మునుగోడు ఉప ఎన్నిక.. మరో జిల్లాపై ప్రభావం చూపనుందా?

6 Sep, 2022 19:06 IST|Sakshi

ఒక జిల్లాలో ఉప ఎన్నిక జరుగుతుంటే.. మరో జిల్లాలో ప్రభావం ఉంటుందా? ఇప్పుడలాంటి పరిస్థితే ఉందంటున్నారు టీఆర్ఎస్ వర్గాలు. బీజేపీని ఓడించే లక్ష్యంతో మునుగోడులో టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చింది సీపీఐ. ఆ మేరకు మునుగోడు సభకు సీపీఐ నేతలు హాజరయ్యారు. దీంతో ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా శాసనసభ్యులకు, వచ్చే ఎన్నికల్లో అక్కడ సీట్లు ఆశిస్తున్న నేతలకు బెంగ మొదలైంది. ఇవే సమీకరణాలు వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడ ఉంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో వామపక్షాలకు పట్టుంది. ఇక్కడ గెలుపోటములు నిర్ణయించగల స్థాయిలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు బలం ఉంది. వారికి సొంతంగా గెలిచే శక్తి లేకపోయినా...ఎవరినో ఒకరిని ఓడించడానికి సహాయపడగలరు.

మునుగోడులో పొత్తు విజయవంతమైతే...వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సీపీఐ, టిఆర్ఎస్ మధ్య పొత్తు పొడిస్తే ఖమ్మం జిల్లాలోని  కొత్తగూడెం, వైరా సీట్లను సీపీఐ అడిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్తగూడెం సీటు పొత్తుల్లో భాగంగా సీపీఐకి వెళ్లుతుందన్న ప్రచారం కొంతకాలంగా జిల్లాలో సాగుతోంది. దీంతో కొత్తగూడెం, వైరా టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లోనే కాకుండా ఆశావహుల్లో సైతం గుబులు మొదలైంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ తనకే వస్తుందన్న దీమాతో ఉంటున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సైతం వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం టికెట్ తనకే వస్తుందని తన అనుచరులతో చెప్పుకుంటున్నారు. దీంతో ఇద్దరిలో టికెట్ ఎవరికి వస్తుందా అన్న చర్చ టీఆర్ఎస్ శ్రేణుల్లో నడుస్తోంది. అటు వైరా నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ టికెట్ పై ఆశలు పెట్టుకోగా..మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్, బానోత్ చంద్రావతి కూడ టికెట్ కోసం ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు...

రెండు నియోజకవర్గాల్లో సిటింగులు, ఆశావహులు మునుగోడు దెబ్బకు కుదేలవుతున్నారు. సీపీఐ కారణంగా తమకు నష్టం జరిగే అవకాశం కనిపిస్తోందని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో గనుక నిజంగా సీపీఐతో పొత్తు కుదిరితే తమ పరిస్థితేంగాను అంటూ కంగారు పడుతున్నారు. ఇప్పటికైతే సీపీఐ మాత్రమే గులాబీ పార్టీతో టచ్‌లో ఉంది. సీపీఎం కూడా ఇదే దారిలోకి వస్తే మరికొన్ని సీట్లకు కూడా ప్రమాదం ముంచుకొస్తుందనే ఆందోళన టీఆర్ఎస్ శ్రేణుల్లో, నాయకుల్లో కనిపిస్తోంది.

వచ్చే ఎన్నికలనాటికి టీఆర్ఎస్‌తో వామపక్షాల పొత్తుల అంశం ఎటువంటి ప్రభావం చూపిస్తుందన్న టెన్షన్ మాత్రం ఆ రెండు నియోజకవర్గాల గులాబీ నేతల్లో కనిపిస్తోంది. చివరి నిమిషంలో పొత్తుల అంశం టిఆర్ఎస్‌లో ఎటువంటి అసంతృప్తి రాజేస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు