నామినేషన్ అందుకే ఉపసంహరించుకున్నా.. ఎవరూ కిడ్నాప్ చేయలే.. ట్విస్ట్ ఇచ్చిన ఆప్ అభ్యర్థి..

16 Nov, 2022 19:52 IST|Sakshi

సూరత్‌: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సూరత్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తమ అభ్యర్థిని బీజేపీ కిడ్నాప్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అంతేకాదు తమ నేతను బెదిరించి బలవంతంగా నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని, దాన్ని అధికారికంగా ఆమోదించవద్దని ఆప్ నేతలు ఎన్నికల సంఘాన్ని కూడా కోరారు.

అయితే అనూహ్యంగా ఆప్ అభ్యర్థి కంచన్ జరీవాల్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వీడియో సందేశం విడుదల చేశారు. తన మనస్సాక్షి చెప్పినట్టే చేశానని, స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదని, ఎవరూ ఒత్తిడి చేయలేది స్పష్టం చేశారు. దీంతో ఆప్‌ నేతలు షాక్ అయ్యారు.

ఆప్ అభ్యర్థిగా ప్రచారం చేసే సమయంలో నియోజకవర్గంలో చాలా మంది ప్రజలు తనను కేజ్రీవాల్ పార్టీ తరఫున పోటీ చేయొద్దని కోరారని కంచన్ జరీవాల్ చెప్పుకొచ్చారు. తనను యాంటీ నేషనల్, యాంటీ గుజరాత్ అని పిలిచారని పేర్కొన్నారు. అందుకే ప్రజల అభీష్టం మేరకే తన మనస్సాక్షి చెప్పేది పాటించి పోటీ నుంచి స్వతహాగా తప్పుకుంటున్నట్లు చెప్పారు.

అంతకుముందు తమ అభ్యర్థిని బీజేపీ గూండాలు కిడ్నాప్ చేశారని ఆప్ తీవ్ర ఆరోపణలు చేసింది. బలవంతంగా లాక్కెళ్లి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని వీడియో షేర్ చేసింది. అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించింది.
చదవండి: గుజరాత్‌లో ట్విస్ట్‌.. నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన అభ్యర్థి కిడ్నాప్‌.. ఆ తర్వాత..

మరిన్ని వార్తలు