పొలిటికల్‌ ట్రాప్‌లో షర్మిల.. అవేవీ గుర్తులేవా?

18 Jan, 2024 16:58 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకంతో కాంగ్రెస్ పార్టీకి దశ తిరుగుతుందా? కేవలం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న ద్వేషంతో షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ ఈ పదవికి ఎంపిక చేసుకుందా? ఈ మొత్తం వ్యవహారం కుట్రపూరితంగా ఉందా? ఈ కుట్రలో ఎవరెవరి భాగస్వామ్యం ఉండవచ్చు? ఈ అంశాలపై ఏపీ రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లో కొంతమంది కాకలుతీరిన నేతలు లేకపోలేదు. కానీ, అట్టడుకు పడిపోయిన కాంగ్రెస్‌ను లేపడం ఎవరివల్ల సాధ్యం కాదని అర్ధం చేసుకున్న వారు తెలివిగా ఎవరికివారు పార్టీ కాడిని కింద పారేశారు.

కానీ.. ఎవరో ఒక బకరా కావాలి కదా అని వెతికి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుకు నమ్మకస్తుడుగా ఉండే ఒక చోట నేత గిడుగు రుద్రరాజును పీసీసీ అధ్యక్షుడిని చేశారు. బహుశా గిడుగు నియామకం నాటికే షర్మిలను ఏపీకి తీసుకురావాలన్న కుట్ర సాగి ఉండాలి. కాకపోతే అప్పటికే ఆమె తెలంగాణలో రాజకీయం చేస్తానంటూ తిరుగుతుండడంతో వెయిట్ చేశారని అనుకోవాలి. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పట్లోనే షర్మిల ఏపీ రాజకీయాలకు వెళ్లాలని అంటూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ మీదట ఆమె రేవంత్‌పై మండిపడ్డారు కూడా.


తదుపరి పరిణామాలలో ఆమె చివరికి తెలంగాణలో పోటీచేయలేని నిస్సహాయ పరిస్థితికి చేరుకున్నారు. ఈ లోగా ఆమె తన భర్తతో పాటు తెలుగుదేశం ఏజెంట్ గా భావించే ఒక మీడియా యజమాని వేసిన రాజకీయ ట్రాప్‌లో పడ్డారు. వారు క్రమేపి మైండ్ గేమ్ ఆడి కాంగ్రెస్‌లో చేర్పించి, మెల్లగా ఏపీకి రప్పించినట్లు అనిపిస్తుంది. ఒకప్పుడు షర్మిలపైన, ఆమె భర్త అనిల్ పైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి విమర్శలు చేశారో గుర్తు చేసుకోండి. ఈనాడు రామోజీరావు , ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు ఎంత నీచమైన వార్తలు రాశారో జ్ఞప్తికి తెచ్చుకోండి.

తెలంగాణలోని బయ్యారం ప్రాంతంలోని ఐరన్ గనులను అనిల్ దోచుకుంటున్నాడని ప్రచారం చేసేవారు. ఆయన మత బోధనలను ఎద్దేవా చేస్తూ పలు కథనాలు ఇచ్చేవారు. కానీ, షర్మిల రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి ఈ మీడియావారు ఆమెపై అభిమానం కురిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అయితే చాలా సానుభూతి వర్షం కురిపిస్తున్నట్లు మాట్లాడుతూ జగన్‌పై విమర్శలు చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ నేత, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో షర్మిల పలుమార్లు మంతనాలు జరిపారు. తెలంగాణ రాజకీయాలలో ఉంటానని, ఏపీకి వెళ్లనని, అన్న సీఎం జగన్‌పై విమర్శలు చేయనని ఆయా సందర్భాలలో చెప్పినప్పటికీ, ఈ కుట్రదారులంతా కలిసి ఆమె మనసు మార్చినట్లు అనిపిస్తుంది.

