ఎదురుగాలి వీస్తుందా? గులాబీ బాస్ ఆదేశాలు.. ఆ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు..?

25 Aug, 2022 16:25 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: రాబోయేది ఎన్నికల కాలం కావడంతో ఇందూరు పాలిటిక్స్‌ అప్పుడే హాట్‌ హాట్‌గా మారిపోతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఐదేళ్ళ పాటు గులాబీ పార్టీ హవా కొనసాగింది. ధర్మపురి అరవింద్‌ బీజేపీ ఎంపీగా గెలిచిన తర్వాత రాజకీయాల రంగు మారింది. గులాబీకి కమలం పోటాపోటీగా వస్తోంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ వచ్చాక హస్తం కూడా యాక్టివేట్‌ అయింది. దీంతో మూడు పార్టీల రాజకీయాలు ఇందూరులో ఆసక్తికరంగా సాగుతున్నాయి.
చదవండి: మరో వీడియో విడుదల చేసిన రాజాసింగ్‌.. సంచలన వ్యాఖ్యలు 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజామాబాద్‌ జిల్లా యావత్తు గులాబీ మయంగా మారింది. తొలి ఎన్నికల్లో మొత్తం అసెంబ్లీ సీట్లు, లోక్‌సభ స్థానాలు టీఆర్‌ఎస్ గెలుచుకుంది. ఇందూరు జిల్లాలో మరో పార్టీకి అవకాశమే లేదన్నంతగా పరిస్థితులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారాయి. కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించింది. అయితే ఆ తర్వాత క్రమంగా గులాబీ రంగు వెలియడం మొదలైంది. 2018 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితుల్లో కొంత మార్పు కనిపించింది. ఉద్యమపార్టీగా ప్రజల అభిమానం పొందిన గులాబీ పార్టీపై అసంతృప్తి ప్రారంభమైనట్టు స్పష్టమైంది. అంతకుముందు ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకున్న గులాబీ పార్టీకి 2018లో ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది.

అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన జాజుల సురేందర్ కారెక్కేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆరు నెలలకు వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో కవిత ఓటమి చెంది బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ ఎంపీగా విజయం సాధించారు. తొలిసారి నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో కమలం వికసించింది. ఇది రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జిల్లా రాజకీయాలు మారుతూ వస్తున్నాయి. అప్పటివరకూ ఏకఛత్రాధిపత్యంగా దూసుకుపోతున్న కారుకు... అడుగడుగునా కమలం అడ్డుపడుతుండటంతో జిల్లాలో మళ్లీ అధికార, ప్రతిపక్షాల మధ్య ఫైట్‌కు తెరలేచింది. అయితే తర్వాత మళ్లీ నిజామాబాద్ కేంద్రంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత విజయం సాధించారు.

పలు సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ... కొన్నింటిని అందిస్తూ... గత పాలక పార్టీలతో పోల్చి చూసినప్పుడు  టీఆర్ఎస్ ప్రభుత్వమే బెటర్ అనే చర్చ జనసామాన్యంలో జరుగుతోంది. అయితే పథకాలు అందరికీ అందకపోవడం, గులాబీ పార్టీ కార్యకర్తలకే అందుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మంచిప్ప వంటి రిజర్వాయర్స్, దళితబంధు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం... ఇచ్చిన పలు హామీలను నెరవేర్చకపోవడం ప్రజల్లో అసంతృప్తి పెంచుతున్నాయి.

కొత్త పింఛన్లు రాకపోవడం.. క్షేత్రస్థాయిలో గులాబీ కార్యకర్తల విపరీత పోకడలు వంటివెన్నో ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి. అయితే ఈ వ్యతిరేకతను అదేస్థాయిలో విపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోలేకపోయాయి. కాంగ్రెస్ ఈ విషయంలో పూర్తిగా వెనుకబాట పట్టగా... బీజేపినే అంతో ఇంతో చెరకు రైతుల సమస్యలు, పసుపు రైతుల సమస్యల వంటివాటిని ముందుకు తెస్తూ ప్రజల్లో ప్రచారం తెచ్చుకుంటోంది. 

ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి, మంత్రి పదవులు అనుభవించిన ధర్మపురి శ్రీనివాస్‌ ఆపద కాలంలో హస్తానికి హ్యాండిచ్చి.. కారెక్కడం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది. హస్తాన్ని వీడినందుకు రాజ్యసభ సీటు దక్కినా, కొన్నాళ్ళ తర్వాత కారులో కూర్చోలేక బయటికొచ్చారు ధర్మపురి శ్రీనివాస్‌. ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా బాస్‌గా నిలిచిన మండవ వెంకటేశ్వరరావు వంటి సీనియర్ నేతల ఉనికే లేకుండా పోయింది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి లాంటివాళ్లు రెండు సార్లుగా ప్రేక్షక పాత్రకే పరిమితం కావల్సి వచ్చింది. అయితే ధర్మపురి శ్రీనివాస్‌ తనయుడు అరవింద్ ఎంపీ కావడంతో... ఇందూర్ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపి ఫైట్ ముదిరి రాజకీయం రసవత్తరంగా మారింది.

అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రావచ్చన్న ప్రచారంతో ప్రతిపక్షాలు అప్రమత్తమయ్యాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం కావాలన్న పార్టీల అధినాయకత్వాల ఆదేశాలతో ఇందూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదే సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తుండటంతో... శాసనసభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తప్పదన్నట్టుగా పీకే సర్వే సారాంశమున్నట్టుగా వార్తలు గుప్పుమన్నాయి. జిల్లాలోనూ ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బోధన్ తో పాటు.. జుక్కల్ వంటి నియోజకవర్గంలోనూ రాబోయే రోజుల్లో గులాబీలు మళ్లీ వికసిస్తాయా అన్న అనుమానాలైతే ఇప్పటికే బలపడుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలోని మొత్తం 9 నియోజకవర్గాల్లో ఐదారు నియోజకవర్గాల్లో అధికారపార్టీకి ఎదురుగాలి వీస్తున్నదనే ప్రచారమైతే జరుగుతోంది. జిల్లాలో ఏర్పడిన ఈ ప్రతికూల పరిస్థితులను అధికారపార్టీ ఎలా అధిగమిస్తుంది? కాంగ్రెస్, బీజేపీలు తమకనుకూలంగా ఎలా మల్చుకుంటాయన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది.  త్రిముఖ పోటీ ఉంటుందనుకుంటున్న క్రమంలో.. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రూపంలో బీఎస్పీ, షర్మిల రూపంలో వైఎస్సార్‌టీపీ, తెలంగాణాలోనూ పోటీ చేస్తామంటున్న ఆప్ వంటి పార్టీలు కూడా బరిలోకి దిగడం వల్ల ఎవ్వరికి లాభం, ఎవ్వరికి నష్టమనే లెక్కలు వేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు