Telangana: వచ్చే ఎన్నికల్లో కీలకం కాబోతున్న అంశాలేంటి?

7 Aug, 2022 15:21 IST|Sakshi

2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపులో కీలకపాత్ర పోషించిన మరో ఫ్యాక్టర్ ముస్లింలు. దశాబ్దాలుగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటుబ్యాంకుగా ఉన్నముస్లింలు 2009 తరువాత కాంగ్రెస్‌కు దూరమయ్యారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించడంతో ముఖ్యమంత్రి అయిన రోశయ్య.. ఆ తరువాత వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుతో ముస్లింలు ఆ పార్టీకి దూరంగా జరిగారు. తెలంగాణా ఏర్పాటును మొదట్లో వ్యతిరేకించిన ఎంఐఎం రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్‌కు అండగా నిలిచింది. 

దీ ముబారక్‌ను కొనసాగించడం, మైనారిటీ గురుకులాలు ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ముస్లింలకు కేసీఆర్‌పై గురి కుదిరింది. మరోవైపు తెలంగాణాలో కాంగ్రెస్‌ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం తగ్గడం, బీజేపీ బలోపేతం అవుతున్న తరుణంలో కేసీఆర్‌ ముస్లింలకు బలమైన లౌకికవాదిగా కనిపించాడు. 2014లో టీఆర్ఎస్‌కు అనుమానంగానే ఓటు వేసినా... 2018 ఎన్నికలు వచ్చేనాటికి ముస్లింలు కేసీఆర్‌ను పూర్తిగా నమ్మారు. ముస్లింలు కేసీఆర్‌ను నమ్మడంలో ఎంఐఎం అధినేత ఓవైసీ కీలకపాత్ర పోషించారు. 

తెలంగాణాలో బీజేపీ బలోపేతం అవుతున్నందున ముస్లింలు మరింతగా టీఆర్‌ఎస్ వైపు నిలబడే అవకాశాలన్నాయి. రాష్ట్రంలో దాదాపు 13శాతం ఉన్న ముస్లింలు ప్రస్తుతం టీఆర్ఎస్‌కు బలమైన ఓటుబ్యాంకుగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ముస్లింల ఓటు కీలకం కాబోతోందనే విషయం టీఆర్ఎస్ ముందుగానే గ్రహించింది. అందుకే కేసీఆర్ తాను కాంగ్రెస్ పార్టీకన్నా పెద్ద లౌకికవాదిననే విషయాన్ని జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. 

అయితే ముస్లిం ఓటుబ్యాంకు వల్ల టీఆర్‌ఎస్‌కు ఎంత లాభం కలుగుతుందో..అంతే నష్టం కూడా చేస్తుంది. ముఖ్యంగా కేసీఆర్‌ను యాంటీ హిందూగా బీజేపీ ప్రచారం చేయడానికి టీఆర్‌ఎస్-ఎంఐఎం మైత్రి ఒక ఆయుధంగా మారింది. రజాకార్ల పార్టీకి కేసీఆర్ లొంగిపోయారని బీజేపీ చేస్తున్న విమర్శలు... కొంతవరకు కేసీఆర్‌కు డ్యామేజ్ చేశాయి. అయితే తానే పెద్ద హిందువునని... తనను మించిన భక్తులు ఎవరని తనదైన స్టైల్లో కేసీఆర్‌ చేసిన కామెంట్స్‌ కూడా అంతే పాపులర్ అయ్యాయి. కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఉపయోగించే హిందుత్వ అస్త్రాన్ని లౌకికవాదంతోనే ఎదుర్కోవాలనేది టీఆర్ఎస్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్ సెంటిమెంట్‌, సంక్షేమ పథకాలు, యాంటీ హిందూ, సెక్యులర్ సెంటిమెంట్స్ ఎంత మేరకు పనిచేస్తాయో చూడాలి.

మరిన్ని వార్తలు