వేడి రగిల్చిన పైలట్‌​ దారెటు?

25 Jul, 2020 17:50 IST|Sakshi

జైపూర్‌/ఢిల్లీ: రాజస్తాన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటుతో దేశవ్యాప్తంగా రాజకీయ వేడి రగిల్చిన సచిన్‌ పైలట్‌, అతని వర్గం అనర్హతకు గురవుతుందా? అలా అయితే, యువనేత తీసుకునే నిర్ణయం ఏమై ఉంటుందనే ప్రశ్నలు రాజకీయ ఉద్ధండుల నుంచి సామాన్యుల వరకు తొలుస్తున్నాయి. స్పీకర్‌ సీపీ జోషి అనర్హత వేటు నిర్ణయంపై పైలట్‌ కోర్టుకెక్కగా.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పిన హైకోర్టు నిన్న కూడా మరోసారి అలాంటి ఉత్తర్వులే జారీ చేసింది. సోమవారం వరకు సంయమనం పాటించాలని, అప్పటి వరకు స్టేటస్‌ కో (యథాతథ స్థితి) కొనసాగించాలని స్పీకర్‌ను ఆదేశించింది. దీంతో రెండు వారాల క్రితం మొదలైన రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. 
(చదవండి: సీఎం అశోక్‌ గహ్లోత్‌ కీలక వ్యాఖ్యలు)

కాషాయంపై ఆసక్తి లేదు
సీఎం అశోక్‌ గహ్లోత్‌తో విభేదాలతో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన పైలట్‌ కాంగ్రెస్‌ అధిష్టానం ఎన్ని చర్చలు జరిపినా దిగిరాలేదు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరుతారనే వార్తలు వినిపించాయి. అయితే, తాను కాంగ్రెస్‌ మనిషినని, కమలం పార్టీలో చేరేది లేదని పైలట్‌ తెగేసి చెప్పారు. గహ్లోత్‌తో మాత్రమే తన పంచాయితీ అని తెలిపారు. మరోవైపు పైలట్‌కు, అతని వర్గం ఎమ్మెల్యేలకు ఇప్పటికీ తలుపులు తెరిచే కాంగ్రెస్‌ అధిష్టానం చెప్తుండగా పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. గహ్లోత్‌ వర్గం పైలట్‌ను పూర్తిగా దూరం పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో పైలట్‌పై అనర్హత వేటు విషయం పక్కనపెడితో రాజకీయంగా అతని నిర్ణయంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. గహ్లోత్‌తో విభేదాలు మర్చిపోయి.. హస్తం పార్టీలో ఇమడలేక, కాషాయ తీర్థం పుచ్చుకోలేక సొంత పార్తీ వైపే పైలట్‌ అడుగులు పడతాయేమో చూడాలి!!

ప్రగతి శీల కాంగ్రెస్‌ పార్టీ
మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా మాదిరిగా కాంగ్రెస్‌కు ‘నై’అని బీజేపీలో కీలక నేతగా ఎదుగుదామనుకున్న పైలట్‌కు అదంతా చిన్న విషయం కాదని తెలిసిపోయినట్టుంది. మాజీ సీఎం, సీనియర్‌ నేత వసుంధర రాజే పార్టీలో ఉండగా పైలట్‌కు అక్కడ తగిన ప్రాధాన్యం దొరకడం సాధ్యం కాదు. ఇదంతా తెలుసుకునే పైలట్‌ కాషాయానికి దూరంగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగా సొంత పార్టీపై తిరుగుబాటు చేసిన పైలట్‌ ‘ప్రగతి శీల కాంగ్రెస్‌’ పేరుతో పార్టీ పెట్టాలని అనుచర వర్గం కోరుతోందనే వార్తలూ వినిపిస్తున్నాయి. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అసమ్మతి గళం ఎత్తిన పైలట్‌కు సొంత పార్టీయే మేలు చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
(భార్య ప్రేమ కోసం సైకిల్‌ మీద ఖండాంతరాలు దాటి..)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా