ప్రశాంత్‌ కిషోర్‌ సూచనలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంగీకరిస్తారా?

27 Jun, 2022 17:27 IST|Sakshi

రాజకీయాల్లో ఎప్పుడు తొందరగా ఒక నిర్ణయానికి రాకూడదు... చివరి బంతి పడేవరకు గెలుపు ఓటముల గురించి ఎవరూ ఊహించలేరు.. ఇది సాధారణంగా రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళు ఎక్కువగా చెప్పే మాటలు. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఇంటాబయటా బాగానే చర్చలు జరుగుతున్నాయి. అసలు ప్రశాంత్‌ కిషోర్ ఏం చెప్తున్నారు? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చేస్తున్నారు? దీనిపై అందరి దృష్టి నెలకొంది. ఎవరేమి చెప్పినా అంతిమంగా తాను అనుకునేది చేస్తారనేది కేసీఆర్‌కు మొదటి నుంచి ఉన్న ఇమేజ్.

అయితే ప్రశాంత్‌ కిషోర్‌ తీరు మరోలా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ అధినేతలకు వ్యూహకర్తగా వ్యవహరించి సక్సెస్ అయిన ప్రశాంత్ కిషోర్ ఈసారి తెలంగాణలో ఎలాంటి పాత్రను ఎంతవరకు పోషించబోతున్నారన్న దానిపై రకరకాల అంచనాలున్నాయి. పీకే టీం ఇచ్చే రిపోర్టులను, సలహాలను కేసీఆర్ పూర్తిగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది టిఆర్ఎస్ లో ప్రస్తుతం అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ప్రస్తుతం అత్యంత కీలకమైన అంశం నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక. ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా సీఎం కేసీఆర్ టికెట్ల విషయంలో మార్పులు చేర్పులు చేస్తారా? అన్నదానిపై భారీగా ఆసక్తి నెలకొంది.

ఇంతకీ ప్రశాంత్‌ కిషోర్‌ నివేదిక అని ప్రచారంలో ఉన్న అంశాలేంటీ?
* కనీసం 30 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలి
* పార్టీకన్నా ఎమ్మెల్యేలపైనే వ్యతిరేకత ఎక్కువ
* ప్రజలకు అందుబాటులో లేని వాళ్లకు టికెట్‌లు వద్దు
* కొత్త ముఖాలను తీసుకురావాలి
* ఇతర రంగాల్లో సక్సెస్‌ అయి.. ప్రజలకు సుపరిచితులయిన వారి పేర్లను పరిశీలించాలి

దుబ్బాక ఎన్నికల నుంచి ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌పై భారీగా విమర్శలు చేస్తోన్న కమలం నేతలు.. టీఆర్‌ఎస్‌ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తుందంటూ ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్నది బిజెపి, కాంగ్రెస్‌ పదేపదే చేస్తున్న ప్రచారం. కర్ణాటక అసెంబ్లీ తో పాటే తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఈ పార్టీలు భావిస్తున్నాయి.

అయితే తాము ముందస్తు కు వెళ్లే అవకాశం లేదని టిఆర్ఎస్ అధినాయకత్వం చెప్తున్నా ఎక్కడో ఓ మూల ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఆ అభిప్రాయం ఇంకా పోలేదు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాజ్‌భవన్‌ వర్గాలు గానీ, కేంద్రం గానీ ముందస్తుకు సుముఖంగా లేరన్నది ప్రజా బాహుళ్యంలో ఉన్న ప్రచారం. ఒక వేళ కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలనుకుంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్‌ అసెంబ్లీ రద్దు.

ముందస్తు వచ్చినా రాకపోయినా... సాధారణ ఎన్నికలు కూడా అంత దూరంలో ఏమి లేవు. ఈ నేపథ్యంలోనే టికెట్ల అంశంపై ప్రశాంత్ కిషోర్ సర్వేలు నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ సర్వేలు చేస్తున్న మాట వాస్తవమేనని కేసీఆర్ కూడా ఇప్పటికే అంగీకరించారు. పార్టీ పనితీరు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సర్వేల వివరాలు ఎలా ఉన్నా ఎమ్మెల్యేల పనితీరు పై జరుగుతున్న సర్వేలపై మాత్రం ఆ పార్టీ నేతలకు నిద్ర పట్టడం లేదు.

కొత్తగా తమ నియోజకవర్గ పరిధిలోకి ఎవరు వచ్చినా సర్వేల పేరిట ఎక్కడైనా సమాచారం ఉన్నా వెంటనే ఎమ్మెల్యేలు అలర్ట్ అవుతున్నారు. తమకు అనుకూలంగా సర్వేలు వచ్చేందుకు నానా తంటాలు కూడా పడుతున్నారు.

* ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో ఉంటున్నారా?
* ఎమ్మెల్యేకు సమస్యలు చెబితే ఎప్పటిలోగా పరిష్కరిస్తున్నారు?
* ఈ సారి ఈ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే గెలుస్తారా?
* ఎమ్మెల్యే కాకుండా ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంది?
ఈ అంశాలపై సర్వే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి సక్సెసైన కేసీఆర్ అప్పుడు ఎన్నికల్లో దాదాపుగా మెజార్టీ సిట్టింగులకు మళ్లీ అవకాశం కల్పించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో ఈసారి కూడా అదే ఫార్ములాను అవలంబిస్తారా లేదా అన్నది పార్టీలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఉమ్మడి జిల్లాలయిన వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాదులలో మార్పులు చేర్పులకు అవకాశం ఎక్కువగా ఉంటుందని కొందరు అంటున్నారు. ఈ జిల్లాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటమి ఎదురయింది. దెబ్బతిన్న ఈ సెగ్మెంట్ల పై అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక్కడ కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఫిర్యాదులు కూడా అందాయి. ప్రశాంత్ కిషోర్ టీం ప్రస్తుతం చేస్తున్న సర్వేల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్న కేసీఆర్, కనీసం 30 పైగా సీట్లలో మార్పులు చేస్తేనే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ 30 మంది ఎవరు అనే విషయం కేసీఆర్‌కు తప్ప మిగతా ఎవరికీ క్లారిటీ లేదని చెబుతున్నారు.

కేసీఆర్ చాలా సందర్భాల్లో ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. పీకే 30 మందికి పైగా సిట్టింగులకు టికెట్ ఇవ్వకూడదని అంటే యధావిధిగా దానిని అమలు చేస్తారా లేక ప్రతికూల పరిణామాలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించి వాటిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అన్నది కూడా ఆలోచించాలి. గత రెండు ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్‌కు ఎంత అవసరమో ఈసారి ఎన్నికల్లో గెలుపు అంతకన్నా ముఖ్యమైనది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించాలన్న వాదన చాలా రోజుల నుంచి పార్టీలో ఉంది. ఈసారి మంచి మెజార్టీ సాధిస్తే ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగిస్తారన్న భావన పార్టీ నేతల్లో ఉంది. ఇవన్నీ కేసీఆర్ అనుకున్న రీతిలో జరగాలంటే ప్రశాంత్ కిషోర్ ఇస్తున్న రిపోర్టులు కీలకమనే విషయాన్ని పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు.
-అప్పరసు నరసింహారావు, పొలిటికల్‌ బ్యూరో చీఫ్‌, సాక్షి టీవీ

మరిన్ని వార్తలు