ఈ క్రమంలో ఆమె అమాయకత్వాన్ని వీరు తమ రాజకీయ అవసరాలకు వాడుకున్నట్లు అనిపిస్తుంది. భర్త అనిల్ ఈ మంత్రాంగంలో ప్రధాన పావుగా మారారని అంటారు. సీఎం జగన్‌తో ఏ కారణంతో విభేదాలు ఏర్పడినప్పటికీ, ఏపీ రాజకీయాలలో ప్రవేశించడం మాత్రం ఆమెకు అంతగా శోభనివ్వదు. ఆమె కుట్రదారులతో కుమ్మక్కయ్యారన్న భావన ప్రజలలో ఏర్పడుతుంది. ఒక వ్యక్తిగా రాజకీయా‍ల్లోకి రాకూడదా అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాలలోకి రావచ్చు. తప్పు లేదు. కానీ, ఒక విధానం, ఒక ఎజెండా లేకుండా రాజకీయాలు చేస్తే తెలంగాణలో విఫలం అయినట్లే అవుతుంది. అందులోనూ తన అన్నపై అసంతృప్తితో ప్రత్యర్ధులైన కాంగ్రెస్ , తెలుగుదేశంలతో ఆమె కలవడం రాజకీయంగా అంత తెలివైన నిర్ణయం కాకపోవచ్చు. మరో మూడునెలల్లో ఎన్నికలు జరగబోతున్నందున ఈ కీలక సమయంలో సీఎం జగన్ రాజకీయ అవకాశాలను దెబ్బకొట్టాలన్నది ప్రత్యర్ధి పార్టీల వ్యూహం.

అందులో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసే కుట్రపన్నుతాయన్నది బహిరంగ రహస్యం. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ తెలుగుదేశం పార్టీని కానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కానీ ఒక్క మాట అనడం లేదు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. కానీ, అదే సమయంలో చంద్రబాబు జోలికి వెళ్లడం లేదంటే కారణం ఊహించుకోవచ్చు. చంద్రబాబు, డీకే శివకుమార్‌ల మంతనాల ఆంతర్యం అర్ధం చేసుకోవచ్చు. గతంలో సోనియాగాందీని తీవ్రంగా దూషించిన చంద్రబాబు, ప్రస్తుతం కాంగ్రెస్ నేతలను ఒక్క మాట అనడం లేదు. సరే! ఒకప్పుడు బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని తిట్టిన తెలుగుదేశం పెద్దలు, వారిని కూడా ఏమనడం లేదు. పైగా వారి ప్రాపకం కోసం పాట్లు పడుతున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు ప్రకటించి, అక్కడకాకుండా సంసారం మాత్రం తెలుగుదేశంతో చేస్తూ విచిత్రమైన రాజకీయం నడుపుతున్నారు. బీజేపీ నేతలు పురందేశ్వరి, ఇతరులు కూడా పవన్‌ను తప్పుపట్టడం లేదు. పవన్ కానీ, ఏపీ బీజేపీ నేతలు కానీ కాంగ్రెస్ విధానాలపై విమర్శలు చేయడం లేదు. ఇక వామపక్షాలు సరేసరి. ప్రత్యేకించి సీపీఐ నారాయణ, రామకృష్ణలు అయితే చంద్రబాబు సొంత మనుషులుగా మారారన్న అభిప్రాయం ఉంది. ఏతావాతా చూస్తే సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఈ పార్టీలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒక్కటైనట్లు అనిపిస్తుంది. జగన్ మాత్రం ఎప్పటిమాదిరే ఒంటరిపోరుకు సిద్దం అవుతున్నారు. తన పని తాను చేసుకుపోతున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ రుద్రరాజును తప్పించి షర్మిలను రంగంలోకి తీసుకు వచ్చారు. తద్వారా ఒక విషయాన్ని తెలియచేసినట్లయింది. కాంగ్రెస్‌ను తామే నడుపుతున్నామని చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు కానీ, ఇతరత్రా కేంద్ర మంత్రులు చేసిన పల్లంరాజు, చింతా మోహన్ తదితరులు ఎవరూ ఏపీ కాంగ్రెస్ను నడపలేరని, వారిలో అంత సమర్ధత లేదన్న అభిప్రాయానికి వచ్చారని అనుకోవాలి. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం నుంచి అయితేనే జనంలో కొంత ఆదరణ వస్తుందని భావించాలి.

