పళనికి షాక్‌.. ఓ ఎమ్మెల్యే జంప్‌.. చిన్నమ్మతో కలిసి వ్యూహం అమలు? 

29 Aug, 2022 08:39 IST|Sakshi
పన్నీరు సెల్వంతో ఎమ్మెల్యే అయ్యప్పన్‌ తదితరులు   

సాక్షి, చెన్నై: పళనిస్వామి వెన్నంటి ఉన్న వారిని తన వైపునకు తిప్పుకునేందుకు పన్నీరు సెల్వం  ఆకర్షణ మంత్రాన్ని ప్రయోగించే పనిలో పడ్డారు. చిన్నమ్మ శశికళతో కలిసి ఈ వ్యూహాన్ని ఆయన  అమలు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు ఫలితంగా పళని శిబిరం నుంచి ఓ ఎమ్మెల్యే , మరికొందరు నేతలు జంప్‌ అయ్యారు. వీరంతా ఆదివారం పన్నీరుకు జై కొట్టారు. అడీఎంకేలో పళని స్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోర్టు రూపంలో పార్టీ సమన్వయ కమిటీ తన గుప్పెట్లోకి రావడంతో పన్నీరు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పళనిస్వామికి వ్యతిరేకంగా ఉన్న వారు, అసంతృప్తి వాదులకు గాలం వేసే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఏకంగా దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళతో కలిసి పన్నీరు కొత్తఎత్తులు రచిస్తున్నట్లు       తెలుస్తోంది.  

మరికొందరు క్యూలో.. 
చిన్నమ్మ శశికళతో కలిసి రచిస్తున్న వ్యూహానికి ఫలితం ఆదివారం లభించడం గమనార్హం. మదురై జిల్లా ఉసిలం పట్టి ఎమ్మెల్యే అయ్యప్పన్‌తోపాటుగా ఆ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు పన్నీరుకు ఆదివారం జై కొట్టారు. పళని శిబిరంలో ఉంటూ పన్నీరుపై విరుచుకు పడ్డ ఈ అయ్యప్పన్‌ ప్రస్తుతం శిబిరం మార్చేశారు. కోర్టు ఆదేశాలు, అందులోని అంశాలకు కట్టుబడి తాను పన్నీరు సెల్వం శిబిరంలోకి వచ్చానని అయ్యప్పన్‌ ప్రకటించారు. చెన్నై గ్రీన్‌ వేస్‌ రోడ్డులోని పన్నీరు నివాసంలో జరిగిన భేటీ అనంతరం అయ్యప్పన్‌ మీడియాతో మాట్లాడారు. తానే కాకుండా తనతో పాటుగా మరి కొందరు ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారని, అందరూ పన్నీరు సెల్వం వైపుగా వచ్చేడం ఖాయమని ప్రకటించారు.
చదవండి: ‘మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది’

అదే సమయంలో పన్నీరు సెల్వం పేర్కొంటూ, మరి కొద్ది రోజుల్లో చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి టీటీవీ దినకరన్‌ను కలవనున్నానని, వారిని పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం గమనార్హం.  ఈ పరిణామాల నేపథ్యంలో పళని శిబిరానికి చెందిన నేతలు జయకుమార్, ఆర్‌బీ ఉదయకుమార్‌ స్పందిస్తూ, నోట్లను ఎరగా వేసి నాయకులు, స్వర సభ్య సమావేశం సభ్యులను తన వైపుగా తిప్పుకునే ప్రయత్నంలో పన్నీరు సెల్వం ఉన్నారని ఆరోపించారు. ఒక్క ఎమ్మెల్యే వెళ్లినంత మాత్రాన తమకు వచ్చిన నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు