Congress: టికెట్ అయితే అనౌన్స్ చేశారు.. కొత్త చిక్కులొచ్చి పడ్డాయే!

14 Sep, 2022 15:28 IST|Sakshi

మునుగోడు కాంగ్రెస్ టిక్కెట్ పాల్వాయి స్రవంతికి ఇవ్వడం వెనుక ఏం జరిగింది? టిక్కెట్ ఆశించిన ఆ ముగ్గురు పార్టీ కోసం పనిచేస్తారా? అభ్యర్థికి పార్టీ ఆర్దిక వనరులు సమకూరుస్తుందా? స్రవంతికి టిక్కెట్ ఇప్పించేందుకు హైకమాండ్‌కు సీనియర్లు ఏం చెప్పారు? అసలు మునుగోడు టిక్కెట్ విషయంలో టీ కాంగ్రెస్ లో ఏం జరిగింది? 

కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేసింది. అయితే స్రవంతికి టికెట్ ఇవ్వడం వెనక చాలా తతంగమే నడిచిందంటున్నారు పార్టీలోని కొందరు నేతలు. మొదటి నుంచి పాల్వాయి స్రవంతి, చెల్లమల్ల కృష్ణారెడ్డి టికెట్ విషయంలో తీవ్రంగా పోటీపడ్డారు. కృష్ణారెడ్డికే టిక్కెట్ కన్ఫార్మ్ అయినట్లుగా ప్రచారం కూడా జరిగింది. ఉప ఎన్నిక అంటే అంత ఈజీ కాదు.. మునుగోడు ఎన్నికల్లో నిలబడాలంటే 50 నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టాలనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా వీక్‌గా ఉన్న స్రవంతికి టిక్కెట్ ఇస్తే ఉపయోగం లేదని, ఆర్దికంగా బలంగా ఉన్న కృష్ణారెడ్డికి ఇస్తే పార్టీకి ఉపయోగం ఉంటుందని కొందరు సలహా ఇచ్చారు.

అయితే టికెట్ విషయంలో నల్లగొండ జిల్లా సీనియర్ నేతలంతా ఏకమయ్యారు. హైకమాండ్‌ దగ్గర తమ పలుకుబడిని ఉపయోగించారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి వంటి సీనియర్లంతా పాల్వాయి స్రవంతికే టిక్కెట్ ఇవ్వాలని తెగేసి చెప్పారట. ఒక వేళ డబ్బే ఎన్నికల్లో ప్రధానం అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్‌ను ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్ల కాదని కూడా వారు స్పష్టం చేసినట్లు సమాచారం. దీనికి తోడు దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వారసురాలిగా , మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న స్రవంతిని కాదని కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే భవిష్యత్‌లో పార్టీ కోసం ఎవరూ పనిచేయరని సీనియర్ నేతలు అధిష్టానానికి విస్పష్టంగా చెప్పినట్లు సమాచారం. దీంతో అన్నీ ఆలోచించిన అధిష్టానం పాల్వాయి స్రవంతి పేరునే ఖరారు చేసిందట.

చదవండి: (కరీంనగర్‌ జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు)

జిల్లాకు చెందిన సీనియర్ నేతల సూచన మేరకే.. టిక్కెట్ అయితే అనౌన్స్ చేసారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. టిక్కెట్ ఆశించిన మిగతా ముగ్గురు నేతలు ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేస్తారా అనే సందేహం ఇప్పుడు మిగతా నేతల్ని తొలిచేస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డిని కలిసిన కృష్ణారెడ్డి పార్టీ కోసం పనిచేస్తానని చెప్పినా గ్రౌండ్‌లోలో పనిచేస్తారో లేదో చూడాలి. ఇంకో వైపు కృష్ణారెడ్డి, పల్లెరవి, కైలాష్ నేతలతో పీసీసీ, సీఎల్పీ నేతలు గాంధీ భవన్‌కు పిలిపించుకుని  బుజ్జగించారు. అయినప్పటికీ ఏ మేరకు వీరు ముగ్గురు పాల్వాయి స్రవంతి కోసం పనిచేస్తారో చూడాలి.

మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖర్చుతో కూడుకున్నదని ఇప్పటికే పార్టీలో చర్చ జరుగుతోంది. టిఆర్ఎస్, బీజేపీలు పెట్టే ఖర్చులో సగం అయినా కాంగ్రెస్ పార్టీ పెట్టాలని.. లేదంటే పోటీలో ఉండటం కష్టమనే అభిప్రాయం గాంధీభవన్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పాల్వాయి స్రవంతికి లోకల్‌గా కొంత పట్టున్నా ఆర్థికంగా బలహీనంగా ఉందని పార్టీ నేతలే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్రవంతికి పార్టీ తరపున ఆర్థిక వనరులు సమకూర్చాలని సునీల్ కనుగోలు సూచించినట్లు తెలుస్తోంది. పీసీసీ ఛీఫ్‌తో పాటు సీఎల్పీ, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు ఆర్థికంగా సపోర్ట్ చేయాలనే డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది.

పాల్వాయి స్రవంతికి టికెట్ ఇప్పించడంలో సీనియర్‌లు పంతం నెగ్గించుకున్నారు. మరోవైపు స్రవంతికి టికెట్ ఇవ్వడం ద్వారా తొలినుంచీ కాంగ్రెస్‌లో ఉన్న వారికి ప్రాధాన్యత లభిస్తుందనే నమ్మకాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ లలో కల్పించిందనే అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు