బయటకు పొక్కని ‘రహస్యం’.. ఆ విషయంలో చేతులెత్తేశారా?

2 Sep, 2022 13:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నత్త నడకన సాగడానికి కారణమేంటి ? టీడీపీ సభ్యత్వం అనుకున్న లక్ష్యాన్ని ఎందుకు సాధించలేకపోతోంది? దేశంలోనే పెద్ద ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు సభ్యత్వాన్ని ఎందుకు పూర్తి చేయించలేకపోతున్నారు? లక్ష్యం సాధించని సభ్యత్వం మీద పార్టీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు ఎందుకు స్పందించడంలేదు?
చదవండి: బీజేపీతో పొత్తు కోసం తహతహ.. ఎల్లో మీడియాకు నిద్ర కరువైందా? ఎందుకీ ఫేక్‌ న్యూస్‌

దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక సభ్యత్వం ఉన్నది తమకే అంటూ తెలుగుదేశం నాయకులు బాకాలు ఊదేవారు. ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత కార్యకర్తల బలగం టీడీపీకి ఉందని చంద్రబాబు, లోకేష్ గొప్పలు చెప్పుకున్నారు. టీడీపీకి 70 లక్షల కార్యకర్తల బలం ఉందని అనేవారు. ఈ సారి జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా గతాన్ని మించి ఘనంగా జరగాలని నాయకులను కార్యకర్తలను చంద్రబాబు ఆదేశించారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కరోనా నేపథ్యంలో రెండేళ్లపాటు సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని చేపట్టలేదు. గత ఏప్రిల్ 21వ తేదీన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మహానాడు ముగిసే సమయానికి సభ్యత్వ నమోదులో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని నాయకులకు చంద్రబాబు దిశ నిర్దేశం చేశారు. 70 లక్షల టార్గెట్  మించి సభ్యులను చేర్చుకోవాలని ఆదేశించారు.

కార్యక్రమం చేపట్టి నాలుగు నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో సభ్యత్వం జరగలేదు. ఈ నాలుగు నెలల వ్యవధిలో టీడీపీ సభ్యత్వం 20 లక్షల కూడా దాటలేదు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, అనుబంధ సంఘాల అధ్యక్షులందరూ కలిసి సభ్యత్వ నమోదుపై స్పీడ్ పెంచాలని ప్రతిరోజు జూమ్ సమావేశాల్లో చంద్రబాబు, లోకేష్‌ ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ నాయకులు మాత్రం తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు..

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనుకున్న స్థాయిలో జరగలేదు. లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో కూడా లోకల్‌ కేడర్‌ మాట వినే స్థితిలో లేరు. కుప్పం నియోజకవర్గం అందరికంటే ముందుందని చెబుతున్న చంద్రబాబు ఎంత సభ్యత్వం జరిగింది అనే దాని మీద మాత్రం నోరు విప్పలేదు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో పాటు వారి బంధువులు కూడా టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని ప్రతి సమావేశంలోనూ చంద్రబాబు పిలుపునిస్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడంలేదు.

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ ప్రతి ఐదు లక్షల సభ్యత్వం పూర్తయిన ప్రతిసారి మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడించేవారు. ప్రస్తుత సభ్యత్వ నమోదు గురించి ఇప్పటివరకు చంద్రబాబు గాని లోకేష్ గాని నోరు విప్పలేదు. తెలుగుదేశం పార్టీకి నాయకులు ఇస్తున్న విరాళాలు లెక్కలు చెబుతున్నారే తప్ప పార్టీ సభ్యత్వ వివరాల మాత్రం బయటకు పొక్కనివ్వడం లేదు. కార్యకర్తల నుంచి స్పందన లేకపోవడంతో దాన్ని కవర్ చేసుకునేందుకు చంద్రబాబు లోకేష్ నానా తంటాలు పడుతున్నారు. సభ్యత్వ నమోదుకు సంబంధించిన యాప్ సహకరించడం లేదంటూ ఎల్లో మీడియాలో లీక్‌లు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు అనుకున్న స్థాయిలో జరగకపోవడానికి మరొక కారణం ఉందనే చర్చ టీడీపీలో అంతర్గతంగా నడుస్తోంది.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కులాలు, మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తున్నారని, ఈ పథకాలు వైఎస్సార్ సీపీని అభిమానించేవారితో పాటుగా.. అదే స్థాయిలో టీడీపీ అభిమానులకు కూడా అందుతున్నాయి అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందున ఇక తమకు పార్టీలు ఎందుకని తెలుగుదేశం కార్యకర్తలు సభ్యత్వ నమోదుపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు