CAA అమలు చేయం. అంతే!: తేల్చిచెప్పిన కేరళ సీఎం విజయన్‌

3 Jun, 2022 09:36 IST|Sakshi

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తన సంచలన నిర్ణయాన్ని మరోమారు ప్రస్తావించారు. ఎట్టిపరిస్థితుల్లో తమ ప్రభుత్వం కేరళలో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయబోదని ప్రకటించారు. 

కేరళ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం అమలు చేసే విషయంపై ఒక స్పష్టతతోనే ఉంది. ఎట్టిపరిస్థితుల్లో అమలు చేయం. ఈ నిర్ణయం కొనసాగుతుంది అంతే. అని వ్యాఖ్యానించారు.  రాజ్యాంగంలో పేర్కొన్న లౌకికవాద సిద్ధాంతాన్ని అంతా పాటించాల్సిందే. కానీ, దేశమంతటా  లౌకికవాదాన్ని దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతోంది. ఒక వర్గం దీనిని బాగా ప్రచారం చేస్తోంది. మతపరమైన పౌరసత్వం కోసం ఉవ్విళ్లూరుతున్నారు వాళ్లు. కానీ, అలాంటి వాటికి కేరళ వ్యతిరేకమని గుర్తించాలి.

దేశంలో జరిగిన కొన్ని సర్వేలు మతపరమైన విద్వేషాలకు దారి తీశాయని, కానీ, ఇక్కడ మాత్రం మొత్తం సమాజాన్ని ఒక కుటుంబంగా చూస్తుంది మా ప్రభుత్వం.  ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తైన సందర్భంగా..  గురువారం ఓ ఫంక్షన్‌కు హాజరై సీఎం పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. 

పౌరసత్వ చట్టం(సవరణ)2019..  2019 డిసెంబర్‌ 11వ తేదీన పార్లమెంట్‌లో పాస్‌ అయ్యింది. డిసెంబర్‌ 12న నోటిఫై చేసి.. జనవరి 10 2020 నుంచి అమలు చేయాలని అనుకుంది కేంద్రం.  కానీ, ఇంకా ఆచరణకు నోచుకోలేదు. ఇదిలా ఉంటే.. పౌరసత్వ సవరణ చట్టాన్ని కరోనా ప్రభావం తగ్గిన వెంటనే అమలు చేస్తామంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కిందటి నెలలో  పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ సభలో ప్రకటించారు. 

మరిన్ని వార్తలు