టీడీపీకి సోంబాబు గుడ్‌బై 

7 Nov, 2020 09:23 IST|Sakshi

ద్వారకా తిరుమల (పశ్చిమ గోదావరి): జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని వీరవెంకట సత్యన్నారాయణ సీతారామస్వామి (సోంబాబు) పార్టీకి గుడ్‌బై చెప్పారు. రాజీనామా పత్రాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి శుక్రవారం పంపారు. 2002లో టీడీపీలో చేరిన ఆయన 18 ఏళ్ల పాటు పనిచేశారు. 11 ఏళ్ల నుంచి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చినా, పార్టీ తనను ఏమాత్రం పట్టించుకోలేదని, ఐదేళ్లలో ఏనాడూ కనీస గౌరవం ఇవ్వలేదని రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పారీ్టకి రాజీనామా చేసిన తాను ఇకపై తన కుటుంబ సభ్యులు స్థాపించిన చారిటబుల్‌ ట్రస్టుల వ్యవహారాలను చూసుకుంటానని చెబుతున్నారు. (చదవండి: టీడీపీలో అసంతృప్తి సెగలు..

వెలమ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు మొండిచేయి చూపారని సోంబాబు ఆరోపించారు. ఉంగుటూరు అసెంబ్లీ సీటు కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యత్వాల పేరుతో ఒక్కో జిల్లా నుంచి రూ.వంద కోట్లు వసూలు చేసిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఒక్క గోపాలపురం నియోజకవర్గం నుంచే తాము రూ.60 లక్షలు ముట్టజెప్పామని పేర్కొన్నారు. ఆ డబ్బంతా ఏమైందో కూడా తెలియడం లేదని ధ్వజమెత్తారు. సభ్యత్వం కలిగిన కార్యకర్త చనిపోతే వారికి ఇన్సూరెన్స్‌ కింద కొంత నగదు ఇస్తామని చెప్పారని, అయితే ఏ ఒక్కరికీ ఇచ్చిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం పార్టీని పతనం చేస్తున్నాయని, త్వరలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని సోంబాబు వివరించారు. (చదవండి: టీడీపీ తప్పిదాలే పోలవరానికి శాపాలు)

మరిన్ని వార్తలు