అయోమయంలో కాంగ్రెస్‌.. రేవంత్‌ స్ట్రాటజీ వర్కవుట్‌ అవుతుందా?

4 Aug, 2022 12:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేలా కనిపించిన కాంగ్రెస్ తీరా పోలింగ్ ప్రక్రియలో చతికిల పడింది. టీడీపీతో పొత్తు కాంగ్రెస్ పార్టీ పుట్టిముంచిందంటూ... కాంగ్రెస్ పాతకాపులు ఎన్నికల తరువాత పంచనామా చేసి ప్రకటించారు. తాము ఎంత మొత్తుకున్నా వినకుండా ఢిల్లీ పెద్దలు... బలవంతంగా చంద్రబాబును అంటగట్టారని నిట్టూర్చారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటి సాఫ్ట్ లీడర్‌ నాయకత్వం పార్టీని అధికారంలోకి తేలేదని కాంగ్రెస్ గ్రహించలేకపోయింది. అందుకే ఉత్తమ్‌ తరువాత పక్కపార్టీ నుంచి వచ్చిన రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు పీసీసీ పీఠం అప్పగించారు. ఓటుకు నోటు వంటి తీవ్రమైన కేసులున్నా... రేవంత్ దూకుడు తమకు పనికి వస్తుందని కాంగ్రెస్ పెద్దలు ఆశించారు. అందుకే రేవంత్ తీసుకున్న ప్రతీ నిర్ణయానికి అండగా నిలిచారు.
చదవండి: టీఆర్‌ఎస్‌లో టెన్షన్‌.. మునుగోడుపై ‘ఐ ప్యాక్‌’ కీలక‌ నివేదిక! 

తొలినాళ్లలో సీనియర్లతో కాస్త ఇబ్బంది పడ్డా... చివరికి రేవంత్‌రెడ్డి పార్టీని తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. టీడీపీలో కలిసి పనిచేసిన సీతక్క, వేం నరేందర్‌రెడ్డి లాంటి ఒకరిద్దరు నేతలతో ప్రారంభించి ఇప్పుడు రేవంత్ తనకంటూ బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన నాయకులను తిరిగి వెనక్కి తెచ్చెందుకు రేవంత్ తెరవెనక మంత్రాంగం ప్రారంభించారు. ప్రతీ జిల్లాలో తన వర్గానికి టికెట్లు వచ్చేలా ఇప్పటి నుంచే రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. తన వ్యతిరేకులకు చెక్ పెట్టే విధంగా ఢిల్లీ పెద్దలు తనతోనే ఉన్నారనే సంకేతాలు వచ్చేలా రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. కాంగ్రెస్ నుంచి నాయకులు టీఅర్ఎస్‌లోకి వెళ్లినా క్యాడర్‌ మాత్రం బలంగానే ఉంది. కేసీఆర్‌పై తనదైన స్టయిల్‌లో విమర్శలు చేసే రేవంత్‌రెడ్డి.. టీఆర్ఎస్‌కు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం అనే సంకేతాలిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.  

జిల్లాల్లోని నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ బలపడిందనే సిగ్నల్ ఇవ్వాలన్నది రేవంత్ స్ట్రాటజీ. రాహుల్ గాంధీని రెండురోజుల పాటు తెలంగాణాలో తిప్పడం ద్వారా పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరిచేందుకు టీ కాంగ్రెస్‌ ప్రయత్నించింది. ఇక టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ మధ్య సంబంధాలపై ఉన్న అనుమానాలకు రాహుల్ చెక్ పెట్టారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు అసంభవం అంటూ రాహుల్ ద్వారా గట్టి మెసేజ్ ఇప్పించడంలో  రేవంత్ సక్సెస్ అయ్యారు. హుజురాబాద్ ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలైనప్పటికీ... రేవంత్ తన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఎమ్మెల్యే స్థాయి నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా టీఆర్‌ఎస్‌కు సవాల్ విసరాలనేది కాంగ్రెస్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. చేరికలపై దూకుడుగా ఉన్నా స్థానిక నేతలకు సమాచారం ఇవ్వడంలేదనే ఆరోపణలతో పార్టీలో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. 

టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న  నేతలను టార్గెట్  చేయడం ద్వారా అధికారపక్షం బలహీనపడుతోందనే మెసేజ్ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. అయితే అనుకున్న స్థాయిలో చేరికలు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ బలపడలేకపోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక చాలా చేరికలకు సంబంధించి స్థానికంగా ఉన్న సీనియర్లకు అభ్యంతరాలున్నాయి. అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీలో చేరికలు పార్టీని బలోపేతం చేయడం కంటే బలహీనపరుస్తున్నాయనే మెసేజ్ వెళుతోంది. అయితే ఇప్పటికే పార్టీకోసం పనిచేస్తున్న నాయకులను కాదని బయటి నుంచి వచ్చేవారికి అవకాశాలివ్వడం ఏంటనే విమర్శలూ వస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో చేరికల విషయంలో కాంగ్రెస్ అయోమయంలో ఉంది.
చదవండి: ఆకర్ష ఆకర్ష! బీజేపీ బిగ్‌ ప్లాన్‌.. గులాబీ నేతల్లో గుబులు!

మరిన్ని వార్తలు