CM Nitish Kumar: నితీశ్‌లో ఎందుకీ అసంతృప్తి?

9 Aug, 2022 12:14 IST|Sakshi

ఎంతమాత్రం రుచించని బీజేపీ ఆధిపత్య ధోరణి  

తగినంత స్వేచ్ఛ ఇవ్వడం లేదని అసహనం 

ఇంకా బీజేపీతో అంటకాగితే పదవీ గండం తప్పదని అంచనా

బిహార్‌లో బీజేపీ, జేడీ(యూ) బంధం బీటలుబారుతోంది. రెండు పార్టీల మధ్య తెగతెంపులు తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బిహార్‌ ముఖ్యమంత్రి పీఠంపై తనని కూర్చోబెట్టినప్పటికీ అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఎక్కువ ఉండడంతో కమలదళం తమపై ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తోందని సీఎం నితీశ్‌ కుమార్‌ చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు.

ప్రభుత్వం నడపడానికి ఆయనకి ఎప్పుడూ తగినంత స్వేచ్ఛ ఇవ్వకపోగా, తనకున్న జనాదరణను బీజేపీ బలపడడానికి వినియోగించుకుంటోందని ఆయన అసహనంతో రగిలిపోతున్నారు. 2025 సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే సొంత పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిని చెయ్యాలని భావిస్తూ దానికి అనుగుణంగా కమలదళం వ్యూహాలు రచిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన పదవికి ఎసరు తప్పదన్న అంచనాలు నితీశ్‌లో అసంతృప్తి రాజేస్తున్నాయి.  

స్పీకర్‌తో కయ్యం  
బిహార్‌ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న బీజేపీ నాయకుడు విజయ్‌ కుమార్‌ సిన్హాను ఆ పదవి నుంచి తొలగించాలని చూసి నితీశ్‌ కుమార్‌ భంగపడ్డారు. అప్పట్నుంచి ఇరు పార్టీల నడుమ పోరు మొదలైంది. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత జేడీ(యూ) నుంచి ఆర్‌సీపీ సింగ్‌ ఒక్కరికే మంత్రి పదవి ఇవ్వడం నితీశ్‌కి రుచించలేదు. ఆ పదవి కూడా ఆర్‌సీపీ సింగ్‌కు బీజేపీతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే వచ్చింది.

దీంతో గత ఏడాది జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆర్‌సీపీ సింగ్‌ను మరోసారి పెద్దల సభకు పంపడానికి నితీశ్‌ నిరాకరించడంతో ఆయన కేంద్ర మంత్రి పదవిని వీడాల్సి వచ్చింది. సింగ్‌కున్న ఆస్తులపైన కూడా జేడీ(యూ) వివరణ కోరింది. దీంతో ఆర్‌సీపీ సింగ్‌ పార్టీని వీడుతూ జేడీ(యూ) మునిగిపోతున్న నౌక అని, నితీశ్‌ అసూయతో రగిలిపోతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌విలాస్‌)కి చెందిన చిరాగ్‌ పాశ్వాన్‌ బహిరంగంగానే నితీశ్‌ను దుయ్యబట్టడం వంటివన్నీ రెండు పార్టీల మధ్య దూరాన్ని మరింత పెంచాయి.  

గైర్హాజరు పర్వం..
బీజేపీ నాయకత్వం తీరుపై తన అసంతృప్తిని నితీశ్‌ కుమార్‌ ఎక్కడా దాచుకోవడం లేదు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రధాని మోదీ కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో నితీశ్‌ పాలుపంచుకోలేదు. ఆదివారం మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ భేటీకి గైర్హాజరయ్యారు. జూలై 17న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానికి దూరంగా ఉండిపోయారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వీడ్కోలు పలుకుతూ జూలై 22న ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు సైతం హాజరుకాలేదు. మూడు రోజుల తర్వాత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవంలోనూ పాల్గొనలేదు. చాలారోజులుగా బీజేపీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. కులాల వారీగా జనగణన, జనాభా నియంత్రణ, అగ్నిపథ్‌ పథకం వంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో విభేదించారు.                   
– నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు