డబుల్‌ యువరాజులు x డబుల్‌ ఇంజిన్‌ అభివృద్ధి

2 Nov, 2020 03:51 IST|Sakshi

బిహార్‌ ఎన్నికల ప్రచారంలో తేజస్వీ యాదవ్, రాహుల్‌ గాంధీలపై మోదీ విమర్శలు

అయోధ్య, ఆర్టికల్‌ 370, పౌరసత్వ సవరణ చట్టాలను ప్రస్తావించిన ప్రధాని

సమస్థిపూర్‌/చప్రా/మోతీహరి/బగహ: బిహార్‌ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల ప్రచార గడవు ముగుస్తున్న నేపథ్యంలో  ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రంలో సుడిగాలి పర్య్టటన చేశారు. నాలుగు వరుస బహిరంగ సభల్లో విపక్ష నేతలపై వాడి విమర్శలతో దండెత్తారు. పశ్చిమ చెంపారన్‌ జిల్లాలోని బగహలో రెండో దశ ఎన్నికల ప్రచార చివరి సభలో ప్రసంగిస్తూ.. దేశవ్యాప్తంగా నవంబర్‌ 3న జరగనున్న ఉప ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత ప్రచార సభల్లో మాదిరిగానే ఆదివారం నాటి ప్రచారంలోనూ ఆర్జేడీ నేత, మాజీ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌ లక్ష్యంగా ప్రధాని విమర్శలు గుప్పించారు.

ఈ సారి తేజస్వీయాదవ్‌తో పాటు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని కూడా కలిపి.. ‘వారిద్దరూ జంగిల్‌ రాజ్‌ కోసం కృషి చేస్తున్న డబుల్‌ యువరాజులు’ అంటూ ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరు యువరాజులు రాష్ట్రాన్ని లాంతర్ల కాలం నుంచి విద్యుత్‌ వెలుగుల వైపు తీసుకువచ్చిన ఎన్డీయే డబుల్‌ ఇంజిన్‌ అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. ‘ఇద్దరు యువరాజుల్లో ఒకరు కొన్నేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లో ఒక కూటమిని ఏర్పాటు చేశారు. రాష్ట్రమంతా తిరిగారు. ఆ కూటమి అక్కడ మట్టికరిచింది. జాగ్రత్త.. ఆ యువరాజు ఇప్పుడు బిహార్‌కు వచ్చాడు. ఇక్కడి ఆటవిక రాజ్య యువరాజుకు మద్దతిస్తున్నాడు. వీరికి వ్యతిరేకంగా డబుల్‌ ఇంజిన్‌ అభివృద్ధితో దూసుకుపోతున్న ఎన్డీయే మరోవైపుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.

‘ఆ డబుల్‌ యువరాజుల ఏకైక లక్ష్యం వారి రాచరికాలను కాపాడుకోవడమే’నన్నారు. 2017లో జరిగిన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఘోరంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. తాజా ప్రచారంలో వివాదాస్పద అంశాలైన అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం .. మొదలైన వాటిని ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తే జమ్మూకశ్మీర్‌ ఆందోళనలతో అట్టుడుకిపోతుందని, అక్కడి నదుల్లో రక్తం పారుతుందని కొందరు అమాయక ముఖాలతో భయపెట్టారు. కానీ ఆ ఆర్టికల్‌ను రద్దు చేస్తూ మేం తీసుకున్న నిర్ణయంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకుని అవినీతి రహిత పాలనతో అభివృద్ధి వైపు దూసుకువెళ్తున్నారు’ అన్నారు. బిహార్‌ విపక్ష మహా కూటమిలో సీపీఐఎంఎల్‌ భాగస్వామి కావటాన్ని ప్రస్తావిస్తూ.. ‘రాష్ట్రంలో ఆటవిక పాలనకు కారణమైన వారు ఇప్పుడు నక్సలిజం మద్దతుదారులతో, తుక్డే తుక్డే గ్యాంగ్‌తో చేతులు కలుపుతున్నారు’ అని పేర్కొన్నారు.

ముగిసిన ప్రచారం
బిహార్‌లోని 17 జిల్లాల్లో విస్తరించిన 94 అసెంబ్లీ స్థానాల్లో జరిగే ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం ఆదివారంతో ముగిసింది. వీటిలో మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు ముఖ్యమైనవి. జ్యోతిరాదిత్య సింధియా అనుచరులైన ఎమ్మెల్యేలు ఫిరాయింపునకు పాల్పడటంతో అక్కడ కమల్‌నాథ్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయి, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సీఎంగా బీజేపీ సర్కారు ఏర్పాటైన విషయం తెలిసిందే. మెజారిటీ సాధించేందుకు ఈ ఎన్నికల్లో బీజేపీ కనీసం 9 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది. ఉప ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో యూపీ(7), గుజరాత్‌(8), ఛత్తీస్‌గఢ్‌(1), హరియాణా(1), జార్ఖండ్‌(2), కర్ణాటక(2), ఒడిశా(2), నాగాలాండ్‌(2), తెలంగాణ(1) ఉన్నాయి.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు