ఈసారి బీజేపీ నుంచి పోటీ తప్పదా?

8 Aug, 2022 16:17 IST|Sakshi

కుమ్రం భీమ్ జిల్లా కేంద్రమైన సిర్పూర్‌ పట్టణం రాత మారుస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నియోజకవర్గం రాత మార్చలేకపోయిన ఎమ్మెల్యే తన మాటనే మార్చుకున్నారు. సీనియర్ నాయకుడు కోనేరు కోనప్ప 2014లో బీఎస్‌పీ నుంచి గెలిచి తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో కారు పార్టీ గుర్తు మీదే విజయం సాధించారు. అంబలి, అన్నదానం, నిరుపేద విద్యార్థులకు విద్యాదానంతో కోనప్ప రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. కాని నియోజకవర్గాన్ని చెప్పినంత స్థాయిలో అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎంతోకాలంగా మూతపడ్డ నిజామ్ నాటి   పేపర్ ‌మిల్లును పట్టుబట్టి ప్రైవేటు యాజమాన్యం ద్వారా ప్రారంభింపచేశారు. దీనికి కేసీఆర్‌ సర్కార్ రాయితీలు కూడా ఇచ్చింది.

పేపర్‌ పరిశ్రమ మూతపడేనాటికి ఉన్న ఉద్యోగులందరికీ మళ్లీ ‌ఉద్యోగాలు కల్పిస్తామని  హమీ ఇచ్చారు. కాని పరిశ్రమ ప్రారంభం‌ తర్వాత పాతవారికి పర్మినెంట్ ఉద్యోగాలు దక్కలేదు. మొత్తం ఉద్యోగాలన్ని ఉత్తరాది వారితో నింపేశారని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. స్థానిక రెగ్యూలర్ ఉద్యోగులకే ఉద్యోగాలు ఇవ్వకపోయినా..ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా ‌ మారిందంటున్నారు. పేపర్‌ మిల్లు పునరుద్దరించింది.. ఎవరి కోసం అంటూ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే కోనప్పపై మండిపడుతున్నారు.

నియోజకవర్గం లో సాగునీటి ప్రాజెక్టుల పనులు సాగడం లేదు.‌ జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు, కుమ్రం బీమ్ ప్రాజెక్టు కాల్వలు పూర్తికాలేదు. పీపీరావు ప్రాజెక్టు పనులు ఏళ్ళతరబడి సాగుతు‌‌న్నాయి. ప్రాణహిత-చేవేళ్ల పై సర్కారు చేతులు ఎత్తేసింది‌.‌ వార్థా బ్యారేజీ చేపడుతామని ప్రకటించినా అది కాగితాలకే పరిమితమైంది‌. పోడు భూముల సమస్య తీర్చితామని అనేకసార్లు హమీ ఇచ్చారు కోనప్ప. అయితే ‌హక్కు పత్రాలు పంపిణీ చేయడంలో సర్కారు కాలయాపన చేస్తోంది. దీంతో పోడు రైతులు సర్కార్ పై ఉద్యమిస్తున్నారు.

అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా‌..‌సేవా కార్యక్రమాలతో ఎన్నికలలో గట్టేక్కిస్తామని భావిస్తున్నారు కారు పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఇదిలాఉంటే..బీజేపీ నాయకుడు పాల్వాయి హరీష్ బాబు పోడు భూములపై పోరాటం సాగిస్తూ..ప్రజల్లో బలపడుతుండటం కోనప్పకు ఆందోళన కలిగిస్తోందట. గత ఎన్నికలలో ఓడినా సానుభూతి తోడువుతుందని..అదేవిధంగా  హిందూత్వ  ఓటు బ్యాంకు తోడైతే కోనప్పను ఓడించడం ఖాయమని భావిస్తున్నారట బీజేపీ నేత పాల్వాయి హరీష్ బాబు. మరోవైపు రావి శ్రీనివాస్ బిజెపి నుండి కాంగ్రెస్ లో చేరారు. ఆయనే కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని తెలుస్తోంది. తెలంగాణలో అత్యంత వెనుకబడిన ‌నియోజకవర్గం అసిఫాబాద్. ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో ఇక్కడ అదివాసీల ప్రాబల్యం అత్యధికంగా ఉంటుంది. అసిఫాబాద్‌ నుంచి గత ఎన్నికలలో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన అత్రం సక్కు విజయం‌ సాధించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామలతో‌ అత్రం సక్కు కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి కారు పార్టీలో చేరిపోయారు. ఈసారి గులాబీ పార్టీ నుండి పోటీచేయడానికి సిద్దమవుతున్నారు. 

మరిన్ని వార్తలు