అస్సలు పట్టించుకోని కేసీఆర్‌ సర్కార్‌.. తీర్థం ఇచ్చేందుకు సిద్ధమైన కమలం పార్టీ

31 Jan, 2023 15:32 IST|Sakshi

రాజకీయాల్లో కొందరిని అదృష్టం వెంటాడుతుంది. మరికొందరిని దురదృష్టం వదలనంటుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దురదృష్టం వెంటాడుతున్న నాయకుడు ఒకరున్నారట. ఎన్నికల్లో ఓడిపోవడం, గెలిచినా ఆ పదవి కొద్ది కాలమే ఉండటంతో.. కొంతకాలంగా ఆ నేత రాజకీయాల్లో ఉన్నారా లేరా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తుండటంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రంగంలోకి వస్తారా? రారా ? అని ఆయన అనుచరులు ఎదురుచూస్తున్నారట?

తేరా చిన్నపరెడ్డి. నల్లగొండ జిల్లాలో రాజకీయ దురదృష్టవంతులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తే టక్కున గుర్తుకు వచ్చేది ఆయన పేరే అని సెటైర్లు వేస్తుంటారు కొందరు విశ్లేషకులు. ఎందుకంటే... పొలిటికల్గా ఆయన ట్రాక్ రికార్డు అలా ఉంది మరి. చట్టసభలోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన తేరా చిన్నపరెడ్డి 2009 నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో పోటీ చేశారు.

కానీ ఆయనను విజయం వరించలేదు. ఓటమి మాత్రమే పలుకరించింది. మామూలుగా అయితే ఓ రాజకీయ నాయకుడు వరుసగా ఓడిపోతూ వస్తుంటే కూడబెట్టిన ఆస్తులు కరిగిపోయి నడిరోడ్డుపై నిలబడతారని అంటారు. కానీ వ్యాపారంలో సంపాదించిన వేల కోట్లు ఉండటంతో ఆయన మరో ప్రయత్నంగా నాలుగోసారి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో నిలిచారు. ఈసారి అదృష్టం కలిసి వచ్చింది. తెలంగాణ శాసనమండలికి ఎన్నికయ్యారు. కానీ అది కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది.

మామూలుగా ఎమ్మెల్సీ అంటే ఆరేళ్లు ఉంటుంది. అయితే ఆయన పోటీ చేసింది ఉప ఎన్నిక కావడం..ఆ పదవి గడువు మూడేళ్ళే ఉండటంతో తేరా ఆశ సగమే తీరింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గులాబీ బాస్ ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో.. ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జిల్లాలో ముఖ్యమంత్రులు, మంత్రులు పర్యటించినా కూడా కనిపించడం మానేశారు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ తేరా చిన్నపరెడ్డి రాజకీయాల్లో కొనసాగుతారా? లేదంటే పాలిటిక్స్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా అనే చర్చ ఓ రేంజ్లో జరుగుతోంది. 

ఆశ ఉంది కానీ.. అవకాశాలే తక్కువ
నాగార్జునసాగర్ నియోజకర్గానికి చెందిన తేరా చిన్పప రెడ్డి ఫార్మా రంగంలో వ్యాపారం చేస్తూనే తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో నాగార్జున సాగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. తొలి ఎన్నికల్లోనే జానారెడ్డి లాంటి సీనియర్ నేతకే ముచ్చెమటలు పట్టించారు. కానీ ఆ ఎన్నికల్లో 6 వేల 214 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా పోటీచేసి గుత్తా సుఖేందర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు.

ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ గూటికి చేరారు. 2016లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీభత్సంగా ఖర్చు చేశారని ప్రచారం జరిగినా...అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ సమయంలోనే రాజకీయం తన వల్ల అవుతుందా అని తనను తాను ప్రశ్నించుకున్నారట చిన్నపరెడ్డి. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్రెడ్డి మునుగోడు నుంచి విజయం సాధించడంతో ఎమ్మెల్సీ సీటుకు ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో తేరాను అదృష్టం మొదటిసారి పలకరించింది. రాజగోపాల్రెడ్డి గెలిచిన సీటులో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి శాసనమండలిలో అడుగు పెట్టారు. 

కారులో సీటుందా?
శాసనమండలి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలవడంతో ఆయన పదవి కాలపరిమితి గత ఏడాదే ముగిసింది. కాని గులాబీ బాస్ తేరాకు రెన్యువల్ చేయలేదు. చిన్నపురెడ్డి విజ్ఞప్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ మన్నించలేదు. శాసనమండలి సభ్యత్వం మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసిపోవడంతో..ఏడాదిగా రాజకీయ కార్యక్రమాల్లో ఎక్కడా ఆయన కనిపించడంలేదు. దీంతో చిన్నపరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారా అనే చర్చ మొదలైంది. జ్యోతిష్యుడి ఆజ్ఞ లేనిదే అడుగు కూడా బయట పెట్టరని చిన్నపరెడ్డికి పేరుంది. మరి జ్యోతిష్యుడి ఆదేశాల కోసం తేరా ఎదురు చూస్తూ రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్నారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

మరోవైపు ఆయనకు కాషాయ తీర్థం ఇచ్చేందుకు కమలం పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ కండువా కప్పి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయిస్తే బీజేపీకి లాభం చేకూరుతుందని నేతలు భావిస్తున్నారట. ఇప్పటికే ఒకసారి చర్చలు కూడా జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి చిన్నపరెడ్డి బీజేపీలో చేరతారా... లేక బీఆర్ఎస్లోనే కొనసాగుతారా లేక రాజకీయాల నుంచే తప్పుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.  కాలు కదిపేందుకు కూడా జ్యోతిష్యుడి ఆదేశాల కోసం ఎదురుచూసే తేరా చిన్నపరెడ్డి రాజకీయ జాతకాన్ని.. ఆయన గురువు ఎటువంటి మలుపు తిప్పుతారో చూడాలి.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
చదవండి: ఈటల ఇలాకాలో కేటీఆర్‌కు నిరసన సెగ.. మంత్రిని నిలదీసిన చేనేత కార్మికులు

మరిన్ని వార్తలు