కాంగ్రెస్‌.. మోదీ.. మధ్యలో కేటీఆర్‌ అదిరిపోయే ఎంట్రీ

23 May, 2023 19:21 IST|Sakshi

కర్ణాటకలో కమలం పార్టీ ఎన్నికల ప్రచారానికి, తెలంగాణలో గులాబీ పార్టీకి ఏంటి సంబంధం? ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ ఏంటి? మోదీ కామెంట్స్‌కి తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఎందుకిచ్చారు? కేటీఆర్ ట్వీట్‌లో నిజామాబాద్ ఎంపీని కూడా ఎందుకు లాగారు? టాపిక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా?  పసుపు మనిషిలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.

అయితే కరోనా క్లిష్ట సమయంలో దీని గురించి ప్రధాని మోదీ చెప్పారట. ఆ సమయంలో ప్రజలకు అవసరమైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా పసుపు ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుందని ప్రధాని వ్యాఖ్యానించడాన్ని కాంగ్రెస్ పార్టీ హేళన చేసిందట. అప్పుడు కాంగ్రెస్ తన వ్యాఖ్యలను హేళన చేసి పసుపు రైతుల్ని అవమానించిందంటూ.. కర్నాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. పసుపు ఇమ్యూనిటీ బూస్టర్ అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ, ప్రధాని మధ్య జరిగిన డైలాగ్ వార్ మధ్యలోకి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

కాంగ్రెస్ మీద ప్రధాని మోదీ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ.. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తరపున నిజామాబాద్ నుంచి పోటీ చేసిన అరవింద్ రాసిచ్చిన బాండ్ పేపర్‌ను కేటీఆర్ ట్విట్టర్లో పెట్టారు. రాష్ట్రంలోని పసుపు రైతుల కోసం కేంద్రం నుంచి పసుపు బోర్డు తీసుకొస్తామని.. తీసుకురాలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ఎంపీ అభ్యర్థి అరవింద్ రాసిచ్చిన బాండ్ పేపర్‌ను ట్యాగ్ చేయడంతో రాజకీయ రచ్చ మొదలైంది. ఇంతవరకూ పసుపు బోర్డును తీసుకురాకపోవడం పసుపు రైతులకు నిజమైన అవమానం అని ట్విట్టర్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. పసుపు రైతులు మోదీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని కూడా వ్యాఖ్యానించారు. ఒక్క ట్వీట్ ద్వారా కేటీఆర్ అటు ప్రధాని మోదీకి..ఇటు నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కి కౌంటర్లు వేశారా అంటే అవుననే అంటున్నారు గులాబీ పార్టీ నేతలు.

వాస్తవానికి నిజామాబాద్ ఎంపీ అరవింద్‌ను గులాబీ పార్టీ చాలా కాలంగా టార్గెట్ చేసింది. పసుపు బోర్డు విషయంలో హామీ ఏమైంది అంటూ ప్రశ్నలు కురిపిస్తూనే ఉంది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని.. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలంతా.. సమయం చిక్కినప్పుడల్లా.. బీజేపీ ఎంపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ప్రధానంగా ఆర్మూరు కేంద్రంగా పసుపు రైతుల ఉద్యమం దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ నాయకత్వాన గల రాష్ట్ర అధికార పార్టీ పసుపు బోర్డు తీసుకురాలేకపోయిందన్న అసంతృప్తితో ఉన్న రైతులకు అరవింద్ హామీ ఇచ్చారు. బీజేపీ నుంచి పసుపు బోర్డ్ను తాను తీసుకొస్తానని, తీసుకురాలేని పక్షంలో రాజీనామా చేస్తానని అరవింద్ ప్రకటించారు. ఆ మేరకు బాండ్ పేపర్ కూడా రాసి రైతులకు చూపించారు. ఎంపీగా విజయం సాధించారు. కేసీఆర్ కుమార్తె కవిత పరాజయం పాలయ్యారు.
చదవండి: కరీంనగర్‌లో మారుతున్న పాలిట్రిక్స్‌.. ఈ సారి గంగుల కమాలకర్‌కు కష్టమే! 

అరవింద్ ఎంపీగా గెలిచినప్పటినుంచీ పసుపు బోర్డు గురించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం తీసుకొచ్చామని, పసుపునకు మంచి ధర కూడా రైతులకు లభిస్తోందని ఎంపీ అరవింద్ చెబుతున్నారు. అటు రైతులు, ఇటు బీఆర్ఎస్ ఈ విషయంలో సంతృప్తి చెందలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా పసుపు బోర్డ్ మరోసారి రాజకీయ అస్త్రంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సారి కమలనాథులు పసుపుబోర్డ్ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

మరిన్ని వార్తలు