చంద్రబాబు, పవన్ ఎత్తులను కాపులే చిత్తు చేస్తారా..?

19 Jan, 2023 19:03 IST|Sakshi

సంక్రాంతి తరువాత తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గినా రాజకీయ వేడి మాత్రం తగ్గలేదు. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పవన్ కల్యాణ్ ముఖాన్ని ముందు పెట్టి కాపుల ఓట్లు కొల్లగొట్టాలి అనేది బాబు ఎత్తుగడ. కానీ, కాపులు ప్రజారాజ్యం తరువాత రాజకీయంగా చేతులు కాల్చుకున్నారు. చిరంజీవిని నమ్మి దివాళ తీసిన కాపులు చాలా మంది ఉన్నారు. పవన్‌ కల్యాణ్ జనసేన పెట్టినా ఆయన వెనుక నడవడానికి మెజార్టీ కాపులు ఇష్టపడటం లేదు.

ప్రజారాజ్యం అనుభవాలు, జనసేన వెనుక చంద్రబాబు, రామోజీలు ఉన్నారనే ప్రచారంతో కాపులు చాలా మంది పవన్‌ కల్యాణ్‌కు దూరంగా ఉంటున్నారు. జనసేన వెనుక చంద్రబాబు, రామోజీ ఉన్నారనేది ప్రచారం కాదు, వాస్తవమే అనే విధంగా పవన్ మాటలు, చేష్టలు ఉంటున్నాయి. 2014లో చంద్రబాబును గెలిపించడానికే జనసేన ఉద్దేశపూర్వకంగా పోటీ చేయలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి చంద్రబాబు వ్యూహంలో భాగంగానే పవన్ విడిగా పోటీ చేశారని రాజకీయ వర్గాల్లో బలమైన టాక్‌ ఉంది. 

ఇక.. 2024 ఎన్నికల కోసం చంద్రబాబు, పవన్ ఏడాది క్రితం నుంచే సిద్ధమవుతున్నారు. 2024 ఎన్నికలకు మొదటి మెట్టుగా ఇప్పటం సభ నిర్వహించారు. ఈ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం ఆధ్యంతం చంద్రబాబుకు రాజకీయంగా మేలు చేసే విధంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఇప్పటం సభలోనే పవన్‌ శపథం చేశారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి విడిగా పోటీ చేసిన పవన్, 2024 నాటికి తన ఆలోచనలు మార్చుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని జబ్బలు చరుస్తున్నాడు. ఇదంతా ఎవరి కోసం..? ఇక్కడే కాపులు పవన్‌ కల్యాణ్ మీద అనుమానం పెంచుకుంటున్నారు. 

2014-19 మధ్య చంద్రబాబు పాలనను, మూడున్నరేళ్ల  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను ప్రజలు బేరీజు వేసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటికీ సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రజల్లో 60శాతం కంటే ఎక్కువ మద్దతు ఉంది. పవన్‌ను అడ్డుపెట్టుకుని కాపుల ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్న చంద్రబాబుకు పరిస్థితులు ఆశాజనకంగాలేవు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన కాపులు సీఎం జగన్ చిత్తశుద్ది, రాష్ట్ర అభివృద్ది కోసం ఆయన పడుతున్న తాపత్రయం గురించి ఆలోచిస్తున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన విద్యా, వైద్య సంస్కరణలు చూస్తున్నారు. 

30 ఏళ్లు పైబడి నిజాయితీగా ఆలోచించే కాపులు జగన్‌కే జై కొడుతున్నారు. ఇక.. 50 ఏళ్ల పైబడిన కాపులు 90 శాతానికిపైగా వైఎస్‌ జగన్‌పై బలమైన నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికీ బలమైన కాపు ఓటు బ్యాంక్‌ సీఎం వైఎస్ జగన్‌తోనే ఉంది. పవన్‌ కల్యాణ్ చెప్పులు చూపించడం, నోటికొచ్చినట్లు మాట్లాడటం, విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి, విజయవాడ నోవాటెల్‌లో చంద్రబాబుతో పవన్‌ భేటీ, హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లడాన్ని మెజార్టీ కాపులు సమర్థించడం లేదు.  

