Pawan Kalyan: ఆ మీటింగ్‌ తర్వాత పవన్‌లో నీరసమెందుకు?

14 Nov, 2022 17:53 IST|Sakshi

విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీలో ఏమి జరిగిందన్నది అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రశ్న. సాధారణంగా ప్రధానిని కలిసిన తర్వాత ఎవరైనా హుషారుగా కనిపిస్తారు. పవన్ కల్యాణ్ కానీ, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కానీ అలా కనిపించలేదు సరికదా.. ఏదో తద్దినం పెట్టినట్లు పొడి, పొడిగా మీడియా ముందు మాట్లాడడంతో పవన్‌కు ఏదో ఇబ్బంది ఎదురైందన్న భావన కలుగుతుంది. ఎనిమిదేళ్ల తర్వాత మోదీని కొద్దిసేపు పవన్ కలిశారు. అదే గొప్ప విషయంగా తొలుత జనసేన ప్రచారం చేసుకుంది. తీరా భేటీ జరిగాక పవన్ నీరసంగా కనిపించడం ఆ పార్టీ వారికి కూడా తీవ్ర ఆశాభంగం కలిగి ఉండవచ్చు.

ప్రధానితో తన భేటీ గురించి వెల్లడించకపోయినా, పవన్ చేసిన ఒక వ్యాఖ్యతో ఆయనకు మోదీ ఏవో కొన్ని హెచ్చరికలు చేసి ఉండవచ్చనిపిస్తుంది. వైఎస్సార్‌సీపీ నేతలు తనపై ఢిల్లీలో పితూరీలు చెప్పారని ఆయన వాపోయారు. బహుశా మోదీ.. టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ చెట్టపట్టాలేసి తిరుగుతున్న సంగతిపై నిలదీసి ఉండాలి. అలాగే పవన్ నిర్వాకాలపై బీజేపీ వారు ఎవరైనా డిల్లీ పెద్దలకు చెబితే, ఆ మాట అనలేక వైసీపీ పితూరి అని చెబుతున్నట్లుగా ఉంది.

పవన్ కల్యాణ్ అటు బీజేపీని వదలలేక, ఇటు తెలుగుదేశం వైపు ఎలా వెళ్లాలో తెలియక గందరగోళంలో ఉన్నారని చెప్పాలి. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పడాలని పవన్ గట్టిగా కోరుతున్నారు. నిజానికి ఈ ప్రతిపాదన ముందుగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్న సంగతి తెలిసిందే. ఎలాగొలా బీజేపీ చంక ఎక్కాలన్న చంద్రబాబు యత్నాలకు కేంద్రంలోని బీజేపీ అధిష్టానం పెద్దలు గండి కొడుతున్నారు. దానికి కారణం అందరికి తెలిసిందే.

తనను వ్యక్తిగతంగా చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నేతలు కాని దూషించిన సంగతిని మోదీ మర్చిపోలేకపోతున్నారు. అలాగే హోం మంత్రి అమిత్ షా గతంలో పార్టీ అధ్యక్షుడిగా తిరుపతి వచ్చినప్పుడు టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసిన విషయాన్ని విస్మరించడానికి సిద్దపడడం లేదు. అలాగే టీడీపీతో పొత్తుపెట్టుకుంటే అదంతా ఆ పార్టీకి ఉపయోగం తప్ప, బీజేపీకి ఉండడం లేదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

అయితే బీజేపీలోని టీడీపీ కోవర్టులు, పవన్ కళ్యాణ్ వంటివారు మాత్రం ఎలాగొలా టీడీపీకి బీజేపీ మద్దతు ఇచ్చేలా చేయడానికి నానా తంటాలుపడుతున్నారు. బీజేపీ తనకు రోడ్ మాప్ ఇవ్వాలని పవన్ కల్యాణ్‌ బీజేపీని కోరినా, అదేమీ జరగలేదు. అసలు బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉందా? లేదా? అన్న సంశయం కలిగేలా రాజకీయాలు సాగాయి. పవన్ కల్యాణ్ కూడా బీజేపీ కన్నా, టీడీపీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, చంద్రబాబు సూచనల మేరకు నడుచుకోవడం చేస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం తమతోనే జనసేన ఉంటుందని, టీడీపీతో పొత్తు ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు. అయినా పవన్ మాత్రం జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఓటు చీలనివ్వమని అంటున్నారు.

