వాస్తవాలు బయటకు వస్తాయనే అడ్డుకుంటున్నారు: రేవంత్‌రెడ్డి

18 Aug, 2022 02:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రాజెక్టు లు సందర్శిస్తామంటే ప్రభుత్వానికి వణుకెందుకని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వరదల కారణంగా నీట మునిగిన కాళేశ్వరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందన్నారు. సీఎల్పీ నేత భట్టితో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లను ప్రభుత్వం పదే పదే ఎందుకు అడ్డుకుంటోందని బుధవారం ఒక ప్రక టనలో ఆయన నిలదీశారు.

వరదల సమయంలోనే.. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టులకు భారీ నష్టం జరిగిందని తాము చెబితే పట్టించుకోకుండా ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించిందన్నారు. పంప్‌హౌస్‌లు నీటమునిగి వేల కోట్ల రూపాయలు నష్టం వస్తే.. రూ.25 కోట్లే నష్టం వచ్చిందని నీటి పారుదల అధికారులతో చెప్పించారన్నారు. వాస్తవ పరిస్థితిని ప్రజల ముందుకు తెచ్చేందుకు వెళ్తున్న సీఎల్పీ బృందాన్ని నిరంకుశంగా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వాస్తవాలు బయటకు వస్తాయనే సీఎల్పీ బృందం పర్యటనకు ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు. భట్టి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి ప్రభుత్వమే ప్రాజెక్టు లను చూపించాలని, లేదంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని రేవంత్‌ హెచ్చరించారు.
చదవండి: కమ్యూనిస్టులు.. ఎర్ర గులాబీలు

మరిన్ని వార్తలు