దేశం ప్రమాదంలో ఉంది.. పోరాడాల్సిందే

11 May, 2022 18:45 IST|Sakshi

తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత అభిషేక్ బెనర్జీ

అసోం నుంచి బీజేపీని తరిమికొడతామని ప్రతిజ్ఞ

గువాహటి: బీజేపీ పాలనలో దేశం ప్రమాదంలో పడిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో టీఎంసీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా అసోం రాజధాని గువాహటిలో పార్టీ కార్యాలయాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘హిందువులు ప్రమాదంలో ఉన్నారని కొందరు అంటున్నారు. ముస్లింలు ప్రమాదంలో ఉన్నారని మరికొందరు అంటున్నారు. మీ మతం కళ్లద్దాలు తీసి చూడండి భారతదేశం ప్రమాదంలో ఉంద’ని వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అసోంలోని 14 లోక్‌సభ స్థానాలకు గాను 10 స్థానాలు గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. 

గెలిచే వరకు విశ్రమించబోం
అసోం నుంచి అవినీతి బీజేపీని తరిమి కొట్టడానికి టీఎంసీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని అభిషేక్ బెనర్జీ చెప్పారు. ‘టీఎంసీ ఎక్కడ అడుగుపెట్టినా చివరి వరకు గట్టిగా పోరాడింది. రెండేళ్లలో బీజేపీని తరిమికొట్టేందుకు ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో గెలిచే వరకు విశ్రమించబోం. పోరాటం ప్రారంభించిన తర్వాత వెనక్కి తిరిగి చూడబోం. అసోంలో అసెంబ్లీ ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉంది. లోక్‌సభ ఎన్నికలు రెండేళ్లలో జరగనున్నాయి. ఇక్కడ 14 సీట్లకు గాను 10 స్థానాల్లో పోరాడి గెలుస్తామ’ని అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపుర, మేఘాలయా రెండింటిలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. (క్లిక్: జేపీ మీటింగ్‌కు రాహుల్‌ ద్రవిడ్‌..?)

భారీగా చేరికలు
ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేయడంపై టీఎంసీ అధినాయకత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రిపున్ బోరాను అసోం టీఎంసీ అధ్యక్షుడిగా నియమించింది. ఆయన ఇలీవలే కాంగ్రెస్‌ పార్టీని వీడి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరారు. కాగా, కొద్ది రోజుల్లోనే జిల్లా, బ్లాక్ కమిటీలను ఏర్పాటు చేస్తామని అభిషేక్ బెనర్జీ తెలిపారు. 2022 చివరి నాటికి అన్ని బూత్‌లలో కమిటీలు ఉండేలా చూస్తామన్నారు. మరోవైపు ప్రాంతీయ, జాతీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అభిషేక్ బెనర్జీ సమక్షంలో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. (క్లిక్: అవార్డ్‌ తిరిగి ఇచ్చేసిన రచయిత్రి.. బీజేపీ, టీఎంసీ మాటల యుద్ధం)

మరిన్ని వార్తలు