దీనికన్నా ఏపీలో కాంగ్రెస్ క్షీణించి పోవడానికి సీఎం జగనే కారణమన్న కోపంతో ఆమెను రంగంలో దించారని అనుకోవచ్చు. నిజానికి కాంగ్రెస్ ఇలా తయారు కావడానికి స్వయంకృతాపరాధమని చెప్పాలి. రాష్ట్ర విభజనను సజావుగా చేయలేకపోవడం, ఆంధ్రులకు అన్యాయం చేసిందన్న అభిప్రాయం ప్రజలలో ఉండడం వల్ల కాంగ్రెస్ జీరో స్థాయికి పడిపోయింది. ఈ నేపధ్యంలో షర్మిల వచ్చి కాంగ్రెస్‌ను ఉద్దరించగలుగుతారా అంటే అది ప్రస్తుతానికి భ్రమే అనుకోవాలి. ఆమె తెలంగాణ రాజకీయాలలో ఏమైనా రాణించి ఉంటే అప్పుడు కాంగ్రెస్లో చేరి ఏపీ రాజకీయాలలోకి వచ్చి ఉంటే కొంత ప్రభావం ఉండేది.

అలాంటిది ఆమె స్వయంగా బతిమిలాడి కాంగ్రెస్‌లో చేరే పరిస్థితి రావడం ఆమెకు అప్రతిష్టే అని చెప్పాలి. ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ పై ఆమె కొరడా ఝళిపించేది. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చార్జిషీట్లో చేర్చడాన్ని తీవ్రంగా ఆక్షేపించేవారు. ఒక సందర్భంలో అయితే కాంగ్రెస్‌పై ఉమ్ము వేయాలని కూడా అన్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అయినా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పన్నిన వ్యూహంలో ఆమె చిక్కుకుపోయి ఏపీ రాజకీయాలలోకి ప్రవేశించారు. ఒకరకంగా చూస్తే కేంద్రంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేసి కాకలు తీరిన నేతలు పలువురు ఉన్నప్పటికీ, వారెవ్వరికి కాకుండా షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించడం ఆమెకు సంతోషం కలిగించవచ్చు.

అది కేవలం తాత్కాలికమే అన్న సంగతి అర్ధం కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఆమె ద్వారా పార్టీ కోసం డబ్బు ఖర్చు చేయించి తదుపరి ఆమెకు మొండి చేయి చూపినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఈలోగానే ఆమె ఏదైనా రాజ్యసభ సంపాదించుకోగలిగితేనే ప్రయోజనం ఉంటుంది. ఇక ఏపీ రాజకీయాలలో ఆమె ఎలాంటి విధానం అనుసరించాలన్నదానిపై కూడా ఆలోచించుకోవాలి. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో​ పాటు, ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలను కూడా విమర్శిస్తే కొంత విలువ ఉంటుంది. అలాకాకుండా కేవలం వైసీపీపైనే విమర్శలు సాగిస్తే మాత్రం జనానికి మొత్తం కుట్ర వ్యూహం అంతా అర్ధం అయిపోతుంది.

తన అన్న, ముఖ్యమంత్రి అయిన జగన్‌పై ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేసినా ఆమెకే నష్టం కలగవచ్చు. కేవలం ఆ పాయింట్లో ఉపయోగపడతారన్న లక్ష్యంతో కాంగ్రెస్, టీడీపీ పెద్దలు ఆమెను ఏపీ రాజకీయాలకు తీసుకు వచ్చారు. ఇంతా చేసినా సీఎం జగన్ అధికారంలోకి తిరిగి వస్తే అప్పుడు ఇదే పెద్దలు ఆమె రాజకీయాన్ని చులకన చేసి చేతులు దులుపుకుంటారని చెప్పాలి. తన కుటుంబ వ్యవహారాలను, తన రాజకీయ వ్యవహారాలను వేరు చేసుకుని పీసీసీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తే విలువ ఉంటుంది. అందుకు భిన్నంగా సీఎం జగన్నే వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటే మాత్రం ఆమెకే నష్టం అని చెప్పకతప్పదు.

-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ పాత్రికేయులు

whatsapp channel

మరిన్ని వార్తలు