2024కు చంద్రబాబు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాడు. ఆ శస్త్రాల్లో మొదటి ఆయుధం పవన్ కల్యాణ్‌. లోకేష్ కంటే కూడా చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌నే ఎక్కువ నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ఒక పక్క లోకేష్‌ గ్రాఫ్ పడిపోకుండా ఉండటానికి జనవరి 27 నుంచి పాదయాత్రకు ప్లాన్‌ చేశారు. మరో పక్క కాపుల ఓట్ల కోసం వారాహితో పవన్‌ను రోడ్డెక్కిస్తున్నారు. ఇంకోపక్క ఎల్లో మీడియాతో నిత్యం అబద్ధాలు చెప్పిస్తున్నారు, రాయిస్తున్నారు. మరో పక్క వందల కోట్లు గుమ్మరించి సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలకు తెగిస్తున్నారు. 

ఇంత చేస్తున్నా.. కాపులు, బడుగు, బలహీన వర్గాలు సీఎం వైఎస్ జగన్‌ వైపే ఉన్నారనేది చంద్రబాబు  పచ్చమీడియా ఆందోళన. అందుకే.. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై, అభివృద్దిపై చర్చ జరగకుండా ఉండేందుకు హింసను రెచ్చగొడుతున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎల్లో మీడియా చేసే ఫేక్ ప్రచారాలు అడ్డుకోవాలంటే.. వైఎస్సార్‌సీపీ వాయిస్‌ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి, సంక్షేమంపై విస్తృత ప్రచారం కల్పించాలి. సచివాలయాల దగ్గర నుంచి సినిమా థియేటర్ల వరకూ ఈ ప్రచారం హోరెత్తాలి.

రాజకీయంగా అస్త్రాలను సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు, అమలు చేస్తున్నారు. 
1. సంక్షేమ అస్త్రం 
2. రాజకీయ సమానత్వ అస్త్రం 
3. ఆర్ధిక సమానత్వ అస్త్రం.  

మూడు అస్త్రాలకు మార్గదర్శి భారత రాజ్యాంగం, మహాత్మ గాంధీ ఆలోచనలే. బాబు,  పవన్‌లు సీఎం వైఎస్ జగన్ మీద దాడి చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ, వారు దాడి చేస్తున్నది భారత రాజ్యాంగంపై, గాంధీ, అంబేద్కర్ ఆలోచన విధానాలపై అని తెలుసుకోలేకపోతున్నారు. 75 ఏళ్లుగా స్వాతంత్య్ర భారత చరిత్రలో కాగితాలకే పరిమితమైన సిద్దాంతాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్నాయి. సీఎం జగన్ తన పాలనకు మానవత్వం జోడించి ముందుకెళ్తున్నారు. చదువే తలరాతను మారుస్తుందని, ఆంధ్రప్రదేశ్‌ పౌరులు గ్లోబల్ సిటిజన్స్‌గా ఎదగాలనేది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష. మాటలు చెప్పడమే కాదు.. అందుకు తగ్గ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఒక్క విద్యారంగం మీదనే మూడున్నరేళ్లలో రూ.55వేల కోట్లు ఖర్చు చేశారు. వైద్య రంగంలో దాదాపు 50 వేల ఉద్యోగాలిచ్చారు. చంద్రబాబు విద్య, వైద్య రంగాల ఊపిరి తీయడానికి ప్రయత్నిస్తే.. సీఎం జగన్ మాత్రం విద్య, వైద్య రంగాలే తమ ప్రభుత్వానికి పీఠిక అన్నట్లు పాలన చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంక్షేమాభివృద్దిని కాపు సోదర, సోదరీమణులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. పవన్ ఆరాటమంతా చంద్రబాబును సీఎం చేయడం కోసమేనని వీరంతా ఓ అంచనాకు వచ్చారు. పవన్‌ అరుపులు, ఆర్తనాదాలు ప్యాకేజీ నుంచి వచ్చినవేనని మెజార్టీ నమ్ముతున్నారు. ఒక్క సీటు లేని ఆయన, 68 నియోజకవర్గాల్లో ఇంచార్జిలే లేని బాబు ఇద్దరూ కలిసి జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోగలరా? అనే ప్రశ్న వేసుకుంటే.. వచ్చే సమాధానం అడ్డుకోలేరనే. ఈ విషయం.. చంద్రబాబు,  పవన్‌లకు కూడా బాగా తెలుసు.
- వెంకటేశ్వర్ పెద్దిరెడ్డి, రాజకీయ, సామాజిక విశ్లేషకులు.

మరిన్ని వార్తలు