తెలంగాణలో రాహుల్‌ జోడో తెచ్చిన మార్పేమైనా ఉందా! కాంగ్రెస్‌ పరిస్థితేంటీ?

14 Nov, 2022 20:39 IST|Sakshi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చారు, వెళ్లారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగిసింది. మహారాష్ట్రలో వెళ్లిపోయింది. ఇంతకీ 12 రోజుల పాటు రాహుల్ తెలంగాణలో గమనించిన అంశాలేంటీ? తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించారా? ఆయన నడుస్తున్న సమయంలో వచ్చిన మునుగోడు షాక్‌ ఇబ్బంది పెట్టిందా?

తెలంగాణలో గ్రాండ్‌ ఎంట్రీ
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమై.. ఒక్కో రాష్ట్రాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తోంది. గత నెల 23న కర్నాటక నుంచి మక్తల్‌లోని కృష్ణా బ్రిడ్జి ద్వారా తెలంగాణలో అడుగు పెట్టారు రాహుల్ గాంధీ. 12 రోజుల పాటు 375 కిలోమీటర్ల దూరం నడిచి నిజామాబాద్‌ జిల్లా నుంచి మహారాష్ట్రలో ప్రవేశించారాయన. మక్తల్ దగ్గర ఎంటరై.. జుక్కల్ మద్దునూర్ వద్ద రాహుల్ గాంధీకి వీడ్కోలు పలికారు. 

కలివిడిగా అడుగులు
రాహుల్ పాద యాత్ర తెలంగాణలో ఉత్సాహంగా సాగిందన్నది కాంగ్రెస్‌ నేతల మాట. దారివెంట వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ రాహుల్ నడిచారని గాంధీ భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. బ్రేక్ సమయంలోనూ ప్రజలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని, రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారని చెబుతున్నారు.

పాదయాత్రలో రాహుల్ వెంట నడిచిన వారిలో బీడీ కార్మికులు, ఉద్యోగులు, ప్రైవేట్‌ సిబ్బంది, గల్ఫ్‌లో పని చేసే వారి కుటుంబాలు, ఇతరత్రా కలిశారు. వేర్వేరు వృత్తి కులాల కార్మికులు రాహుల్ గాంధీని కలిసారు. దారి పొడవునా రాహుల్ ప్రజలు తరలి రావడం రాహుల్‌లో పలుమార్లు జోష్‌ పెంచింది. తెలంగాణలో ఆయన ప్రధానంగా ఎంచుకున్న అంశాలు.. విద్య, వైద్యం, నిరుద్యోగం. అందుకే ఆ సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై  రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. 
చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నిందితుల బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ఇమేజ్‌ బిల్డింగ్‌కు ప్రయత్నాలు
తనను కలిసేందుకు  వచ్చిన వారిని ఉత్సాహ పరుస్తూ రాహుల్ ముందుకు సాగారు. గోండులు, కోయలతో కలిసి నృత్యాలు చేశారు. చర్నాకోలతో విన్యాసం చేశారు. విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు. వారు చేసిన కరాటే వంటి ప్రదర్శనలు చూసి ప్రోత్సహించారు. విద్యార్థులతో కలిసి పరుగెత్తారు. ఒగ్గు కళారూపాలు తిలకించారు. వారితో కలిసి డోలు వాయించారు. ఇలా అన్ని వర్గాలతోనూ మమేకమవుతూ రాహుల్ గాంధీ తమ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారన్నది కాంగ్రెస్ నేతల మాట. హైదరాబాద్ లో చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన స్థూపంపై రాహుల్ గాంధీ జాతీయ జెండా ఎగరేశారు. నెక్లెస్ రోడ్డు ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ప్రసంగించారు. 

టార్గెట్‌ మోదీ, కేసీఆర్‌
తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రధానంగా మోదీ, కెసీఆర్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో సమస్యలు ఎత్తి చూపుతూ కేసిఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  మోదీ, కేసిఆర్ ఇద్దరు మిత్రులేనని మరీ మరీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని, ధరణి వల్ల భూములు కోల్పోయిన వారి భూములు తిరిగి వారికే ఇస్తామని భరోసా ఇచ్చారు. అత్యంత కీలకమైన పొత్తుల అంశంపై ఊహాగానాలకు రాహుల్ తెర దించారు. టీఎర్ఎస్ తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. 

అయినను సీన్‌ సితారే.!
రాహుల్ పర్యటనలో కొన్ని లోపాలూ ఉన్నాయి. పార్టీకి అత్యంత కీలకమైన పర్యటన అయినా.. నేతలంతా ఒక్క తాటిపై నిలబడినట్టు కనిపించలేదు. సొంతింటి అసమ్మతి రాగం ప్రతీ చోటా వినిపించింది. అలాగే రాహుల్‌ తెలంగాణలో పర్యటిస్తుండగానే మునుగోడు ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ గెలిచి ఉంటే... మొత్తం పాదయాత్రకే ఒక కొత్త జోష్‌ వచ్చి ఉండేది. కనీసం రెండో స్థానమైనా పరువు కాపాడుకోగలిగేది. 

కానీ.. వాటన్నింటికి భిన్నంగా మూడో స్థానానికి పరిమితమై.. పాదయాత్ర వేళ రాహుల్‌ను, కాంగ్రెస్‌ శ్రేణులను నిరాశకు గురి చేసింది. రాష్ట్ర సమస్యలపై రాహుల్ వేర్వేరు చోట్ల మాట్లాడినా.. దానికి కచ్చితమైన పరిష్కారాలను సూచించలేకపోయారు. తాము అధికారంలోకి వస్తే.. ఇలా చేస్తామన్న విశ్వాసాన్ని తెలంగాణ ప్రజల్లో కల్పించలేకపోయారు. ఎన్నికలకు ఏడాది మంది రాహుల్‌ కష్టపడి పాదయాత్ర చేసినా.. అది కాంగ్రెస్‌ను తెలంగాణలో ఎంత వరకు అధికారానికి చేరువ చేస్తుందో చెప్పలేని పరిస్థితి.

మరిన్ని వార్తలు