‘అధిష్టానం అంటే లెక్క లేదా?’.. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి కొత్త పోకడలు!

22 Feb, 2024 12:06 IST|Sakshi

ఆశావహులు దరఖాస్తులు సమర్పించాలి. ఆ అప్లికేషన్లను ఎన్నికల కమిటీలు పరిశీలించాలి. కొన్ని పేర్లను ఫైనలైజ్‌ చేయాలి. వాటిని అధిష్టానానికి మరోసారి జల్లెడ పట్టాలి. వడపోసిన జాబితాను అధిష్టానం ఓకే చేయాలి. ఆ తర్వాతే పార్టీ పెద్దలు అభ్యర్థుల పేర్లను స్వయంగా ప్రకటించాలి. ఇది  ఏ ఎన్నికల సమయంలో అయినా.. అభ్యర్థుల ప్రకటనలో కాంగ్రెస్‌ పార్టీ అవలంభించే విధానం. కానీ, తెలంగాణలో ఆ సిస్టమ్‌కు బ్రేక్‌ పడింది!.  

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారా? అధిష్టానాన్ని కూడా లెక్క చేయకుండా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో కొత్త పోకడలకు పోతున్నారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. తాజాగా.. మహబూబ్‌ నగర్‌ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి పేరును  సీఎం హోదాలో రేవంత్‌ రెడ్డి(పీసీసీ చీఫ్‌ కూడా) ప్రకటించడం పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రమేయం లేకుండానే రేవంత్‌ అభ్యర్థుల జాబితాపై ప్రకటన చేయడం ఏంటని? అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రాక మునుపే తెలంగాణ కాంగ్రెస్‌ తరఫున తొలి అభ్యర్థి ప్రకటన వెలువడింది. బుధవారం కొడంగల్‌ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌.. కోస్గి సభలో మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి పేరును ప్రకటించారు. ఒక్క కొడంగల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే 50వేలకు తగ్గకుండా వంశీకి మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారాయన. సాధారణంగా కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీలో చర్చించాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. కానీ.. 

ఇలాగేనా చేసేది?
.. ఓ బహిరంగసభలో అభ్యర్థిని రేవంత్‌ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో అధిష్టానం అంటే లెక్కే లేనట్లు వ్యవహరిస్తున్నారని సీనియర్లు భావిస్తున్నారు. దరఖాస్తుల సమర్పణ.. వాటి పరిశీలన.. కమిటీల చర్చోపచర్చలు.. ఇన్ని జరగాల్సి ఉండగా.. అవేం పట్టన్నట్లు ఒక అభ్యర్థిని ప్రకటించడంతో రేవంత్‌ తీరుపై సీనియర్లు గుర్రుమంటున్నారు.  మొన్నీమధ్యే.. రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనను చివరి రోజు వరకు కాంగ్రెస్‌ నాన్చింది. ఇందులోనూ రేవంత్‌ హస్తం ఉందనే అభిప్రాయానికి ఇప్పుడు సీనియర్లు వచ్చారు. ఎంపీ అభ్యర్థులను కూడా జిల్లా వారీగా రేవంత్‌రెడ్డి ఇలాగే ప్రకటిస్తారా? అంటూ గుసగుసలాడుకుంటుకున్నారు. అయితే.. ఈ విషయంలో రేవంత్‌ తొందర పడలేదని.. హైకమాండ్‌ డైరెక్షన్‌లోనే అంతా నడుస్తోందని ఢిల్లీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

రేవంత్‌ ప్రకటన వెనుక ఆయన!
మహబూబ్‌ నగర్‌ పార్లమెంట్‌ స్థానం కోసం కాంగ్రెస్‌లో సీనియర్లు అర్జీలు పెట్టుకున్నారు. అందులో మన్నె జీవన్‌రెడ్డి, కొత్త కోట సీతాదయాకర్‌ లాంటివాళ్లు ఉన్నారు. అయినా గానీ.. వంశీచంద్‌రెడ్డికి ఎలా సీటు ప్రకటించారనే డౌట్లు లేవనెత్తారు కొందరు. అయితే రేవంత్‌ రెడ్డి ఈ ప్రకటన చేయడం వెనుక.. ఢిల్లీ నుంచి మద్ధతు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన చేయాలని ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్‌కు హైకమాండ్‌ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం.. రాహుల్‌ గాంధీ అనే చర్చా పార్టీలో జరుగుతోంది.

పార్టీలో యువరక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని రాహుల్‌ గాంధీ చాలాకాలంగా చెబుతున్నారు. ఈ  క్రమంలోనే ఎమ్మెల్సీగా బల్మూరీ వెంకట్‌కు, రాజ్యసభకు అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు అవకాశం దక్కినట్లు స్పష్టం అవుతోంది. అలాగే.. కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ నేతగా ఉన్న టైంలో రాహుల్‌తో వంశీకి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. వీటన్నింటికి తోడు.. జోడో యాత్ర సమయంలోనూ రాహుల్‌ వెంటే వంశీ నడిచారు. ఈ పరిణామాలన్నీ వంశీకి అనుకూలించాయనే చెప్పొచ్చు. ఇక అధిష్టానం సూచనలతోనే రాబోయే రోజుల్లోనూ మరికొందరి పేర్లను ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.

whatsapp channel

మరిన్ని వార్తలు