వీడియో: కొందరి వల్లే వెనక్కి.. సవరణలతో మళ్లీ వస్తాం: కేంద్ర వ్యవసాయ మంత్రి

25 Dec, 2021 14:57 IST|Sakshi

దాదాపు ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమం, రెండు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన తెలిసిందే. అయితే ఈ నిర్ణయం ప్రకటించిన కొద్దిరోజులకే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


నాగ్‌పూర్‌(మహారాష్ట్ర)లో శుక్రవారం అగ్రో విజన్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌.. సాగు చట్టాల్ని మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నస్తున్నట్లు తెలిపారు. కొన్ని మార్పులతో వ్యవసాయ చట్టాల్ని మళ్లీ తీసుకొస్తాం అని వ్యాఖ్యానించారాయన.  కొందరి వల్లే చర్చకు కూడా నోచుకోకుండా చట్టాలు వివాదాస్పదం అయ్యాయి. కేంద్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.   అందుకే కొన్ని మార్పులు చేసి మళ్లీ వ్యవసాయ చట్టాలు తీసుకొస్తాం.  ఒక అడుగు వెనక్కి వేశామంటే.. మూడు అడుగులు ముందుకు వేస్తాం. వ్యవసాయ చట్టాల్ని మళ్లీ తెచ్చి తీరుతాం అని ఉద్ఘాటించారాయన.    

రైతులు దేశానికి వెన్నెముక. అలాంటి రైతుల కోసం ప్రధాని మోదీ ఎంతో చేశారు.  70 ఏళ్లలో దేశానికి ఎవరూ చేయలేనంత చేసి చూపించారు అని ప్రధాని మోదీపై ప్రశంసలు గుప్పించారు తోమర్‌. ఇదిలా ఉంటే స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్‌ జయంతి సందర్భంగా.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇక విరమించాలని, ఇళ్లకు తిరిగి వెళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు ప్రధాని. సాగు చట్టాల ఉపసంహరణకు కేబినెట్‌ ఆమోదం తెలపగా.. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదం, వెనువెంటనే సాగు చట్టాల రద్దు బిల్లుపై రాష్ట్రపతి ముద్ర పడింది.


చదవండి: రైతు ధర్మాగ్రహ విజయం

>
మరిన్ని వార్తలు