విమర్శలపై తృణమూల్‌ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్‌ గోఖలే స్పందించారు. బీజేపీ నేతల తీరు ఆమోదయోగ్యం కాదని అన్నారు. తమ పార్టీ రాష్ట్రపతికి అపారమైన గౌరవం ఇస్తుందన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్‌ చేశారు.
(చదవండి: భారీ షాకిచ్చిన కేం‍ద్రం.. 10 లక్షల రేషన్‌ కార్డులు రద్దు, కారణం ఇదే!)

మరిన్ని వార్తలు