30-40 ఏళ్లు బీజేపీదే అధికారం: అమిత్‌ షా

4 Jul, 2022 01:50 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న హిమంత బిశ్వశర్మ  

కుటుంబ, కుల, మత రాజకీయాలను నిరోధించాలి.. భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దాలి 

బీజేపీ జాతీయ కార్యవర్గభేటీలో అమిత్‌ షా ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానానికి ఆమోదం  

వివరాలు వెల్లడించిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ   

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కుటుంబ రాజకీయాలు, జాతి, కుల, మత ప్రాంతీయవాదాలను నిరోధించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. వచ్చే 30–40 ఏళ్లపాటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్‌ను విశ్వగురుగా తీర్చిదిద్దడం తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా రెండోరోజు అమిత్‌ షా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టగా, కార్యవర్గం చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఆ వివరాలను హిమంత బిశ్వ శర్మ మీడియాకు వివరించారు. ‘‘దేశంలో కుటుంబపాలన, రాష్ట్రాలలో జరుగుతున్న అరాచకాలపై కూడా చర్చ జరిగింది. త్వరలో తెలంగాణలో కూడా కుటుంబపాలన అంతమవుతుందని అమిత్‌ షా తన తీర్మానంలో ప్రస్తావించారు. పనితీరు ఆధారిత పాలన, అభివృద్ధితో కూడిన పాలనపైనే బీజేపీ తన రాజకీయ తీర్మానంలో చర్చించింది’’అని పేర్కొన్నారు.

రాజకీయ తీర్మానంపై చర్చలో ప్రధాని మోదీ సైతం పాల్గొని పలు మార్పులు, చేర్పులు సూచించారని తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము జీవితంపై ఓ దృశ్యచిత్రాన్ని కూడా తయారు చేయాలని సూచించారని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఒకసారి దళిత నేతను, రెండోసారి ఆదివాసీ మహిళకు అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు.

‘సబ్‌ కే సాత్‌ సబ్‌ కా వికాస్‌’అన్నదే తమ పార్టీ నినాదమని, అందుకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని అస్సాం సీఎం వివరించారు. దేశంలో ప్రతిపక్షాలను ప్రజలు విశ్వసించడం మానేశారని, ఇప్పటికే వారిని మూలన కూర్చోబెట్టిన విషయాన్ని అమిత్‌ షా పేర్కొన్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి మోదీ ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. పనితీరు ఆధారిత పాలన, అభివృద్ధితో కూడిన పాలనపై మాట్లాడినట్లు బిశ్వశర్మ తెలిపారు. 

అన్ని రాష్ట్రాలకు బీజేపీని విస్తరిస్తాం: హిమంత 
హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో రాజకీయ కోణం ఉందని వస్తున్న విమర్శలను హిమంత తిప్పికొట్టారు. పార్టీలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని కాంగ్రెస్‌ సభ్యులు పోరాడుతున్నారని, పార్టీ అధ్యక్షుడిని కూడా ఎన్నుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గుజరాత్‌ అల్లర్లపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని అభివర్ణించారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు బీజేపీ విస్తరిస్తుందని అన్నారు.

తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాగా వేయనుందని, ఆ అవకాశాలపై చర్చించామని తెలిపారు. దేశం ఇన్నాళ్లు వెనుకబడటానికి గల కారణాలను అమిత్‌షా రాజకీయ తీర్మానం సందర్భంగా వివరించినట్లు బిశ్వశర్మ తెలిపారు.

మరిన్ని వార్తలు