ఈ పరిస్థితిలో ఆయన మోదీని కలిసినప్పుడు ఈ విషయం సహజంగానే చర్చకు వచ్చి ఉండవచ్చు. అయినా టీడీపీతో కలవడానికి మోదీ సుముఖత చూపి ఉండకపోవచ్చు. అందువల్లే పవన్ కల్యాణ్‌ నీరసంగా కళ తప్పిన ముఖంతో తిరుగు ముఖం పట్టారనిపిస్తుంది. ఆ ఫలితంగానే మోదీతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ కేవలం రెండు నిమిషాలపాటే మాట్లాడి వెళ్లి ఉండవచ్చనిపిస్తుంది. దీంతో జనసేన కార్యకర్తలలో కూడా నైరాశ్యం ఏర్పడింది. అయితే రాష్ట్ర భవిష్యత్తుకు ఈ భేటీ ఉపయోగపడుతుందని పవన్ అన్నప్పటికీ, అదెలా సాధ్యమో ఆయన వివరించలేదు. కాగా పవన్ ఇటీవలి జరిగిన పరిణామాలపై తనకు అనుకూలమైన వాదన వినిపించారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. ఉదాహరణకు జనసేన కార్యకర్తలు విశాఖ ఎయిర్ పోర్టు వద్ద మంత్రులపై దాడి చేస్తే, ఆ విషయాన్ని పక్కనబెట్టి, తనను పోలీసులు నియంత్రించారన్న ఆరోపణ ఆయన చేసి ఉండవచ్చు.

ఒక వైపు బీజేపీనేమో జనసేన తమతో పొత్తులో ఉంటుందని చెబుతుంటే, తెలుగుదేశం వారేమో పవన్ కల్యాణ్ తమ వైపు వచ్చేశారని, ఆ పార్టీకి ఎన్ని నియోజకవర్గాలు కేటాయించాలన్న చర్చ కూడా జరుగుతోందని ప్రచారం చేస్తున్నారు. కానీ నేరుగా టీడీపీతో పొత్తు పెట్టుకునే ధైర్యాన్ని పవన్ ఇప్పటికైతే చూపలేకపోతున్నారు. దానికి కారణం ఆయన గత ఎనిమిదేళ్లుగా రాజకీయాలలో పలుమార్లు పిల్లిమొగ్గలు వేయడమే. ప్రత్యేక హోదాపై బీజేపీ పాచిపోయిన లడ్లు ఇచ్చిందని గతంలో ఆయన విమర్శించారు.

తదుపరి బీజేపీ, టీడీపీలకు దూరం అయి వామపక్షాలు, బిఎస్పీలతో పొత్తు కట్టి 2019 ఎన్నికలలో పోటీచేసి దారుణ పరాజయం చవిచూశారు. అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలను బతిమలాడుకుని మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. ఆ విషయాన్ని విస్మరించి, ఇప్పుడు బీజేపీని కాదని, టీడీపీ వైపు వెళితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అన్న భయం ఆయనకు ఉంటుంది. టీడీపీ ట్రాప్‌లో పడ్డ పవన్‌కు  ఇప్పుడు ఏమి చేయాలన్నదానిపై స్పష్టత లేని పరిస్థితి ఏర్పడింది.

సాధారణంగా ఎవరైనా మోదీని కలిస్తే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరతారు. కాని పవన్‌కు ఆ ధైర్యం కూడా లేదని అనుకోవాలి. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై పవన్ గతంలో తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తలేకపోతున్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన కూడా మాట్లాడారు. కాని ఇప్పుడు మోదీని నేరుగా అడిగే పరిస్థితి లేదు. విభజన సమస్యలను, కేంద్రం విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరినట్లు కనిపించదు.

అదేమైనా జరిగి ఉంటే ఘనంగా చెప్పుకుని ఉండేవారు. పవన్, మనోహర్‌లు మీడియా ముందు మాట్లాడి వెళ్లిన కాసేపటికే సోషల్ మీడియాలో వారిని ఎద్దేవా చేస్తూ పలు కామెంట్లు వచ్చాయి. పవన్ మాటల వెనుక విషాద సంగీతాన్ని పెట్టి కామెంట్లు చేశారు.పవన్ కల్యాణ్‌ తీరు చూస్తే, కల చెదిరింది.. కథ మారింది అన్నట్లు గా అనిపిస్తుంది. ఆయన మనసు టీడీపీ వైపు, మనిషి బీజేపీ వైపు ఉంటున్నారు. ఒకవేళ ప్రధాని టీడీపీతో పొత్తుకు నో అని చెబితే పవన్ కల్యాణ్‌ దారి ఎటు? అన్న ప్రశ్న వస్తుంది. గతంలో బతిమలాడుకుని బీజేపీతో జతకట్టిన పవన్ ఇప్పుడు ఆ పార్టీని కాదని వెళ్లే ధైర్యం చేయగలరా? ఎంతసేపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పై ఏడుపుకొట్టు విమర్శలు చేసే పవన్ కల్యాణ్‌ రాజకీయంగా సందిగ్దంలో పడి తన పార్టీ కాడర్‌ను కూడా గందరగోళంలోకి నెడుతున్నారు.
-పొలిటికల్‌ ఎడిటర్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

మరిన్ని వార్తలు